2041* వ రోజు....           13-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2041* నాటి శ్రమదాన విలాసం.  

 

ఈ రోజు వేకువ కూడ అవే సమయాలు- చీకటిలో ఉదయం 4.00 కన్నా ముందే మేకల డొంక వద్దకు చేరుకొని, 6.00 దాక శ్రమైక జీవన ప్రదర్శన చేసిన 25 మంది స్వచ్చ కార్యకర్తలకు- ఇది చల్లపల్లి పంచాయతీ పరిధి కాదు, 3 కిలో మీటర్లకు పైగా దూరం వచ్చి, శ్రమించామా అనే సందిగ్దం ఏ కోశానా కలగలేదు. శివరామపురం దారిలో- అది ఏ రైతు పొలం గట్టో తెలుసుకోలేదు, అక్కడి ప్లాస్టిక్ సంచులు, తుక్కు కాగితాలు, ఖాళీ మద్యం సీసాలు, ఖాళీ నీళ్ల సీసాలు ఎవరు విసిరితే ఆ రోడ్డు వారల, డ్రైనులోపల ఇంత అసహ్యంగా కనిపిస్తున్నవో వాకబు చేయలేదు. ముళ్ల చెట్లు, పిచ్చి మొక్కలు, ఎండు కొమ్మలు, ఇతరేతర నానాజాతి వ్యర్ధాలను తొలగించడమే- శివరామపురం దాక ఈ మూడున్నర కిలో మీటర్ల రహదారిని స్వచ్చ-శుభ్ర-సుందరం చేసి, వేలాది ప్రజలకు, వాహన చోదకులకు, మరొకమారు ఆహ్లాదం కలిగించేందుకు తమ శక్తి వంచన లేకుండ ఏ ప్రతిఫలమూ ఆశించకుండ పని చేయడమే గత 2040 రోజులుగా వీరి నిత్య కర్మ!

భగవద్గీత లో అర్జునుడికి కృష్ణ పరమాత్మ ప్రవచించిన.....

“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషుకదాచన.....” అనే మకుటాయమాన శ్లోక భావానికి ఈ కార్యకర్తల స్వచ్చోద్యమం కన్న పెద్ద ఉదాహరణ  ఏముంటుంది?

అది ఏ ఊరో- ఏ వార్డో, ఏ రోడ్డో, మురుగు కాలవో,  పంట కాలవో, గ్రామ చెరువో, గుడో, బడో,- వీళ్లకేదైనా ఒకటే- దాన్ని శుభ్రంగా, అందంగా, పచ్చదనంతో, తీర్చిదిద్దాలనుకొనే తపనే! అటు శ్రీకాకుళం- బందరు కాలవ, పాగోలు, పులిగడ్డ, వక్కలగడ్డ, నూకలవారిపాలెం వంటి అనేకానేక గ్రామాల్లో వీళ్ల స్వచ్చంద శ్రమదానాలు, తన్మూలంగా రగిలిన స్ఫూర్తి.... కోకొల్లలుగా ఉదాహరణలు!

- మేకల డొంక దాటి శివరామపురం దారికి తూర్పు దిశగా నేడు జరిగిన స్వచ్చ కార్యక్రమంలో- ప్రధాన చర్యలు రెండు-

1) రోడ్డుకు-పొలం గట్టుకు నడుమ జాగాలో మొలుచుకొస్తున్న వందలాది తాడి మొక్కల్ని సమూలంగా పెకలించడం.

2) మెరక దిబ్బగా ఒక చోట కనిపించిన జాగాలోని పిచ్చి ముళ్ల, చెట్ల కంపనూ ఖండించి, గొర్రులతో లాగి, ఖాళీ సారా సీసాలను ఏరి, ఆ సమస్త వ్యర్ధాలను ట్రస్టు ట్రాక్టర్ లోనికెక్కించి, చెత్త కేంద్రానికి చేర్చడం.

            రోడ్డంతా ఊడ్వడం, పూల మొక్కల పాదుల్ని చక్కదిద్దడం, వాటి రక్షణ కంప కంచెల్ని మరామత్తు చేయడం వంటి మరికొన్ని దైనందిన చర్యలు ఎలాగూ జరిగిపోయాయి.

ఈనాటి 6.10 సమయంలో ముమ్మారు గ్రామ స్వచ్చ-సుందర- సంకల్ప నినాదాలను ధృఢంగా వినిపించినవారు శివరామపురం గ్రామానికి చెందిన బాల దుర్గా రామ్ ప్రసాద్ గారు.

రేపటి మన శ్రమదాన చర్యలు సైతం ఈ శివరామపురం రోడ్డు లోని నేటి కార్యక్రమం ముగిసిన చోట నుండి నిర్వహించుకొందాం!

              అప్రతిహత ప్రస్థానం

చీపురు చేపట్టినపుడె చిదిమేసె నహంకారము

స్వార్థం తల ఎత్తకుండ పట్టి పట్టి పల్లార్చెను

“ నా కోసం నేను” కాదు, మనకోసం మనమనుకొని

స్వచ్చోద్యమ ప్రస్థానం సాగెను అప్రతిహతముగ!    

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

శనివారం – 13/06/2020,

చల్లపల్లి.

3.59 కి శివరాంపురమ్ రోడ్డులో