2036*వ రోజు....           08-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2036* వ నాటి వివరాలు.  

            ఈ వేకువ సైతం 3.57 – 6.00 నడుమ నిన్నటి చోటనే – అనగా బాలికల వసతి గృహం (1 వ వార్డు) దగ్గర ఆగి, సాగర్ టాకీస్ బైపాసు మార్గంలో ముందుకు సాగుతూ 29 మంది స్వచ్చ కార్యకర్తలు కాలుష్యం పైన పోరు సాగించారు. ముగ్గురు మాత్రం భారత లక్ష్మి రైసు మిల్లు బాట దిశగా ఉన్న డ్రైనును, రోడ్డు మీద తిష్ట వేసిన రకరకాల వ్యర్ధాలను ఊడుస్తూ, ఏరుతూ, శ్రమించారు. 15 మందికి పైగా – అశోక్ నగర ప్రాంతమంతా బాట అంచులలోని  గడ్డిని, పిచ్చి మొక్కల్ని, ప్లాస్టిక్ వ్యర్ధాలను శ్రద్ధగా సమీకరించి, ట్రస్టు సంబంధిత ట్రాక్టరు లోని కెక్కించారు, చెత్త కేంద్రానికి చేర్చారు.

            మరికొందరు సబ్బినేని బోసు గారి బాట ఉత్తర వార ఖాళీ స్థలం లోని కొంత భాగాన్ని శుభ్రం చేశారు. నలుగురు ఆ తరువాతి సజ్జా ప్రసాదు గారి వీధిలో చాల భాగాన్ని మెరుగు పరిచారు .

            నిన్నటి, నేటి ప్రాంతాల బైపాస్ దారిని కొందరు ఊడ్చి, శుభ్ర – సుందరతరం చేశారు. మొత్తం మీద విజయవాడ రోడ్డు నుండి – ఇటు బందరు రహదారి వరకూ అతి చిన్న అడ్డంకులు తప్ప ఈ బైపాస్ మార్గమంతా సంతృప్తికరంగా ఉన్నట్లే! ఎప్పటికప్పుడు కాలుష్యం అనకొండల్ని ఈ కార్యకర్తలు తరిమికొడుతున్నట్లే భావించవచ్చు. ఏరోజుకారోజు కార్యకర్తల కదన కుతూహలాన్ని గమనిస్తుంటే – ముఖ్యంగా నిన్నటి – నేటి పోరాటాన్ని గుర్తు చేసుకొంటే – శ్రీ శ్రీ మహాశయుని కవితావేశంలోని -

                        “పదండి – పదండి – పదండి  ముందుకు

                        భావ వేగమున ప్రసరించండీ....”

అనే పంక్తులు గుర్తుకు వస్తున్నాయి.

            నేటి స్వచ్చంద శ్రమదాన సమీక్షా సమావేశంలో ఏప్రిల్ – మే మాసాల జమా ఖర్చుల్ని డాక్టరు DRK గారు వివరించారు. షరా – మామూలే! లోటుబడ్జెట్లే! అవి డాక్టర్ పద్మావతి గారి వంతే. సామాజిక మాధ్యమ వ్రాతల పట్ల అప్రమత్తతను, ఇద్దరు మంచి వ్యక్తుల అనవసర రాద్దాంతాన్ని కూడ డాక్టరు గారు ప్రస్తావించారు. నేడు ముమ్మారు చల్లపల్లి స్వచ్చ – శుభ్ర – సుందర సంకల్ప నినాదాలను ప్రకటించే బాధ్యతను గోళ్ళ కృష్ణ నిర్వహించాడు.

            రేపటి శ్రమదాన వేదిక సైతం బాలికల వసతి గృహ సమీపమని నిర్ణయింపబడింది!   

 

            మూల్యాంకన కర్తలెవరు?

స్వచ్చ సైన్యం ప్రస్థానం సగర్వమా? నిగర్వమా?

స్వచ్చోద్యమ సపర్యలసలు సఫలములా? విఫలములా?

పరస్తుతులు – స్వవిమర్శలు ఫలప్రదమ? ప్రతి కూలమ?

కాలమొకటె మూల్యాంకన కర్తగ భావించ వలెన?

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు

సోమవారం – 08/06/2020,

చల్లపల్లి.