2043* వ రోజు....           15-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2043* వ నాటి శ్రమదాన విన్యాసం.

 

            ఈ వేకువ సైతం 4.00 - 6.00 నడిమి 2 గంటల పాటు తమ సామాజిక బాధ్యతను విస్మరించని చల్లపల్లి, శివరామపురం కార్యకర్తలు 24 మంది శివరామపురం బాటలో – నిన్నటి తమ స్వచ్చ – శుభ్రతా ప్రయత్నాలను మరికొంత పొడిగించారు. దారికి కుడి ఎడమలలో – కత్తుల సాన కొలిమి షెడ్డు మొదలుకొని, పంట కాలువ దగ్గరి పూరి గుడిసెల మధ్యన ఉన్న కొంత ప్రాంతంలో తామనుకొన్నది సాధించారు.

 

            పూర్వం రాజ్యాలకు రధ - గజ - అశ్వ - కాలిబల విభాగాల సైన్యమున్నట్లే స్వచ్చ చల్లపల్లి సైన్యంలో కూడ చీపుళ్ళ – కత్తుల – గోకుడు పారల – సుందరీకరణల చతురంగ దళాలున్నాయి! ఎప్పుడే దళం ఎక్కడ – ఎంతవరకు కాలుష్యం మీద పోరాడాలో, రెస్క్యూ దళం ఏ రోడ్ల గుంటలు పూడ్చాలో, ఏ గృహస్తుల మొండి గోడలను, దిమ్మెలను కరెంటు స్తంభాలను, విద్యుత్ పంపిణీ దిమ్మెలను కళామయం చేసేందుకు, సుందరీకరించేందుకు ఎన్ని వారాలు శ్రమించాలో – అప్పుడు – అక్కడ – ఆ సైన్య విభాగం అవసరాన్ని బట్టి పూనుకొంటుందన్నమాట! ఈ సైన్య విభాగాల పనులను మనకోసం మనం ట్రస్టు ఆర్ధిక చేయూతనిచ్చి, పర్యవేక్షిస్తుందన్న మాట! కొంత యాంత్రికంగా – కొంత క్రమబద్ధంగా – సృజనాత్మకంగా – గ్రామ స్వచ్చ – శుభ్ర – సౌందర్యాల అవసరాలకనుగుణంగా – ఈ చర్యలన్నీ జరిగిపోతాయనుకోండి! బాగా పెద్ద ఖర్చుల కోసం ఇంటా – బయటా దాతలు, ఒక వైద్యురాలు, ఆమె కుటుంబం, శక్తి మేరకు ప్రతి కార్యకర్త కూడా తలో చెయ్యి ప్రతి నెలా వేస్తూనే ఉంటారు సుమీ! ఈ అర్ధదానాలు వారి నిత్య శ్రమదానాల కదనం!

 

            ఈ శివరామపురం రోడ్డు ప్రక్క పొలాల రైతులకు పట్టని - అక్కడి కొలిమి షెడ్డు వారు పట్టించుకోని – రోడ్డు వార పూరిపాకల్లో నివసించే వారైనా పూనుకొని - ఈ కుడి ఎడమల్లో - రోడ్డు మార్జిన్లలో - డ్రైనులోని ఎన్నెన్నో వ్యర్ధాలను, మొలిచిన తాడి చెట్లను, పిచ్చి - ముళ్ళ మొక్కల్ని, తామే గతంలో నాటి, సాకి, సంరక్షించిన పూల మొక్కల అందాలను, పాదుల్ని ఉభయ గ్రామాల కార్యకర్తలీ సుప్రభాత సమయంలో బాధ్యతగా - ఆనందంగా నరికి, పెకలించి, దంతెలతో లాగి, సవరించి, ప్రోగులన్నీ ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి తరలించారు. మరి ఈ కార్యకర్తల సంఖ్య ఏ ఐదారొందలో ఉంటే ఇంకెంతగా ఊరి స్వచ్చ - శుభ్ర - సౌందర్యాలు ఇబ్బడిముబ్బడి అవుతాయో కదా అని ఊహించుకొంటున్నాను!

 

            ఈ నాటి గ్రామ స్వచ్చ – శుభ్ర – సుందర సంకల్ప నినాదాలను గట్టిగా ప్రకటించినది శివరామపుర నివాసి, ఆరుగాలం కష్టించే రైతు అయిన మల్లంపాటి ప్రేమానందమైతే, తన 55 వ జన్మదిన పురస్కారంగా మనకోసం మనం ట్రస్టుకు 1000/- విరాళమిచ్చింది గౌరిశెట్టి (BSNL) నరసింహారావు.

 

            రేపటి స్వచ్చంద సేవా ప్రాంతం కూడ పంట కాలువ వంతెన దగ్గరే!

 

         నిజంగానే! నిజంగానే?

నిజంగానే కళ్లెదుట ఈ నిత్యనూతన శ్రమ విరాళం

ఇన్ని వందల నాళ్ళ నుండీ - ఇన్ని లక్షల గంటలుగ తమ

సొంత గ్రామం మేలు కోసం కార్యకర్తలు ఉద్యామిస్తూ - కదం త్రొక్కరా?

సకల జగతికి స్ఫూర్తినిస్తూ సాగిపోయారా?

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

సోమవారం – 15/06/2020,

చల్లపల్లి.