1963*వ రోజు....           27-Mar-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!  

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1963* వ నాటి ప్రాభాత ప్రాంగణ శ్రమదానం

            4.08 నుండి 6.15 దాక నేటి వేకువ మొదలై జరిగిన 32 మంది కార్యకర్తల స్ఫూర్తిదాయక గ్రామోపయోగ శ్రమదానం అటు విజయవాడ మార్గంలోని చిన్న కార్ల షెడ్డు దగ్గర, ఇటు కమ్యూనిస్ట్ వీధిలోన యధావిధిగా జరిగిపోయింది.

            ఎందులోను – ఎక్కడా మార్పులేదు. ఇళ్ల నుండీ విజయవాడ రహదారి మీదికి వచ్చేలా పడుతున్న ఇళ్ల వ్యర్ధాలు గాని, ఏపుగా పచ్చగా పెరిగిన అందమైన చెట్లను దయారహితంగా నరికి, డ్రైనులో గట్టు మీద వదిలేయడంలో గాని, చిన్న, పెద్ద  వ్యర్ధాలను ఇళ్లపై నుండి రోడ్ల మీదికి విసురుతున్న కొందరు జనంలో గాని... మార్పు లేనట్లే ఊరి బాహ్య స్వచ్చ – శుభ్ర – సౌందర్యాల కోసం ప్రాకులాడుతున్న ఈ స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తల ప్రయత్నంలో కూడ మార్పేమీ లేదు; ఎవరి అలవాట్లు, ఎవరి బాధ్యతలు వారివే!

            నిన్నటి వలెనే 20 మందికి పైగా కార్యకర్తలు డ్రైను లోపల, గట్ల మీద కనపడే, పిచ్చి మొక్కల్ని, గడ్డిని, ఖాళీ మద్యం సీసాలను, రకరకాల చెత్తను, నరికి, కోసి, ఏరి దంతెలతో లాగి, పోగులు చేసి, డిప్పలతో ట్రాక్టర్ లో నింపి, దగ్గరలోనే ఉన్న చెత్త కేంద్రానికి తరలించారు. ఇప్పుడు – వారం రోజుల నుండీ ఇంతనిష్ఠగా వీరు నిర్వహిస్తున్న శుభ్రతతో ఈ దారి మరో రెండు నెలల పాటు బహుశా అందంగా కనిపించవచ్చు. వస్తున్నది వేసవి గావున పిచ్చి – ముళ్ళ – మొక్కల, గడ్డి బెడద లేకపోవచ్చు. కాని, మనుషులు విసిరే ప్లాస్టిక్ సంచుల, త్రాగి పారేసే ఖాళీ సారా సీసాల సంగతేమిటి?

            సుందరీకరణ వ్యసన పరుల చేష్టలు కమ్యూనిస్ట్ వీధిలో నిరాటంకంగా కొనసాగడాన్ని, వాట్సాప్ ఛాయాచిత్రాల ద్వారా నైనా గ్రామస్తులు వీక్షించండి. లేదా “మనకోసం మనం” ఫేస్ బుక్ లో పరీక్షించండి. గ్రామంలోని మీమీ వీధులు ఇప్పుడు కమ్యూనిస్ట్ వీధిలాగా అందంగా – శుభ్రంగా – ఆహ్లాదకరంగా ఉన్నాయేమో పోల్చండి, పోటీ పడండి.

            దయచేసి, గ్రామస్తులంతా ఆరోగ్యాన్ని బాగా నిర్వహించుకొంటూ ఇళ్లకే పరిమితమై – గ్రామాన్ని,దేశాన్ని కరోనా నుండి కాపాడుకొనే దీక్షలో ఉండండి!

            రేపటి స్వచ్చంద శ్రమదాన వేడుక కూడ విజయవాడ మార్గంలోని 6 వ నంబరు పంట కాలువ – చిన్న కార్ల షెడ్డు మధ్యస్థ ప్రాంతంలోనే! కార్ల షెడ్డు వద్ద కలుద్దాం. 

           విప్పిచెప్ప జూస్తున్నా...

స్వచ్చత కిదె మార్గమనీ – చాల చాల సులభమనీ

కాలుష్యం తరిమేస్తే గ్రామహితం మన సుఖమని

ప్లాస్టిక్ ఫ్లెక్సీలెంతో ప్రామాదిక హేతువులని  

అరదశాబ్ది పైగా ఈ స్వచ్చసేన చాటెననీ..... 

నల్లూరి రామారావు

స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శుక్రవారం – 27/03/2020

చల్లపల్లి.

4.08 కు విజయవాడ రోడ్డులో