2024*వ రోజు....           27-May-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు.

2024* వ నాటి శ్రమజీవన ధన్యతలు.

            గ్రామ స్వస్తత కోసం అంకితులైపోయిన స్వచ్చ కార్యకర్తలకు-“ఎన్ని వేల రోజులు - ఏమి రికార్డులు-ఎవరి మెప్పుదలలు, ఎవరెవరి దూషణ - భూషణ - తిరస్కార - పురస్కార పరంపరలు.... “వంటి వేవీ గుర్తుండవు! ద్రోణ గురువు నిర్దేశించిన “ పక్షి కన్ను” మీదే తప్ప ప్రపంచాన్ని మర్చిపోయిన అర్జునుడే వీళ్లను చూసినప్పుడు నాకు గుర్తుకొస్తాడు! ఈ నాటి వేకువ 4.05 - 6.12 వేళల నడుమ సగటున తమ ఇళ్ల నుండి 3 కిలో మీటర్ల దూరాన పాగోలు మార్గం - మహాబోధి బడి మలుపు నుండి, అవనిగడ్డ రోడ్డు దాపున మురుగు వాగు వంతెన దగ్గర, స్వచ్చ కార్యకర్తలే నిర్మించిన స్వచ్చ సుందర టాయిలెట్ల వద్ద- త్రిముఖంగా సాగిన శ్రమదానంలో 41 మందిని లెక్కించాను.

            కవుల సూక్ష్మ దృష్టి గురించి “ రవి గాంచనిచో కవి గాంచును” అని అంటుంటారు. నాకేమో ప్రతి ఉషోదయంలోను ఈ స్వచ్చంద శ్రమదాతల రకరకాల సేవల సాహస విన్యాసాలు కనిపిస్తూనే ఉంటాయి! నిన్నటి  గ్రామ స్వచ్చ- సుందర- సంకల్ప నినాదాలను దంచేసిన ఒక యువతి నేడు తెల్లవారక ముందే - “నిచ్చెన ఎక్కి మరీ- మురుగు కాల్వ ఒడ్డు మీది గోడ మీద చిత్ర లేఖన విన్యాసాలు ప్రదర్శిస్తుండగా – పాగోలు దారి మలుపులో వంగిన ఎత్తైన కరెంటు స్తంభం ఎక్కి దాలిపర్రు యువకుడొకడు అస్తవ్యస్తంగా ఉన్న చిక్కు కొమ్మల్ని నరికేస్తున్నాడు. మరొక  ఉపాధ్యాయుడు పని చేసి చేసి- వేసవి ఉక్క తీరా నీళ్లు తాగి తాగి - మూతి కున్న కరోనా చిక్కాన్ని  తొలగించి, గుండెల నిండా శ్వాస తీసుకొనే అపూర్వ శ్రమదాన విన్యాస సన్నివేశం !

            శ్రీ శ్రీ ఏనాడో చెప్పినట్లు- అసలైన చరిత్రంటే-

            “ఆరాణీ ప్రేమ పురాణం. ఈ ముట్టడికైన ఖర్చులూ-మతలబులూ- కైఫీయతులూ- ఇవి కావోయ్ చరిత్ర సారం!....”

            బ్రష్టు పట్టి - పరాన్న భుక్కుగా- తాగుబోతుగా - మారి చచ్చు పడుతున్న నేటి మన సమాజానికాదర్శం ఈ చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల నిస్వార్ధ శ్రమ జీవన సౌందర్య విన్యాసాలే సుమా!( నా వర్ణన మరీ అతిగా ఉందనిపిస్తే- మరేం పరవాలేదు- మన్నించండి) - ఏం చేస్తాం! కవుల్ని, రచయితల్నీ కదిలిస్తే కాలం అనే డొంక అమాంతం కదలక తప్పదు!)

            “ ఒకటి- రెండు రోజుల స్వచ్చ-శుభ్రత” అని దాసరి రామకృష్ణ ప్రసాదు గారు మొదట అంచనా వేసిన ఈ పాగోలు రహదారి సుందరీకరణం ఇప్పటికే 18 రోజులైనట్లుంది. బహుశా కొసరు రేపు ముగియవచ్చు - లేదంటే మరొక రోజు కూడ పడితే పడుతుంది గాని - ఇందరి ఏకోన్ముఖ – సుదీర్ఘ - స్వచ్చ-శుభ్ర- సుందరీకరణ యజ్ఞం ఫలించి బాటంతా సర్వాంగ సుందరంగా- మళ్లీ మళ్లీ వచ్చి, చూసి పోవాలనేంత చక్కగా- “ A Thing of beauty is a joy for ever...” అనిన జాన్ కీట్స్ (18 వ శతాబ్దం) వంటి భావ కవులకు ప్రేరకంగా ఉందా - లేదా? (అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం... (బ్రతుకు తెరువు సినిమాలో జూనియర్ సముద్రాల దారి పాట!)  

            మిగిలిన కొందరు కార్యకర్తలు ఈ రోజు పాగోలు దారి రెండో మలుపు దిశగా డ్రైన్ లో మిగిలిన గడ్డినీ, ఎండు ఆకులు- కొమ్మల్నీ, ప్రభుత్వాల ఆదాయాలకు హామీ ఇస్తున్న మద్యం ఖాళీ సీసాలనూ, ప్లాస్టిక్ తుక్కునూ కోసి, ఏరి, నరికి, ఊడ్చి, ఆ పోగుల్ని ట్రాక్టర్ లో నింపుకొని డంపింగ్ యార్డుకు చేర్చారు.

            కాఫీ - తేనేటి కాలక్షేపం తరువాత తాతినేని (మొక్కల) రమణ గారు స్వాభావికంగా - కూరల, పండ్ల విత్తులు సకాలంలో నాటుకొమ్మనే సూచనతో బాటు ముమ్మారు గ్రామ స్వచ్చ - శుభ్ర- సుందర సంకల్ప నినాదాలను పలికి- పలికించి - 6.25 కు నేటి గ్రామ బాధ్యతా నిర్వహణను ముగించారు.

            రేపటి మన సమాజ ఋణ విముక్తి కోసం ఈ పాగోలు - అవనిగడ్డల బాటల వద్దనే కలుసుకొందాం!   

             స్వచ్చ ఉద్యమ విశ్వరూపం.

గృహిణులూ – ఉద్యోగులూ - పించను గ్రహీతలు - వృత్తి నిపుణులు

కృషీవలురూ – ధర్మదాతలు – రాజకీయులు - వణిక్ర్పముఖులు

ఎందరో స్వచ్చోద్యమానికి వెన్నుదన్నైనిలిచి యుండగ

వెనకడుగు లేకుండ ఇకపై విశ్వరూపం చూపబోతుందా!

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

బుధవారం 27/05/2020,

చల్లపల్లి.