2044* వ రోజు....           16-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2044* వ నాటి శ్రమ- సమయదానాలు.   

ఈ రోజు వేకువ జామున- 4.02-6.00 మధ్య- తమ గ్రామ స్వచ్చ శుభ్రతల బాధ్యతలు భుజాల మీది కెత్తుకొన్న 22 మంది స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు స్థిమితంగాను, అంకితంగాను, పెదకళ్లేపల్లి మార్గంలోని 7 వ నంబరు పంట కాలువ సమీపాన రహదారి శుభ్రతా చర్యలు నిర్వహించారు. ఇంచు మించు నిన్నటి చోటనే- కత్తుల సాన కొలిమి, పూరి గుడిసెల మధ్యస్థ ప్రదేశంలోనే- నిన్నటి శేష బాధ్యతలు ఈనాడు పూర్తైనవి.

            బాటకు తూర్పు దిశగా కొందరు, ఏ హడావిడీ పడకుండ తాపీగా, ప్రశాంతంగా- జన్మ జన్మల విధ్యుక్త ధర్మాలేవో యథావిధిగా ఇప్పుడు నిర్వర్తించిన స్వచ్చ-శుభ్ర చర్యల్ని గమనిస్తే- కర్మ యోగి పుంగవులు గుర్తురాక మానరు!  తమది కాని చోట- తమది కాని పనిని-ప్రజలందరి సౌకర్యం కోసం- సంతోషం కోసం ఇంత నిశ్చింతగా, స్వార్థ లేశ రహితంగా స్థిత ప్రజ్ఞతో- ఇదొక పవిత్ర స్వయం విధిత బాధ్యత అనుకొని నిర్వర్తించడం నాకు మాత్రం అబ్బురంగానే కనిపిస్తుంది.

            వృద్ధ కార్యకర్తలు కూడ నేల మీద చతికలబడి, గడ్డిని కోయడం, ముళ్ల-పిచ్చి, మొక్కల్ని తొలగించడం, తాడి చెట్ల మొలకల్ని త్రవ్వి మరీ పెకలించడం, మరికొందరు గతంలో తమ బిడ్డల్లాగా మొలిపించి, నాటి పెంచిన పూల మొక్కల్ని మరింత సుందరీకరించడాన్ని గాని, వాటి పాదుల్ని సరిదిద్దడాన్ని గాని, వచ్చే- పోయే ప్రయాణీకులు ఆగి చూసి మెచ్చరెందుకో నాకర్థం కాదు!

            రోడ్డు కు కుడి వైపు- పడమర అంచును, డ్రైనును కొందరు కార్యకర్తలు సంస్కరించబూను కొన్నారు. ఉపాధి హామీ కార్మికులు త్రవ్విన మట్టిని సమంగా-సక్రమంగా ఉపయోగిస్తూ-ఇంకా మిగిలిన ముళ్ల-పిచ్చి మొక్కల్ని తొలగిస్తూ-ఎండు తాడి మట్టల్ని గొర్రులతో లాగి, ట్రాక్టర్ లోకి ఎక్కిస్తూ ఒక సమన్వయంతో వీళ్లు చేసిన కృషితో ఈ దారి మేకల డొంక నుండి పూరి గుడిసెల దాక ఇప్పుడు చూసి తీరవలసినంత బాగా కనిపిస్తున్నది.

            మరొక వంక దారిని, డ్రైను గట్టు ను చీపుళ్లతో ఊడ్చే పని, అన్ని రకాల వ్యర్థాల గుట్టలను ట్రాక్టర్ లోకెక్కించి, డంపింగ్ కేంద్రానికి తరలించే పని కూడ యథావిధిగా జరిగిపోయినవి!

            ఇన్ని పనులూ- ఈ రెండు గంటల సమయదానంలో జరిగిన కర్తవ్య నిర్వహణలు కార్యకర్తలు చల్లపల్లికి 3 కిలో మీటర్ల దూరంలో వేకువ సమయంలో నిర్వహించినవే!

            రేపటి శ్రమదాన వేదిక కూడ శివరామపురం దగ్గరి నేటి కార్యక్రమం ఆగిన చోట మొదలు పెట్టుకుందాం!

         అది ఎవ్వరి వైఫల్యం?

ఐదువేల నివాస గృహా- లంత కైదురెట్ల జనం

ఐదోవంతు ప్రజల లోనె స్వచ్చ స్పృహ చూడగలం

అది స్వచ్చోద్యమ వైఫల్యం అని కూడా చెప్పలేము

అద్భుతమగు పెను మార్పులు ఆశించినంత జరగవేమొ!

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

మంగళవారం – 16/06/2020,

చల్లపల్లి. 

4.02 కు శివరామపురం రోడ్డు లో
ఎత్తు పల్లాలను సరి చేసిన తరువాత శివరామపురం రోడ్డు