2023*వ రోజు....           26-May-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు.

2023* వ నాటి శ్రమదాన వివరాలు.

            ఇది 2023 వ రోజైతే మాత్రమేం? 4.00 సమయంలో వేకువ చీకట్లోనే- తమ తమ ఇళ్ల నుండి 3.40 కే బయల్దేరి, 3-4-5 కిలో మీటర్ల దూరంలోని పాగోలు బాటలో- మహాబోధి పాఠశాల మలుపు దగ్గర ఆగిన 39 మంది కార్యకర్తలు- పని మొదలు పెట్టారు. పురోహితుడు పెట్టిన పెళ్లి ముహూర్తమో – దేవుడికి చేసే వ్రత నియమమో కాదే- వీళ్లవన్నీ మురికి పనులు- కరకు పనులు- రొచ్చు పనులు- మ్రుచ్చు ముళ్ల దారి పనులు! అదీ తమ సంపాదన కోసం కాక, ఊరి మేలు కోసం తమకు తాము విధించుకొన్న- వేల దినాల నుండి క్రమం తప్పక నియమ నిష్ఠా గరిష్టంగా చేస్తున్న- ఈ కలికాలపు -2020 వ సంవత్సరంలో చాలా మంది చీదరించుకొనే పనుల కోసం- ఏదో తెలియని ట్రాన్స్ లో పడి40-50 మంది ఇలా ఎందుకొస్తారో -  బైట వాళ్లకేం తెలుస్తుంది? తొలి రోజు నుండి స్వచ్చోద్యమంతో అనుబంధం పెనవేసుకొన్న నా బోటి వాళ్లకు తెలుస్తుంది. నిత్యం చూస్తున్న చల్లపల్లి, పరిసర గ్రామాల –మనసున్న ఏ 20-30 శాతం ప్రజలకో తెలుస్తుంది! ఇంకా- ఈ గ్రామాల డజన్ల కొద్దీ ప్రవాసులు, వందల వేల మైళ్ల దూరంలో ఉండి కూడా మాతృభూమి పట్ల నానాటికీ  మమకారం పెంచుకొంటున్న గ్రామంతర- రాష్ట్రాంతర-ఖండాంతర ప్రదేశాల నాదెళ్ల సురేష్, మండవ శేషగిరి రావు లాంటి వాళ్లకు కూడ ఈ నిత్య- నిర్విరామ శ్రమదాతల తపనల, చెమటల విలువేమిటో తెలుస్తుంది!

            “ఎవరి పిచ్చి వాళ్లకానందం” అని గతంలో ఒకరు కామెంట్ చేయటం నాకు గుర్తున్నది! అది నిజమే కావచ్చు! ఈ చల్లపల్లి పిచ్చి కార్యకర్తలు ఆరేళ్ల నుండి సాగిస్తున్న ఈ తిక్క పనులే లేకపోతే - ఈ మంచి గ్రామం ఇప్పటిలా కాక- ఎంత సుందర ముదనష్టంగా మిగిలిపోయేదో గదా!

            ఐతే- ఏ కఠిన వాఖ్యల్నీ పట్టించుకోని – తమ పనిలో మాత్రమే లీనమైపోయే స్థిత ప్రజ్ఞులైన ఈ వెర్రి కార్యకర్తలు ఈ రోజు ఈ పాగోలు పరిధిలో చేసిన కృషి వివరాలు:

- ఇంచుమించు పాగోలు దారి రెండో మలుపు దాక- డ్రైనులో సమస్త వ్యర్ధాలను తొలగించి, నిరర్ధక మనుకొన్న పిచ్చి –ముళ్ల పొదల్ని తప్పించి, పనికొచ్చే చెట్లను సుందరీకరించి, కొందరు సంతృప్తి చెందితే-

- ఏడెనిమిది మంది తొలి మలుపు దగ్గరి రెండో డ్రైను గట్టు వికృత పొదల్ని తొలగించారు. ( వీళ్లకీ పనిలో ఎంత దీక్షంటే- నేను ఇద్దర్ని గట్టిగా రెండు మార్లు పిలిస్తే గాని వినిపించుకోలేదు!)

- కల్వర్టు సుందరీకరణ ముగించిన సుందరీకర్తల రంగుల బృందం దృష్టి ఆ దగ్గర్లోని స్వచ్చ సుందర పబ్లిక్ టాయిలెట్ల గోడ మీద పడింది. మరొకటి రెండు రోజుల తర్వాత - ఆ గోడ ఎలా మారిపోయి, ఎందరు చూపరుల దృష్టి మరల్చుకొంటుందో చూద్దాం. ఎలాగూ ఈ చల్లపల్లి స్వచ్చ-శుభ్ర- సుందర శ్రమదానం ఒక రోజుతోనో - ఒక ఏడాదితోనో పోయేది కాదు గదా! “కాలోహ్యయమ్ నిరవధిర్విపులాచ పృధ్వీ..” (కాలానికి హద్దులు లేవు, ఈ భూప్రపంచం అతి విశాలమైనదే) అని భారవి అనే సంస్కృత కవి ఏ 1500 ఏళ్ల నాడో అన్నాడు కదా!

            దేసు మాధురి అనే ఒకానొక గ్రామ కుడ్య చిత్రలేఖనా ప్రవీణురాలు ఎందుకో గాని తీక్షణంగా ముమ్మారు చెప్పిన గ్రామ స్వచ్చ – సుందర సంకల్ప నినాదాలతో నేటికి మన శ్రమదాన సంకల్పం తాత్కాలిక విరమణ.

రేపటి స్వచ్చ కార్యక్రమ వేదిక కూడ పాగోలు రోడ్డు, అవనిగడ్డ రోడ్డుల సమీపంలోనే!

      ఎచట ఎవ్వరు? ఎవరికెవ్వరు?

ఒక మహత్తర లక్ష్యముండక- ఎవ్వరెచటో- ఎవరికెవరో!

ఇంతగా తాత్వికత చాలక- ఈ మహోద్యమ మెన్నినాళ్లో!

సహనముండక-త్యాగముండక-స్వచ్చ సంస్కృతి పెరుగుటెట్లో!

ధన్య గ్రామ చరిత్ర పుటలో స్థాన మించుక దక్కవలదో!

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

మంగళవారం 26/05/2020,

చల్లపల్లి.