1962*వ రోజు....           26-Mar-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం! 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1962* వ నాటి శుభ్ర – సుందరావిష్కరణలు

            ఈ వేకువ 4.11 కు 12 మందిగా, మరో 10 నిముషాల్లో 31 మందిగా విజయవాడ బాటలో – నారాయణరావు నగర్ (గురుకుల పాఠశాల నామ ఫలక) ప్రవేశ మార్గం దగ్గర మొదలైన స్వచ్చ కార్యకర్తల శ్రమదానం ఆ తరువాత కమ్యూనిస్ట్ వీధిలోకి విస్తరించి, 6.15 నిముషాల దాక కొనసాగినది.

            తేదీలు, ఋతువులు మారుతున్నవి; స్వచ్చ సైనికుల ప్రణాళిక, దీక్ష, కర్తవ్య పరాయణత మారడం లేదు. ఎండ – వానలు, మంచు – ఈదురు గాలులు, చివరికి ప్రాణాంతక వైరస్ లు సైతం ఆపలేకపోతున్న ఈ చల్లపల్లి స్వచ్చోద్యమానికి మా ప్రణామాలు! ప్రామాదిక వైరస్ ల కు తొలిమలి వైద్యాలు స్వచ్చ – శుభ్రతలే! చల్లపల్లి పౌర సమాజానికి ఈ పాఠం బోధనకే 1962* రోజుల చల్లపల్లి కార్యకర్తల స్వచ్చోద్యమ శంఖారావం!

            - ఎగ్జిబిషన్ స్థలం దగ్గర నుండీ దక్షిణంగా – ఇంచుమించు చిన్న కార్ల షెడ్ల దాక – డ్రైన్లలోని, గట్టు మీది కాలుష్యకారక – అందవిహీనక వ్యర్ధాలాన్నిటినీ, నరకడం – ఎండుటాకుల్ని – కొమ్మ - రెమ్మల్ని ఊడ్చి ట్రాక్టర్ లో కి నింపుకొని, చెత్త కేంద్రానికి తరలించడం, అక్కడక్కడ పూల మొక్కల కుదుళ్లను చక్కదిద్ది ఆసరాలు అందించడం, గడ్డిని, పిచ్చి మొక్కల్ని చెక్కడం వంటి నిత్యకృత్యాలే ఈ రోజు కూడ. మొండి చెట్లను సమంగా రంపంతో కోసి, కొన్నాళ్ళకు వాటి సుందరాకృతులకు నాంది పలకడం కూడ యధాతధమే!

            కమ్యూనిస్ట్ వీధిలో సుందరీకరణ యజ్ఞం పొడిగించబడుతూనే ఉంది. వీళ్ళ చిత్ర లేఖనా విశేషాలను సామాజిక మాధ్యమం (వాట్సాప్ – “సంగతేమిటి?”) లోనూ గమనించవచ్చు. అవకాశం వస్తే ఆ వీధిలోకి వెళ్లినపుడు పరిశీలించనూ వచ్చు. ఐతే – ఇన్ని దినాలుగా – ఇంత వ్యయప్రయాసలతో గ్రామ స్వచ్చ – సుందరీకరణ కృషి ఎందుకు – ఎలా జరుగుతున్నదనేది మాత్రం అందరం ఆలోచించక తప్పదు.            

            రేపటి స్వచ్చంద శ్రమదానం కూడ విజయవాడ మార్గంలో – నేడు ఆపిన చోటి నుండే మొదలెడదాం!

                 కరోన – కరోన

కరోన నేపధ్యంలో కర్ఫ్యూ విజయవంత మాయె!

స్వచ్చ – శుభ్రతలకు చేయి కలపరేల గ్రామస్తులు?

స్వస్తత కు – సమున్నతికి – సమాజ పురోగమనానికి

ఎంత చొరవ – ధైర్యమెంత – ఈ విషయంలో కావలె?

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

గురువారం – 26/03/2020

చల్లపల్లి.

4.11 కు విజయవాడ రోడ్డులో