2038*వ రోజు....           10-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2038* నాటి గ్రామ బాధ్యతా వినోదం. 

            ఈ బుధవారం వేకువ 3.58 - 6.00 మధ్యస్త వేళ ఉక్కపోత, వేడిమి కాస్త ఉపశమించిన సందర్భంలో 27 మంది స్వచ్చ వీరుల శ్రమదాన విన్యాసాలు సాగర్ టాకీస్ ఉప మార్గంలో- అశోక్ నగర పరిసరాల నుండి ప్రారంభమైనవి!

 

            నిన్న రాత్రి కొంత వాన పడితే పడింది గాక, రోడ్ల మీద, అంచుల్లో నీళ్లు నిలిస్తే నిలిచాయి గాక, ఆ తడి మీద గడ్డి - గాదం, ఎండు ఆకులు, చెత్త - చెదారం అంటుకుపోతే మాత్రం ఏమౌతుంది? జోరు వానలో, వాన గాలిలో -  వందల మార్లు పాటుబడిన ఈ శ్రమదాతల శుభ్రతా చర్యలు నిలిపోవుకదా! వీళ్ల కత్తులకు, గొర్రులకు, అడ్డ - నిలువు చీపుళ్లకు, డిప్పలతో చెత్త ఎగుమతులకు అసౌకర్యాలు అడ్డురాగలవా?

 

- వీరిలో ఐదారుగురు భారత లక్ష్మి వడ్ల మర అడ్డ బాటవైపుకు పోయి, కోవా (కోటేశ్వర రావు వాసిరెడ్డి) నిర్మిత ఉద్యాన సమీపంలో గల గడ్డి, పిచ్చి చెట్లు తొలగించి, చెరువు గట్టు మీది దిక్కు మాలిన సమస్త వ్యర్ధాలను సమీకరించి, ట్రస్టు ట్రాక్టరు లోకి ఎక్కించారు.

 

- నలుగురు బైపాస్ బాట ప్రక్కన హరిత - సౌందర్య రక్షక భటుల్లా నిలిచిన - గతంలో తామే పెంచిన - చెట్లను ట్రిమ్ చేసి, వాటి కుదుళ్లను పునరుద్ధరించి, అవసరమనుకొన్న పూల మొక్కల ముళ్ల కంచెలను సవరించి, తమ శ్రమను సార్ధకం చేశారు!

 

- ఎక్కడో గాని, డిప్పలతో మట్టిని, దుమ్మును, సేకరించిన ముగ్గురు నీటి పల్లాలను గుర్తించి, పూడ్చి సమం చేసి, రానున్న వాన ఋతువులో రోడ్డు భద్రతకు హామీ ఇచ్చారు!

 

- బైపాస్ బాటనే కాదు - ప్రక్క సందుల్లోని కొంత మేర గడ్డినీ, పిచ్చి మొక్కల్నీ - మురుగు కాల్వలో కొద్దిపాటి పూడికల పనులనూ మిగిలిన కార్యకర్తలు చూసుకొన్నారు.

 

- ముగ్గురు మహిళలు ప్రధాన ఉప మార్గాన్ని ఊడ్వడంలో ఆనందం వెదకుకొన్నారు!

            మామూలు మనుషుల - (అంటే కేవలం భౌతిక నేత్రాల వారల -) దృష్టి సంగతేమో గాని, కాస్త లోచూపు, అందంలో ఆనందం వెదకే భావుకులకు మాత్రం ఈ వినూత్న, విభిన్న, సుదీర్ఘ శ్రమదాతలనుద్దేశించి -  

 

“ అహో! కార్యకర్తా! స్వగ్రామ ప్రతివీధి కాలుష్య హర్తా!!

చిరకాల శ్రమదాన స్వచ్చ సుందర చల్లపల్లి తేజః ప్రదీప్తా!!”

అని (మంచి మనసులు లో ఆత్రేయ-1962) దిగంతాలకు విన్పించేలా కీర్తించాలనిపించింది.

 

నేటి శ్రమ వైభవ సమీక్షా సమావేశంలో – 1) మనకోసం మనం ట్రస్టు కు డాక్టరు గోపాళం గారి 5000/- విరాళం, 2) సజ్జా ప్రసాదు గారి కుండబద్ధలు కొట్టినట్లు ముమ్మారు ప్రకటించిన సొంత ఊరి స్వచ్చ – శుభ్ర – సుందర సంకల్ప నినాదాలు చోటు చేసుకున్నవి.

 

            రేపు వేకువ 4.00 కు మన శ్రమదానం జరిగేది కూడా ఈ బైపాసు మార్గమే! పాత కస్తూర్బా ఆసుపత్రి వద్ద!   

 

            నిశ్చితంగా – నిజంగానే!

 

ఇన్ని వందల నాళ్ళ నుండీ ఇదొక ప్రణవం – ఇదొక సవనం

పల్లె పల్లెన స్వచ్చ వేడుక పరిఢవిల్లు విశేష ఘట్టం

ప్రణవ మంత్రం ఓంప్రదంగా పలికె సుందర చల్లపల్లే

నిజంగా ఇది నిబ్బరంగా - నిశ్చింతంగా ముందుకెళుతుందా!

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

బుధవారం – 10/06/2020,

చల్లపల్లి.

కార్యకర్తల శ్రమతో సుందరంగా ఉన్న బైపాసు మార్గము