1862 * వ రోజు....           17-Dec-2019

          

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1862* వ నాటి శ్రమదాన సంగతులు.

 

 

 మళ్లీ విజయవాడ దారిలోనే-మురికి-చెత్తలమయమైన పాత కార్ల షెడ్డు ప్రాంతంలోనే నేటి ఉదయం 4.05-6.20 నిముషాల నడుమ జరిగిన ఆదర్శవంతమైన శ్రమదానంలో 31 మంది తరించారు. వారం రోజులుగా ఇందరు కార్యకర్తలు అన్ని రకాల మురికి మీద కాలుష్యం మీద ఇక్కడే ఇంతగా శ్రమిస్తున్నా, షెడ్డు యాజమానులు తమ షెడ్డు మలినాలను, వ్యర్ధాలను నిర్లక్ష్యంగా వదిలేయడం ప్రశ్నార్ధకమౌతున్నది.

 

ఈ రోజు కూడ ఇదే విజయవాడ మార్గంలో మూడు చోట్ల- మూడు విధాలైన స్వచ్చ విధులు నిర్వర్తించారు:

 

1) విజయా కాన్వెంట్- ప్రభుత్వాసుపత్రి మార్గంలోని అన్ని గుంటలను అక్కడి మట్టి తోనే పూడ్చి, వాహనదారులకు మరింత భద్రత, సౌకర్యం సమకూర్చారు. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలను గుర్తించుకోనట్లే-ఇన్ని వందల మంది వాహన దారులు కూడ నాల్గు రోజులుగా తమ దారిని ఇంత స్వచ్చ-శుభ్ర-సౌకర్యంగా మార్చిన స్వచ్చ కార్యకర్తల తో చేతులు కలపరు!

 

2) సుందరీకరణ బృందం కృషిని కొత్తగా చెప్పేదేముంది? నీటి పారుదల శాఖ భవనం, వ్యవసాయ శాఖల భవనం ప్రహరీలను శోభాయమానంగా తీర్చిదిద్దడంలో లీనమై పోయి, గ్రామస్తుల ఆహ్లాదమే తమలోకమైపోయి, మురుగు వాసన, రంగుల వాసనలకు అలవడిపోయి... వాళ్ల ఆనందం వాళ్ళది!

 

3) 20 మంది కి పైగా రాటు తేలిన స్వచ్చ సైనికులు పాత కార్ల షెడ్డు నుండి నారాయణ రావు నగర్ మార్గం దాక(ఈ కృషి ఇటీవల మూడవ మారు) దారి కిరుప్రక్కల పునః పునః స్వచ్చ శుభ్రతా సాధన కంకితులైపోయారు. ఐతే వీళ్ల కృషికి సమాంతరంగా ఆ ప్రాంత నివాసులు యథా శక్తిగా వ్యర్ధాలను డ్రైన్ల లో విసురుతూ, స్వచ్చ సైనికులకు పని కల్పిస్తూనే ఉన్నారు.

 

గోళ్ల వేంకటరత్నం స్వచ్చ-హరిత వేడుక విందుల కోసం ఒక పెద్ద పాత్రను  బహుకరించి, ముమ్మారు గ్రామ స్వచ్చ-శుభ్ర-సౌందర్య సంకల్ప నినాదాలను ప్రకటించి, అడపా గురవయ్య కొన్ని యథార్థ  జీవన సత్యాలను పునరుద్ధరించి, 6.50 నిముషాలకు నేటి బాధ్యతలు ముగించారు.

 

రేపటి శ్రమదాన వైభవం కూడ విజయవాడ మార్గంలోని ప్రభు ఇంటి దగ్గర!

 

               వాళ్లు మినహా ....

వాళ్లు లేనిదె చల్లపల్లికి హరిత స్వచ్చతలందవందురు

అసలు బ్రహ్మ ముహుర్తమందలి స్వచ్చ గీతికలుండవందురు

వాళ్లు మినహా గ్రామ స్వస్తత వట్టి మాటని కొందరందురు

ఎవరు-ఎవరా ధన్యజీవులు? స్వచ్చ సుందర సైనికులె గద!

 

     నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

మంగళవారం – 17/12/2019

చల్లపల్లి.