2021*వ రోజు....           24-May-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు.

2021* వ నాటి శ్రమదాన వైవిధ్యం.

          నికరమైన బ్రహ్మముహూర్తాన – 3.58 నుండి 6.12 నిముషాల దాక – మహాబోధి పాఠశాల ప్రాంగణ గౌతమబుద్ధుని సాక్షిగా పాగోలు పరిధిలోని రహదారి కుడి ఎడమలలో 55 మంది సమాజ కార్యకర్తల శ్రమదాన విన్యాసాలు యధేచ్చగా సాగిపోయాయి. రెండు వారాల స్వచ్చ – సుందర తపోదీక్షా దక్షతతో ఈ మార్గమంతా కొత్త జీవకళతో చూసి, నడచి తీరాలనిపిస్తున్న సంగతి సరేగాని – ఈ విభిన్న నేపధ్యాల స్త్రీ – బాల – వృద్ధ – ఔద్యోగిక – వృత్తి నిపుణ వ్యక్తుల తాత్త్విక పునాదులేమిటి? 2021 దినాలుగా ఏ బలీయశక్తి వీళ్లని తమ గ్రామ సమాజ సంక్షేమానికి అంకితుల్ని చేయగలుగుతున్నది?

          2600 ఏళ్ళ నాడు “బుద్ధం శరణం గచ్చామి (జ్ఞానాన్ని శరణుజొచ్చుతాను) – సంఘం శరణంగచ్చామి (సమాజ శ్రేయోదాయక మార్గాన్నే ఆశ్రయిస్తాను) - ధర్మం శరణం గచ్చామి (ఉత్తమ జీవిత ధర్మాన్నే శరణు జొచ్చుతాను) అనే ఆచరణ పూర్వక మూడు కొత్త మంత్రాలతో ఆసియా ఖండం మొత్తాన్ని 1200 ఏళ్ళకు పైగా మారు మ్రోగించి, సక్రమ మార్గాన నడిపిన బుద్ధుని ఉద్యమంతో ఈ స్వచ్చోద్యమాన్ని పోల్చజాలను గాని – స్వార్ధం బలిసి, పొరుగువాడి మేలును మరచి, ఆటవిక స్వామ్యాన్ని తలపిస్తున్న ఈ 21 వ శతాబ్ది సమాజానికి – అతి సామాన్యులు చూపిస్తున్న ఒక స్వచ్చోద్యమ మేలి మార్గమని మాత్రం చెప్పగలను!

ఈ 2021 వ రోజున స్వచ్చోద్యమకారుల్లో :  

- కొందరు పాగోలు డ్రైను పై ఉన్న వంతెనను అత్యంత స్వచ్చ – శుభ్ర – సముచిత వర్ణరంజిత సుస్యందనంగా మార్చివేశారు. 

- మరికొందరు పాఠశాల దక్షిణ కంచె బయటి రెండవ చిట్టడవిని సమూలచ్చేదం చేస్తూ విజృంభించారు. నరికిన ఆ అడవిని గొర్రులతో కొందరు గుట్టలుగా లాగారు.

- దారి ప్రక్క ముళ్ల – పిచ్చి కంపలను ఎండు గడ్డిని, మాదక ద్రవ ఖాళీ సీసాలను కొందరు విసుగు చెందని విక్రమార్కులు నరికి, పీకి, ఏరి ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి చేర్చారు.

- అరకిలోమీటరుదారంట తిరుగుతూ, వీళ్ళందరి స్వచ్చంద శ్రమదానాన్ని పర్యవేక్షిస్తూ – ముగ్ధుడైపోతూ ఒక డాక్టరు గారు జాగ్రత్త వహించారు.          

- ఒక శాస్త్రి గారు ఆయాసపడుతూనే ఈ అర్ధ శత కార్యకర్తల స్వేదపూర్వక శ్రమ సమాచారాన్ని కెమేరా లో బంధిస్తున్నారు.

          ఇన్ని వేల రోజులైనా – మరెన్ని వేల రోజులైనా – చల్లపల్లి స్వచ్చోద్యమ కధ ఇదే! గత వారం రోజులుగా నా మనస్సులో ఒక క్రొత్త రకం ఆరోగ్య సమీకరణం కనిపిస్తున్నది: ఈ బ్రహ్మ ముహూర్తాన ప్రతి కార్యకర్త కార్చే ప్రతి చెమట బొట్టు అతని ఆరోగ్యానికి శ్రీరామరక్ష! తన కోసం కాక – ఉమ్మడి శ్రేయస్సు కోసం కనుక అది దశవిధ గుణాత్మకం! అంటే 10 రెట్ల ప్రతిఫలమన్నమాట!

          వాసన వేంకటకృష్ణారావు గారు తమ వివాహ సంధర్భంగా కార్యకర్తలందరికీ బొబ్బట్ల విందు చేసి, మనకోసం మనం ట్రస్టుకు అందించిన 1000/- విరాళానికి, నేటి రామబ్రహ్మం గారి రసోపేతమైన విందుకూ ధన్యవాదములు. 

          కొన్నాళ్ళ విరామం తరువాత పతీసమేతంగా స్వచ్చంద శ్రమదానానికి విచ్చేసిన పల్నాటి అన్నపూర్ణ గారు అందుకు సమంజసమైన కారణాలను తెలిపి, ఈ స్వచ్చ సుందర ఉద్యమాన్ని అభినందించి మూడు మార్లు మన గ్రామ స్వచ్చ సుందర సంకల్ప నినాదాలను ఉద్వేగపూరితంగా ప్రకటించడంతో అక్కడి బుద్ధ విహారం సాక్షిగా 6.20 నిమిషాలకు నేటి మన స్వచ్చోద్యమ కధ ముగిసింది.    

          రేపటి మన శ్రమదాన వేడుకకు వేదిక ఈ పాగోలు మార్గమే!

         నిజంగానే మేలుకొలుపా?

మురుగు గుంటల మునక లేసీ – శ్మశానాలు నవీకరించీ       

సందుగొందులు రాచబాటలు హరిత సుందరమయం చేసి

రాష్ట్రములకూ – దేశములకూ ఉదాహరణ ప్రాయమౌతూ

చల్లపల్లి ని నిజంగానే స్వచ్చ సైన్యం మేలుకొలిపిందా!

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

ఆదివారం 24/05/2020,

చల్లపల్లి.