1863* వ రోజు....           18-Dec-2019

          

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1863* వ నాటి ఉత్సాహాలు.

 

నేటి బ్రహ్మ ముహూర్తాన 4.02-6.15 నడుమ సమయంలో కూడ కార్యకర్తల శ్రమదాన బాధ్యతల నిర్వహణ విజయవాడ మార్గంలో కోట మలుపు నుండి నారాయణ రావు నగర్ ముఖ ద్వారం మధ్యనే జరిగింది. పదే పదే చేసిన చోటనే స్వచ్చ కృషి చేస్తుండటం- చూసే వారికి విసుగేమో గాని, తామనుకొన్నది సాధించే దీక్షలో ఈ 31 మందికి మాత్రం కాదు!

 

కోట మలుపు దగ్గర గత భారీ వర్షాలకు పడిన పెద్ద గుంటలను పంచాయతీ వారు పెద్ద రాళ్లతో పూడ్చగా, స్వచ్చ కార్యకర్తలు మట్టి తో చిన్న రాతి ముక్కల వ్యర్ధాలతో చదును చేసి ఆ కీలక ప్రాంతం లో వేలాది వాహన దారుల రాకపోకలను సుగమం చేశారు. విజయా కాన్వెంట్ సమీపంలో ఈ రోజు పూడ్చిన గుంటలతో అక్కడి పని పూర్తైంది.

 

అగ్రహారం ప్రవేశం దారిలో – వ్యవసాయ శాఖ పాత భవనం, నీటి పారుదల శాఖ భవనం ప్రహరీలకు ఈ రోజు సుందరీకరణ యోగం పట్టింది. ఐదుగురు ఆ రెండు గోడలను పూల, లతల బొమ్మలతో సౌందర్యమయం చేశారు.

 

20 మందికి పైగా ఎక్కువ శ్రమించింది మాత్రం ప్రభు ఇంటి సమీపంలో రహదారికి ఉత్తర, దక్షిణ భాగాలలోనే, పొలం వైపు, డ్రైను గట్టును కూడ వీళ్లు పట్టి పట్టి శుభ్రపరిచారు. ఈ ప్రాంతంలో నాలుగవ నాడు కూడ ట్రక్కు నిండా వ్యర్ధాల సమీకరణ జరగడం గమనార్హం.

 

ఈ స్వచ్చ కృషి ముగింపు సమయంలో:-

 

1)పెడన పట్టణానికి చెందిన బాషా బృందం వారి బహుముఖ కృషి, వారు నిన్న చల్లపల్లిని సందర్శించి, దాసరి

రామకృష్ణ ప్రసాదు గారి ద్వారా 1863 రోజుల నిరంతర కృషిని వివరంగా తెలుసుకొని నిబిడాశ్చర్యపోవడం ప్రస్తావించబడింది.

2) నిన్న నడకుదురు దగ్గర అతి ఘోరమైన ప్రమాద మరణం చూసిన దేసు మాధురి కార్యకర్తలందర్నీ విధిగా శిరస్త్రాణాలు ధరించమని అభ్యర్ధించారు.

3) ట్రస్టు కార్మికులు డంపింగ్ యార్డు దగ్గర నుండి తెచ్చిన తేగలను అందరికీ పంచారు.

4) పద్మావతి గారు రేపటి విశాఖ ప్రయాణ సన్నద్ధతను గుర్తు చేశారు.

5) ముందుగా హుషారైన వాన పాట పల్లవిని పాడి ఆస్పత్రి నర్సు మహాలక్ష్మి స్పష్టంగా ముమ్మారు గ్రామ స్వచ్చ సంకల్ప నినాదాలను ప్రకటించడంతో 6.55 నిముషాలకు నేటి స్వచ్చంద శ్రమదానం పరి పూర్తయింది.

 

రేపటి స్వచ్చ చర్యల కోసం నారాయణ రావు నగర్ ముఖ ద్వారం వద్ద విజయవాడ దారిలో కలుసుకుందాం!

 

        పదే పదే వివరిస్తా

సిద్ధాంతాలు వల్లెవేస్తే చెత్త పనులు సాగవనుచు.....

ఆశయానికి కాచరణకు అంతరమిక కూడ డనుచు....

పద్దెనిమిది వందల దిన స్వచ్చోద్యమమే ఋజువుగ....

స్వచ్చోద్యమ చల్లపల్లి సాగుతోంది చూడండని......

 

     నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

బుధవారం – 18/12/2019

చల్లపల్లి.