2039*వ రోజు....           11-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2039* నాటి గ్రామ విధులు.  

          నేటి సుప్రభాత గ్రామ స్వచ్చ సుందర బాధ్యతలలో కూడ పెద్దగా మార్పులేదు. శ్రమదాన సుముహూర్తం కూడ అదే! వేకువ 4.00 నుండి 6.00 గంటల నడిమి రెండు గంటలే. శ్రమదాన వేదిక కూడ సాగర్ టాకీస్ ఉపమార్గమే. ప్రభుత్వ కస్తూర్భా శిధిల భవన సముదాయం ప్రక్క యడ్ల వారి వీధి మొదట ఆగి, ఉప్పల వారి వీధి నుండీ సినిమా హాలు మీదుగా అగ్రహారం దాక సాగిన స్వచ్చ – శుభ్రతా ప్రస్థానం వివరాలిలా ఉన్నవి! శ్రమదాతల సంఖ్య 28.

 

          - దింటకుర్తి భవనం దగ్గర వాన నీరు చేరిన చోటు నుండి చీపుళ్ళ ఊడ్పులతో కార్యక్రమం మొదలైంది. బైపాస్ బాటకు రెండు ప్రక్కల ఏ చిన్న పిచ్చి మొక్కనూ, గడ్డినీ వదలక, అవసరమైనపుడు రోడ్డు వైపుకు పెరుగుతున్న కొన్ని చెట్ల కొమ్మల్ని కత్తిరించుకొంటూ - ఒక బృందం వెళ్లిపోయింది.

 

          - మురుగు కాల్వ నడక లెక్కడ ఆగినవో చూసుకొని, అడ్డు వచ్చిన తుక్కుల్ని తొలగించుతూ కొందరు జాగ్రత్త వహించారు. ఇక మీదట వర్షాలు పెరిగితే – డ్రైన్లు కదలక మొరాయిస్తే – ఎయో పాయింట్ల వద్ద మరామత్తులు చేయాలో వీళ్ళకొక అవగాహన ఉన్నది. చల్లపల్లి వీధులన్నిటి, మురుగు కాల్వలన్నిటి బాధ్యత తమదనుకొనే వీరికి మాత్రం ముందు చూపు తప్పదు.

 

          చీపుళ్లతో ఊడ్చిన, దంతెలతో లాగి పోగులు చేసిన వ్యర్ధాల గుట్టలన్నీ ట్రాక్టర్ లోని కెక్కి, చెత్త కేంద్రానికి చేరినవి.

 

          గత నాలుగు రోజుల్నుండి పాటుబడిన స్వచ్చ కార్యకర్తల శ్రమ ఫలించి, ఈ బైపాస్ మార్గం ఇప్పుడు అటు 1 వ వార్డు ముఖ ద్వారం నుండి – విజయవాడ రహదారి దాక శుభ్రంగా – అందంగా కనిపిస్తున్నది. చివరికి తేలేదేమంటే – స్వచ్చ కార్యకర్తల వీధి శుభ్రతా బాధ్యత వాళ్ళదే! రోడ్ల మీద, మురుగు కాల్వల్లో నికృష్ట వ్యర్ధాలను విరజిమ్మే కొందరు గ్రామస్తుల అలవాటు కూడ మరికొన్నాళ్లు ఇలా ఉండేదే!

 

          స్వచ్చోద్యమ ప్రప్రధమ దినం నుండి పాల్గొంటున్న తూములూరి లక్ష్మణరావు మహోదయుడు 6.10 నిముషాలకు ముమ్మారు ప్రకటించిన స్వగ్రామ స్వచ్చ – శుభ్ర – సుందర సంకల్ప నినాదాలను మిగిలిన కార్యకర్తలు పునరుద్ఘాటించి , నేటి తమ బాధ్యతా నిర్వహణకు తెరదించారు.

 

          రేపటి మన బాధ్యతల కోసం పెదకళ్లేపల్లి దారిలోని మేకల డొంక ప్రాంతం ఎంపిక చేయబడింది!

 

          కూటమిగా x విడివిడిగా....

ఈ స్వచ్చోద్యమ సమస్యలిద్దరొ – ముగ్గురివో కాని –

విజయాలివి అందరివని విశదముగా తెలిసి వచ్చె

కూటమితో – ఐక్యతతో క్రొత్తగ జవ సత్త్వాలని –

విడిగా ఏసైనికూడూ విజయుడసలు కాలేడని.....!

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

గురువారం – 11/06/2020,

చల్లపల్లి.