3098* వ రోజు...........           22-Apr-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

రెస్క్యూ టీమ్ వారి 3098*వ విడత శ్రమదానం!

         అంటే - అది సోమవారం (22/4/2024) నాటిది, 8 మందికి పరిమితమైనది. వేకువ 4.20 - 6.10 సమయానిది, అటుగా వచ్చే - పోయే వారు చోద్యం చూడటం తప్ప అగి వేలు పెట్టనిది!

         చల్లపల్లే కాదు - సమీప శివరాంపురం, పాగోలు, వెంకటాపురం, నడకుదురు, విజయవాడ, బందరు దిశగా NH 216 వంటి రహదార్లలోనూ పచ్చదనం, పరిశుభ్రత, రోడ్ల మన్నికలను శ్రద్ధగా చూసుకొనే శ్రమదానమది!

         ముందస్తు నిర్ణయం ప్రకారం ఈ కార్యకర్తలు పా(ల) గో(వు) లు రోడ్డులో NTR పాఠశాలకు పడమర డ్రైన్లో శ్రమించారు. వాళ్లు పంచ పాండవులు, 200 గజాల బారూ, 2 గజాల లోతూ, మూణ్ణాలుగు గజాల వెడల్పూ - చాల వరకు ఎండిపోయిన మురుగు కాల్వలోనే వాళ్ల కృషి!

         వేసవి ఉక్క పోత వాతావరణం, డ్రైన్ లో ముళ్లకంపా, ఎండు వరిగడ్డి పీచులూ, బోల్డన్ని ఎండుటాకులూ, పుల్లలూ - వాళ్ళు ప్రోగులు చేస్తుంటే గాని తెలియలేదు - అక్కడ బళ్ల కొద్దీ వ్యర్ధాలున్నాయని! గంటా ఏభై నిముషాలు శ్రమించాక గాని తెలియలేదు - ఈ ఆరేడుగురి కష్టంతో ఆ వీధి సౌందర్యం ఆహ్లాదకరంగా మారుతుందని!

         పాగోల్నుండి వచ్చిన ఒక వృద్ధ కార్యకర్త మాత్రం రోడ్డును చీపురుతో ఊడ్చి తుక్కుల్ని చాల వరకు తొలగించాడు!

         6.30 సమయంలో వీళ్ళంతా చేసిన శ్రమను చెప్పుకోలేదు గాని - చల్లపల్లి కేంద్రంగా తమ భవిష్యత్ కృషిని నినాద రూపంలో ప్రకటించారు - బృందావనుడి నాయకత్వంలో!

   అంకితులు మన చల్లపల్లికి 69

సర్పంచికి పెనిమిటిగా రాజేంద్రుని హోదా

ఊరి పైన పెత్తనానికున్నది తన కర్హత

ఐనా ఊరి చెత్త మురికి పనులే తన కిష్టము

పుట్టిన తన ఊరి పట్ల పుట్టెడు మమకారము!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

  22.04.2024