2042* వ రోజు....           14-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2042* నాటి శ్రమదాన గీతం.  

వేకువ 4.05-6.10 నిముషాల నడుమ ఈ ఆదివారం పెదకదళీపురం మార్గంలో- శివరామపురీ సమీపాన-ఇటు విద్యుత్ శాఖ వారి ట్రాన్స్ఫార్మర్ దిమ్మె నుండి- అటు కత్తుల సాన షెడ్డు దాక విజృభించిన 30 మంది స్వచ్చ కార్యకర్తల నిత్య నీరాజనార్పిత శ్రమదానం నిజంగా వర్ణనార్హం!  శివరామపురం నుండి ఐదుగురు, ముగ్గురు ట్రస్టు కార్మికులతోను, చల్లపల్లి శ్రమదాతలు 25 మంది కలిసి సమన్వయంతో- కొనసాగించిన ఆదర్శ కృషితో ఈ తారు బాట, పొలం గట్లు, డ్రైను- దాని అంచులు స్వచ్చ-శుభ్రతలను సంతరించుకొన్నాయి. అందరి సంగతి చెప్పలేను గాని, ఈ బాటలో ప్రయాణించే రకరకాల జనాల్లో కొందరైనా 3 రోజుల క్రిందటికి – నేటికి ఈ దారిలో వచ్చిన ఆహ్లాదకరమైన మార్పును గమనించక పోరు. అట్టి వారిలో కొందరైనా ప్రజా జీవితంతో స్వచ్చ-శుభ్రతలకున్న సంబంధమేమిటో, ఈ స్వచ్చ కార్యకర్తల 2041 రోజుల నిరంతర నిస్వార్ధ మహా ప్రయత్నం దేనికో ఆలోచించకపోరు. అవ్వారిలో సగమైనా ఈ స్వచ్చోద్యమ ఆశయాలను నిజ జీవితంలో ఆచరించకపోరు!

          ఐతే- ఎందుకో గాని మంచికన్న  చెడుకే - ఐకమత్యం కన్న కులమత ప్రాంతీయ కుంపట్లకే - ఋజుమార్గం కన్న అడ్డ దార్లకే; స్వచ్చ-శుభ్ర-సుందర పరిసరాలకన్న వికృత బీభత్స- అనాకారితనాలకే – బాధ్యతలకన్న హక్కులకే – కఠిన వాస్తవాలకన్న  ముఖస్తుతులకే ఈ సమాజం రానురాను ఆకర్షితమైపోతున్నది!  ఈ సువిశాల-సుహృదయ- ఆచరణశీల స్వచ్చ కార్యకర్తల సుదీర్ఘ స్వచ్చోద్యమమైనా మన సమాజంలోని కొన్ని అవలక్షణాలకైనా దివ్యఔషధం కాకపోతుందా? చూద్దాం!

- ఒకానొక వామ హస్త స్వచ్చ ఖడ్గ దారి  మరో నలుగురు కార్యకర్తల శ్రమదానంతో ఈ రహదారి కుడి ప్రక్కన- అంటే డ్రైను వైపున కూడ చెత్తా చెదారం- గడ్డి, ముళ్ల పిచ్చి మొక్కలూ తొలగిపోయి, రెండు ప్రక్కలా ఉన్న మరికొన్ని తాడి మొలకలు సమూలచ్చేదమైపోయి, నాలుగు రోజులు శుభ్ర పరిచిన దారికీ- పరచని దారికీ గిరి గీసినట్లు తేడా తెలుస్తూనే ఉన్నది.

 

- రోడ్డు లు ఊడ్చే ఈ మహిళలు మొదటి నుండి నేటి దాక ఎన్ని వందల కిలో మీటర్ల దారులు ఊడ్చి ఉంటారో చెప్పలేను. తమ నిత్య విధి ఐన స్వచ్చంద ఊడ్పు ఉద్యమాన్ని వాళ్లు నేడు కూడ కొనసాగించారు.

కాఫీ- తేనీటి ఆస్వాదనల తరువాత, నేటి శ్రమదానం గూర్చి అంతర్గత కబుర్ల పిదప, డాక్టరు గారి దైనందిన స్వచ్చ చర్యా సమీక్షల అనంతరం:

-1) రావెళ్ల శివరామ కృష్ణయ్య గారి 1000/- విరాళం మనకోసం మనం ధార్మిక సంస్థ ధన్యవాదపూర్వకంగా  స్వీకరించింది.

-2)నేటి స్వచ్చంద శ్రమదాన సరళిని అమెరికా ప్రవాసి నాదెళ్ల సురేష్ ఫేస్ టైమ్ లోశాస్త్రి గారి  ఫోను ద్వారా తిలకించారు, పులకించారు.

-3) ట్రస్టు ప్రతినిధి కస్తూరి శ్రీనివాసుడు ముమ్మారు ఎలుగెత్తి చాటిన స్వచ్చ-సుందర- సంకల్ప నినాదాలతో గాని, నేటి శ్రమదానం ముగియలేదు.

రేపటి మన శ్రమానందదాయక ప్రదేశం కూడ ఈ శివరామపురం మార్గమే!

         ఏదో ఒక నాటికైన... !

వినిపించదు స్వచ్చ గీతి విశృంఖల సమాజమున

కనిపించదు శుభ్రరీతి గజిబిజి హృదయాలలోన

స్వచ్చోద్యమ కారుల ఈ శ్రమ ఫలితం గ్రామస్తుల

ఎదలను కదిలించు తీరు ఏదో ఒక నాటికైన!

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

శుక్రవారం – 14/06/2020,

చల్లపల్లి.

 

4.02 కు శివరాంపురం రోడ్డులో
కార్యకర్తల శ్రమతో అందంగా ఉన్న శివరామపురం రోడ్డు