2037*వ రోజు....           09-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2037* నాటి విధి నిర్వహణాలు.  

            నేటి వేకువ 3.59 – 6.00 నడిమి వేళలో 1 వ వార్డులోని బాలికల ప్రభుత్వ వసతి గృహం దగ్గర నుండి ఉత్తర దిశగా కొనసాగిన శ్రమదానంతో ధన్యులైన కార్యకర్తలు 29 మంది. 55 కు పైగా పనిగంటల ప్రణాళికాబద్ధమైన ఈ గ్రామాభ్యుదాయకమైన స్వచ్చంద కృషి సత్ఫలితాలనిచ్చింది.

 

            అసలీ స్వచ్చోద్యమ కారుల పాదాలు నడయాడినంతమేర - వాళ్ళ నిస్వార్ధమైన చెమట చుక్కలు రాలినంతదాక ఏ వీధి అయినా - ఇరుకు దారైనా – ఖాళీ ప్రదేశమైనా – మురుగు కాలువైనా సరే – అది కాలుష్యరహితమై – అభ్యసించగలిగిన వాళ్ళకు స్వచ్చ సుందరతా పాఠ్య గ్రంధమై – మురికి, రోతలన్నీ తరిగి, సౌకుమార్యం – హరిత ఆహార్యం పెరిగి, స్వచ్చ శుభ్ర సుందరమై, మరికొంత విశాలమై, క్రొత్త నడకలు నేర్చుకొని సౌకర్యవంతమౌతుందన్నది నిరూపించిన సత్యం!

 

            ఊరి నుండి శ్మశానానికి వెళ్ళే ఈ దారి కూడ ఈ రోజు అన్ని రకాల స్వచ్చ బృందాల సమన్వయ కృషితో కాస్త విశాలంగా – కాలుష్య రహితంగా వర్షం పడినా ఫరావాలేదు - 20 - 30 మందైనా కలిసి శ్మశానానికి నడవదగినదిగా – ఈ ఉదయం మారిపోయినది! దారిప్రక్కన స్వచ్చ కార్యకర్తలిదివరలో నాటిన చెట్ల నీడలు, మండు వేసవిలో కూడ పుష్పిస్తున్న గద్ద గోరు మొక్కల పూలు శ్మశాన యాత్రికులకు, నిత్యావసరార్ధ ప్రయాణికులకు సౌకర్యాన్ని – ఆహ్లాదాన్ని పంచకపోవు!

 

            ఈ స్వచ్చంద శ్రమ దాతల కృషికి ఈ వీధి నివాసితులెవ్వరూ ధన్యవాదాలు తెలపలేదు; ఒక్కరైనా వచ్చి పాల్గొనలేదు; సంఘీభావం తెలుపలేదు. ఈ నిత్య గ్రామ విధి నిర్వాహకులకదేమీ బాధాకరం కాదు గాని సదరు గ్రామ విభాగ నివాసితుల లోపంగా, బాధ్యతా నిరాకరణగా మాత్రం నిలుస్తుంది! అంతే తప్ప – నేటి 29 మంది కర్మణ్యే వాధి కార కార్యకర్తలు మాత్రం యధాప్రకారమే – రోడ్డు ఊడ్చి, పిచ్చి – ముళ్ళ మొక్కలు నరికి, ప్లాస్టిక్కులు తొలగించి, మద్యం ఖాళీ సీసాలు ఏరి, పూల మొక్కల పాదులు సవరించి – తమదనుకొన్న బాధ్యతను నెరవేర్చనే నెరవేర్చారు!

 

 

            ఆ బాటకు చెందిన 1,2 వార్డుల ప్రజల తరపున కర్మవీరులందరికి నా ధన్యవాదాలు! తమ గ్రామ కర్తవ్య నిర్వహణలో వీరంతా (భగవత్) గీతా చార్యులు మరి!

 

            నేటి మన చల్లపల్లి గ్రామ స్వచ్చ – శుభ్ర – సుందర సంకల్ప నినాదాలను ముమ్మారు గట్టిగా విన్పించింది మాత్రం – సాధ్యమైనంత మౌనంగా – దీక్షగా కర్తవ్యాన్ని నిర్వహించే వక్కలగడ్డ వేంకటేశ్వరరావు గారే!


            రేపటి స్వచ్చంద శ్రమదాన విధులకు బైపాస్ రోడ్డు లోని అశోక్ నగర్ స్వాగతం పలుకబోతున్నది!

 

            అభివందన మందార సుమం.

ఎవరు ఆడిరి – ఎవరు పాడిరో – ఇళ్ల తలుపులు తట్టిరెవ్వరొ!

రెండు వేల దినాల తరబడి స్వచ్చ శుభ్రత పెంచి రెవ్వరొ!

స్వచ్చ – సంస్కృతి వ్యవస్థాపక సభ్యులూ, అధ్యక్షులెవ్వరొ –

అందరికి అభివందనమ్ములు – అ లౌకిక సుమ చందనమ్ములు!

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

మంగళవారం – 09/06/2020,

చల్లపల్లి.