1961*వ రోజు....           25-Mar-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!  

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1961* వ నాటి నిస్వార్ధ పరిచర్యలు:  

            4.09 కి 15 మంది, 4.30 కి మరో 18 మంది వచ్చి, మొత్తం 33 మంది కార్యకర్తల సార్ధక శ్రమదానంతో – 1) విజయవాడ దారి, 2) కమ్యూనిస్ట్ వీధి అనుకొన్నంత మేర శుభ్ర – సుందరములుగా మారిపోయినవి.

            బాలాజీ అపార్ట్మెంట్ దగ్గరనే ఈ రోజు కూడ ఆగి కత్తులు, చీపుళ్ళు, డిప్పలు, దంతెలు తీసుకొని, అక్కడ నుండి దక్షిణ దిశగా – అనగా చల్లపల్లి వైపుగా – రోడ్డుకు ఇరువైపులా – (అక్కడ చేరి, టీ – కాఫీ – సిగరెట్ల ఆనందం పొందే వాళ్ళ సాక్షిగా) అన్ని రకాల వ్యర్ధాలను నరికి, ఊడ్చి, పోగులు చేసి, ట్రాక్టర్ లో నింపి, సమీపం లోని చెత్త కేంద్రానికి తరలించారు.

            బోగన్ విలియా వంటి కొన్ని పూల మొక్కల కుదుళ్లను సరిజేసి, పొందికగా త్రాళ్లతో కట్టి – ముగ్గురు కార్యకర్తలు శ్రమించారు. అనధికారిక ఎగ్జి బిషన్ ప్రాంతంలోను, నారాయణరావు నగర్ వీధి మొదట్లోను అరట్రక్కు చెత్తను – చచ్చి, కుళ్లి, కంపు గొట్టే పిల్లులుతో సహా – ఓపికగా తొలగించారు.

            గత వారం రోజులుగా వృక్ష రక్షకులు” గా మారిన గ్రామ రక్షక దళం ఈరోజు కూడ వికృతంగా కన్పించే కొన్ని మొండి చెట్లను రంపంతో సమాన స్థాయికి కోసి, ఇక ముందు ఇవి ఆకుపచ్చ గొడుగులుగా రూపొందే ప్రణాళిక అమలుచేశారు.

             సుందరీకరణ బృందం కమ్యూనిస్ట్ వీధి లో తమ కొత్త భావాలను చిత్ర లేఖనంగా ఆవిష్కరిస్తూనే ఉన్నారు.

            ఈ రెండు గంటల సమయం తప్ప – అత్యవసర కాలంలో తప్ప – స్వచ్చ కార్యకర్తలు కరోనా కారణంగా ఇళ్లకే పరిమితం కావాలని భావించారు.

            రేపటి శ్రమదానం కోసం ఈ విజయవాడ బాటలోనే – ఎగ్జిబిషన్ స్తలం దగ్గర కలుద్దాం!

            శ్రమ సంస్కృతి స్ధిరత్వం....

ఎద ద్రవించు గుణ ముంటే ఈ శ్రమదానం చాలద?

కన గలిగితె దినదినమూ కనపడు ఈ విశిష్టత!

స్వచ్చోద్యమ చల్లపల్లి జన హృదయం మార్చబోద?

శ్రమ సంస్కృతి ఇకనైనా స్థిరపడదా ఊరిలోన?

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

బుధవారం – 25/03/2020

చల్లపల్లి.