2045* వ రోజు....           17-Jun-2020

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2045* వ నాటి పరిశుభ్రతా కార్యక్రమం

 

            ఈనాటి చల్లని వేకువలో కూడ 27 మంది రెండు (చల్లపల్లి, శివరామపురం) గ్రామాలకు చెందిన స్వచ్చ కార్యకర్తలు 4.03 కే సంసిద్ధులైపోయి, 6.05 నిముషాల దాక కొనసాగించిన రహదారి ఆకృతి మెరుగుదల కృషితో 7 వ నంబరు పంట కాలువ దగ్గరి పూరిళ్ళ పరిసరం ఎంతగా శుభ్ర – సుందరమై పోయిందంటే – అటుగా తిరుగాడే ప్రయాణికులు గాని, రోడ్డు దరి నివాసితులు గాని ఇంతటి ఆహ్లాదకర దృశ్యాన్ని బహుశా చూసి ఉండరు! రోడ్డుకు ఉభయ దిశల పొలం రైతులు కూడ ఈ విషయం ఒప్పుకోవాల్సిందే!

 

            వేల దినాలుగా ఒక నిర్దిష్ట ఆశయం కోసం పనిచేస్తున్న ఈ స్వచ్చ సైనికులకిది క్రొత్త కాకపోయినా – 3 కిలోమీటర్ల దూరం నుండి చల్లపల్లి వారు, కిలోమీటరు దూరం నుండి కొత్త శివరామపురం వారు ఏ మూడింటికో నిద్ర లేచి, గుడికో – శుభకార్యానికో వెళుతున్నంత శ్రద్ధగా చీకటిలోనే ఇక్కడికి విచ్చేయడం, ఇలా ప్రతిరోజు2 గంటల తమ సమయాన్ని, శ్రమను ఉమ్మడి సంక్షేమం కోరి దానం (ఇందులో మొదటిదైన సమయదానం ఈరోజుల్లో మరీ కష్టం!) చేయడం – నా బోటి వాళ్ళకు మాత్రం ఎప్పటికీ నిత్య నూతన అనుభూతిని కలిగిస్తూనే ఉంటుంది!

 

            కరోనా వంటి కష్టాలు వస్తూ ఉంటాయి – పోతూ ఉంటాయి! సమాజం వేసుకుంటూపోయేది ఎక్కువగా తప్పటడుగులే కావచ్చు! కాని ఈ సాధారణ మనుష్యుల అసాధారణ సమయ – శ్రమ త్యాగాలు, వాటి వెనకున్న ఆంతర్యాలు మాత్రం ఉభయ గ్రామాల చరిత్రలో చాలా కాలం గుర్తుండిపోతాయి. వీళ్ళ ఉద్యమాన్ని గమనిస్తూ – దాని ఫలితాలనుభవిస్తూ కూడ ఏమీ పట్టినట్లు తప్పుకుపోయే విజ్ఞుల సంగతి కూడ ఆ చరిత్రలో నిక్షిప్తం కాకపోదు!

 

ఈ బుధవారం వేకువ సమయ విశేషాలు కొన్ని :

 

1) సుందరీకరణం గ్రూపు పారలతో, చేతులతో వంచిన నడుములెత్తకుండ దారికి పడమర గట్లను  నట్టిల్లా అన్నంతగా చదును చేయడం. (వీళ్ళు తొలినాడు శుభ్రం చేసిన చోట ఏ పుణ్యాత్ములో వ్యర్దాలు నింపిన ప్లాస్టిక్ సంచులు పడవేశారు!)

 

2) పూరిళ్ల దగ్గరి దారికి రెండు ప్రక్కల, డ్రైనులోని ఎండు కొబ్బరి బొండాలు, ఖాళీ మద్యం సీసాలు, తాటి మట్టలు, పిచ్చి మొక్కలు యధాపూర్వంగా 16 మంది ఏరి, పీకి, నరికి, దంతెలతో లాగి, ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి చేర్చడం.

 

3) మహిళా కార్యకర్తలిద్దరు వ్యర్ధాలన్నిటినీ చీపుళ్లతో శుభ్రం చేయడం

 

4) 79 ఏళ్ళ (నిన్నమొన్నటి దాక) ఆరోగ్యరహితుడు అందరికీ ఓపికగా మంచి నీరు, చాక్లెట్లు అందించడం.

 

5) ఒక పెద్ద డాక్టరు ఈ అన్ని పనులను పర్యవేక్షిస్తూ ఎప్పటిలాగే పరవశించడం! ఇదంతా సాటిలేని శ్రమానందమో, లేక నిష్కామకర్మయోగమో తేల్చుకొనే సందిగ్ధంలో  నేనుండడం ..... ఇలా ఇది అనంతం.

 

            రేపటి మన శ్రమైక జీవన సాఫల్యం కూడ ఈ పంట కాలువ వంతెన దగ్గరే!

 

        ఏ ఆనందం సబబు?

సినిమాల్లో, చీట్లపేక సరదాల్లో, కోడిపుంజు

పందేల్లో – ఆనందపు ప్రాకులాట క్రీడకన్న

స్వార్ధానికి జెల్లకొట్టి త్యాగాలకు పదును పెట్టు

స్వచ్చోద్యమ చల్లపల్లి సంరంభం కదా మిన్న!

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

బుధవారం – 17/06/2020,

చల్లపల్లి.