1959* వ రోజు....           23-Mar-2020

 క్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1959* వ నాటి పని వివరాలు. 

ఈనాటి వేకువ కూడ యథా తథంగా 4.05 నుండి 6.10 నిముషాల దాక జరిగిన గ్రామ శ్రమదాన ప్రయత్నంలో 28 మంది స్వచ్చ కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి ప్రాంతాలలోనే- కమ్యూనిస్టు వీధి, బాలాజి అపార్ట్మెంట్స్ సమీపంలోని విజయవాడ రహదారి లోనే కొనసాగిన గ్రామ-శుభ్ర-సుందరీకరణ సమాచారం:

            అసలే దేశాన్ని వణికిస్తున్న కరోనా- కల్లోలం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల హెచ్చరికల నేపధ్యంలో కూడ సడలని పట్టుదలతో 20 మందికి పైగా స్వచ్చ ఉద్యోగ- కార్యకర్తలు తమ శ్రమను సొంత ఊరికంకితం చేయడం విశేషం! చతుశ్చక్ర కాటా ఆవరణలో తమ వాహనాలను నిలిపి, (చీపుళ్లు- కత్తులు-రంపాలు-దంతెల వంటి) ఆయుధదారులై, పిచ్చి, ముళ్ల కంపల్ని నరకడం, రోడ్డును, డ్రైన్లను, వాటి గట్లను, ఊడ్చడం, విచక్షణారహితంగా విద్యుత్  ఉద్యోగులు నరికిన చెట్లను ఉన్నంతలో సుందరీకరించడం- డ్రైను లోను, గట్ల మీద నరికి పడేసిన కొమ్మల్ని రెమ్మల్ని, ఆకుల్ని ఇతరేతర వ్యర్ధాలను పోగులు చేయడం, కొన్ని పూల మొక్కల కుదుళ్లను చక్కదిద్ది, చుట్టూ కంపను సరి చేయడం వంటి పనులన్నీ 6.05 నిముషాలకు - పని నిలుపుదల సమయానికల్లాపూర్తి చేసిన ఈ కార్యకర్తలు తామనుకొన్న గ్రామ కర్తవ్యాలను పూర్తి చేయనే చేశారు.

            సుందరీకరణ కార్యకర్తలు నిశ్శబ్దంగా కమ్యూనిస్టు వీధిలో తమ పని ముట్ల, రంగు డబ్బాల, కుంచెల, తదితర సామాన్ల ట్రక్కును వీధి మధ్యలో నిలిపి ఎత్తైన పై అంతస్తు భవనం గోడకు రంగులు పులుముతూ కనిపించారు. 6.30 నిముషాలకు మిగిలిన కార్యకర్తలు ఇళ్లకు చేరుకొంటున్న సమయంలో కూడ ఈ సుందరీకర్తల కృషి, అక్కడ చేరి వీరి కృషిని చూస్తున్న కొంతమంది ప్రేక్షకుల ఆసక్తి ఇంకా కొనసాగుతూనే ఉన్నవి.

            6.30 నిముషాలకు ముగుస్తున్న స్వచ్చ కార్యకర్తల దైనందిన కృషి సమీక్షా సమావేశంలో కార్యకర్తల ఈనాటి శ్రమదాన దీక్ష కన్నా కరోనా సంబంధిత జాగరూకతల విషయమే ఎక్కువగా ప్రస్తావించబడింది. ప్రభుత్వ ఆదేశాలు, పౌరులు స్వచ్ఛందంగా పాటించదగిన మెళకువలు, ఆస్పత్రుల, కార్యాలయాల ముందు జాగ్రత్తలు చర్చకు వచ్చినవి.

  ధ్యాన మండలి/ స్వచ్చ చల్లపల్లి కార్యకర్త గోళ్ల వేంకట రత్నం ముమ్మారు నిష్ఠగా ప్రకటించిన స్వగ్రామ స్వచ్చ సుందర సంకల్ప నినాదాలను  మిగిలిన కార్యకర్తలు పునరుద్ఘాటించి విజయవంతమైన నేటి కార్యకర్తల కృషి రేపటికి వాయిదా పడింది.

 రేపటి మన స్వచ్చంద శ్రమదాన దీక్ష ఈ విజయవాడ మార్గంలోనే- నారాయణ రావునగర్ ముఖ ద్వారం దగ్గరనే ఆగి కొనసాగిద్దాం.        

     స్వచ్చతా పరిధి

పర్యావరణ భద్రత ఈ భారత ఖండ మొకటె కాదు

స్వచ్చోద్యమ మనగా ఒక చల్లపల్లి అనే కాదు-

సకల జగతి అణువణువున స్వచ్చత విహరింపవలెను

సమస్త జనుల హృదయాల్లో స్వచ్చత వికసింప దగును!

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

సోమవారం – 23/03/2020

చల్లపల్లి.