1861* వ రోజు....           16-Dec-2019

          

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1861* వ నాటి అడుగులు.

 

యథాప్రకారం- చల్లపల్లి స్వచ్చోద్యమ నియమానుసారంగా-ఈ సోమవారం వేకువన కూడ చల్లపల్లి ప్రధాన కేంద్రం అంటే విజయవాడ-అవనిగడ్డ-బందరు రోడ్ల కూడలి నుండి ద్విముఖంగా విస్తరించిన స్వచ్చంద శ్రమదానం 4.00 – 6.10 నిముషాల నడుమ 26 మంది కార్యకర్తల సమయ త్యాగంతో నిరాటంకంగా జరిగింది.

 

నాగాయలంక దారిలోని పోస్టాఫీసు అడ్డ దారి మొదలుకొని, ఉభయ పెట్రోలు బంకుల మీదుగా-ATM సెంటరు, పూల, కూరల, బహిరంగ బట్టల కొట్టుల మీదుగా- బందరు మార్గంలో పోలీస్ స్టేషన్ బజారు దాక సాగిన స్వచ్చతా మెగుదల కృషిలో:

 

- కొందరు ప్లాస్టిక్ వ్యర్ధాలు సేకరిస్తే

- కొందరు చీపుళ్లతో దారి కిరుప్రక్కల ఊడ్చి శుభ్రతరం కావిస్తుంటే.

- కొందరు రోడ్డు కంటుకొన్న – బిగిసిన మట్టి, ఇసుకలను గోకి డిప్పలతో ట్రస్టు యొక్క ట్రక్కు లోనికెక్కిస్తుంటే-

- ఈ అందరి సమిష్టి కృషితో కొబ్బరి టెంకులు, దేవాలయాల దగ్గరి పూల, ఆకుల వ్యర్ధాలు, చిత్తు పేపర్ల ముక్కలు- అన్నీ ట్రాక్టర్ ట్రక్కులో నిండి, చెత్త కేంద్రానికి తరలుతుంటే-

- ఈ కొద్ది మంది దీక్షకే ప్రధాన మార్గంలోని ¾ కిలోమీటరు రోడ్డు స్వచ్చ-శుభ్ర-సుందరంగా మారిపోయింది.

 

 నిన్న మొన్నటి శ్రమదానం జరిగిన ప్రభుత్వాసుపత్రి దారిలో శేషించిన గుంటలు నింపి, ప్రయాణీకుల సౌకర్యం కల్పించే కృషి కూడ ఈ రోజు కూడాకొనసాగింది.

 

 

ఇద్దరు ట్రస్టు కార్మికులు వేకువ 4.00 నుండే గ్రామంలోని అన్ని రోడ్ల ప్రక్క చెట్లకు నీరు అందించే పని చేస్తూనే ఉన్నారు.

 

స్వచ్చోద్యమ చల్లపల్లి లో “ ఆల్ రౌండర్ “ గా గుర్తింపబడిన బృందావన్ చిన్న కొడుకు గంధం జశ్వంత్- తన అగ్రజుడు తర్షిత్ తో బాటు వచ్చి తన 7 వ పుట్టిన రోజు జరుపుకొని “మనకోసం మనం “ ట్రస్టుకు 701/- విరాళం ఇచ్చినందుకు ధన్యవాదాలు, చిరంజీవులిద్దరికీ ఆశీస్సులు. తర్షిత్ ముమ్మారు ప్రకటించిన స్వచ్చోద్యమ నినాదాలతో 6.40 కి నేటి మన బాధ్యతలు ముగిసినాయి.

 

రేపటి మన కార్ర్యక్రమం కోసం విజయవాడ దారిలో కార్ల షెడ్డు వద్ద కలుసుకొందాం.

 

         స్వచ్చ సుందర పాన శాలలు

ఇదే సమకాలీన సంస్కృతి- ఇదే వృద్ధని అదే ముద్దని

త్రాగకుంటే తప్పు తప్పని-త్రాగుడే ప్రభుతలకు మేలని

మంచి చెడ్డలు, తారు మారై కాలమెంతగ మారిపోయేనొ

స్వచ్చ సుందర చల్లపల్లొక పానశాలగ మారి పోయెనొ!    

 

     నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

సోమవారం – 16/12/2019

చల్లపల్లి.