3102* వ రోజు...........           26-Apr-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

నాల్గు బాటల కూడలి వద్దనే 20 మంది శ్రమ - @3002*

            తొమ్మిదిన్నరేళ్లకు పైగా అది విరామ మెరుగని శ్రమ! అటు గ్రామ బాధ్యతే తెలియని కొందరు వీధి పారిశుద్ధ్య విచ్ఛిన్నకారులూ - ఇటు పాతిక - ముప్పై- నలభై మంది అయాచిత శ్రమదాతలూ! ఉభయులూ వెనక్కి తగ్గనప్పుడు - ఈ సమ ఉజ్జీల పోరాట ఫలితం ఎప్పటికి తెమిలేను?

            ఏ ఒక్క స్వచ్ఛ కార్యకర్తా, ఏ ఒక్క రోజూ వీధికెక్కి శ్రమించనవసరం లేని మంచి కాలం ఈ చల్లపల్లికి ఎప్పుడు వస్తుంది?

            మనకోసంమనంట్రస్టు తరపున 20 మంది ఉద్యోగులు రహదార్ల వెంట - ఎంపిక చేసిన కొన్ని అపరిశుభ్ర ప్రదేశాల్లో నిత్యమూ శ్రమించనవసరమే లేని ఘడియలు ఇంకెంత దూరంలో?

            ఈ మహా గ్రామం మెరుగుదలకు కంకణం కట్టుకొన్న సదరు ట్రస్టుకు చెందిన ట్రాక్టర్లూ, వీడ్కోలు వాహనాలూ, నీళ్ల టాంకర్లూ, వ్యాన్లూ ఇంకా ఒక కారూ - మొత్తం 11 వాహనాలు ఇన్ని వ్యయ ప్రయాసల్తో నిర్దిష్ట కాలావధి లేకుండా తిరుగుతూనే ఉండాలా?

            గ్రామ - దేశ - ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మహనీయులు ప్రోత్సహిస్తున్న ఊరి బాగుదల శ్రమదానం ఇంకెప్పటికి 100 శాతం గ్రామస్తులకు తెలిసొచ్చేను? అసలీ ప్రశ్నలన్నిటికీ జవాబు లెప్పటికి లభించును?

            చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమంలో పాల్గొనకున్నా - అభిమానించే వాళ్ళున్నట్టే - లోతుగా ఆలోచించని కొందరికిదొక రొడ్డ కొట్టుడుగానూ, చర్విత చర్వణంగానూ, పాడిందే పాటరా.... అన్నట్లూ ఉండవచ్చు గాని...

            ఇది సృజనాత్మకమే కాకపొతే -  వాలంటీర్లకు సంతృప్తిదాయకమే కాకుంటే 3002* వ వేకువ కూడ వేసవి ఉక్కపోతకు ఎదురొడ్డి, బెజవాడ రోడ్డులోని 6 వ నంబరు కాల్వ వంతెన వద్ద ఈ కష్టతర పారిశుద్ధ్య కృషి జరిగేదా?

            నిన్న ఏరిన చోటనే మరొక గోతాం నిండా మద్యం నీళ్ళ ఖాళీ సీసాలు ఏరకపోతే -  పంట కాల్వ గట్ల వెంట పది మంది శ్రమించకపొతే ఇవి కూడా తక్కిన ఊళ్ళ కాల్వ గట్లలాగే ఉండేవి కావా?

            పనుల మీద పొరుగూళ్లకు వెళ్లి వచ్చే చల్లపల్లి వారు అక్కడి వీధుల శుభ్ర - హరిత సౌందర్య - సౌకర్యాలలేమికీ తమ ఊరి మెరుగుదలకూ తేడా గ్రహించాలి కదా?

            6.30 తర్వాత నూతక్కి శివబాబు ముమ్మారు స్పష్టపరచిన శ్రమదానోద్యమ నినాదాలూ, DRK గారి సంతోషపూర్వక సమీక్షా వచనాలూ, అడపా వారి వివేకానంద సూక్తులూ విన్పించాయి.

            శనివారం (27.4.24) వేకువ కూడ మనం బాగు చేయవలసింది ప్రాతకాలపు సారా బాట్లింగ్ కంపెనీ – (విజయవాడ బాటలో) దగ్గరే!

     అంకితులు మన చల్లపల్లికి - 73

స్వచ్చోద్యమ సాహసికుడు - యోగాభ్యాస శిక్షకుడు

చల్లపల్లి JVV జయకారక శ్రామికుడు

చాల చాల రంగాల్లో సమాచార ప్రవర్తకుడు

ఇంకెవ్వరు - నారంశెట్టి వేంకటేశ్వరుండాతడు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త          

   26.04.2024