2046* వ రోజు....           18-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2046* వ నాటి నిర్వహణలు

 

          పాతికవేల మంది పైగా జనాభా ఉన్న చల్లపల్లి నుండి, సమీప కొత్త శివరామపురం నుండి కేవలం 25 మంది స్వచ్చ కంకణధారులైన – తాము బ్రతుకుతున్న గ్రామ సమాజాల మెరుగుదల కోసం కర్తవ్య పరాయణులైన కార్యకర్తలు 3 కిలోమీటర్లనిడివికల – గత 6 రోజుల నుండి శుభ్ర సుందరీకరణ ప్రయత్నం చేస్తున్న పెదకళ్లేపల్లి మార్గంలో – 7 వ నెంబరు పంట కాలువ వంతెన దగ్గరికి 4.04 నిముషాలకే చేరుకున్నారు. ఇన్ని వేల దినాల నుండి ఏ ప్రకృతి వైపరీత్యాలు గాని, వైయక్తిక ప్రతి బంధకాలు గాని, ఆపజాలని తమ గ్రామ సౌందర్య వృద్ధి ప్రయత్నం కోసం ఆ బ్రహ్మముహూర్తంలోనే పూనుకొన్నారు.

 

          ఎవరి ఇంటిని – వాకిలిని – పరిసరాన్ని వారు చక్క బెట్టుకోవడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో తమ ఊరి మొత్తాన్ని, కొసరుగా 3 కిలో మీటర్ల దూరంలోని రహదారిని క్షుణ్ణంగా సంస్కరించబూనుకొన్న ఈ ధన్యులను గూర్చి ఎంతగా ప్రస్తావించాలి? ఏమని ప్రశ్నించాలి? ఎన్ని జన్మల (అవి నిజంగా ఉంటే!) ఈ గ్రామ ఋణాన్నితీర్చుకొంటున్నారో లేక గ్రామాలను, ఋణ గ్రస్తుల్ని చేసుకొంటున్నారో – అవి ఊహాజనితాలే మరి!

 

          ఎంతగా బలమైన తాత్త్విక పునాది లేకపోతే – ఈ చీకటిలో – తమది కాని చోటులను – అక్కడ ఏ కల్మషాలు – ఏ కశ్మలాలు – ఏ అశుద్ధాలు ఉన్నాయని వెనుకాడక – అదేదో భగవత్పూజా దురంధరుల్లాగా – నిష్టతో – దీక్షతో ఇన్ని లక్షల పని గంటలు శ్రమించి శుభ్ర పరుస్తారు?

 

- ఇందులో ఒక 65 ఏళ్ల విశ్రాంత కార్యకర్త పొలం దిశగా సాగుతున్న చెట్టు కొమ్మను 10 వేటుల్లో నరికాడంటే – అది కేవలం సామూహిక శక్తి తప్ప కేవలం వ్యక్తిత్వ శక్తి కాదు!

 

- 60 ఏళ్ళు దాటిన మాజీ కృషీవలుడు లాఘవంగా అమాంతం ట్రాక్టర్ పైకెక్కి, అన్నన్ని వ్యర్ధాలను అందులో పేర్చి, తొక్కి, సర్దడం కూడ అంతే!

 

- కత్తులతో ఉభయ దిశల్లోని పిచ్చి – ముళ్ళ చెట్లను నరికి, బురద నుండి తాడి మట్టల, ఎండు కొమ్మల, ప్లాస్టిక్ సంచుల, ఖాళీ మందు సీసాల, కాలుష్యాలను సమీకరించారంటే – బహుశా వాళ్ళలో స్వచ్చతా స్పృహ జీర్ణించుకుపోయిందేమో!

 

- చీపుళ్లతో ఊడ్చి, ఊడ్చి ఈ దారిని 2 గంటల పాటు తమ సొంతం చేసుకున్న మహిళా కార్యకర్తల ప్రభావం వచ్చే – పోయే ప్రయాణికుల మీద ఎంతవరకు పడిందో చెప్పలేను!

 

          నన్ను ఆకర్షించిన మరొక అంశం – ఒక మహిళకు అనుకోకుండా ఆకలితో నీరసం వస్తే – కార్యకర్తల్లో ఒకాయన అత్యవసరంగా తన ఇంటికెళ్ళి – (రైతు బుద్ధి పోనిచ్చుకోకుండా) మామిడి పండు ముక్కల్ని తెచ్చి తినిపించడం! అక్కడ నేనుండే సమయమంతా ఇలాంటి చాల విశేషాలను గమనిస్తూనే ఉంటాను. ఈ స్వచ్చ సంస్కృతిని ప్రతి రోజూ ఆస్వాదిస్తూనే ఉన్నాను!

 

          రేపటి మన శ్రమదాన సంస్కృతి కొనసాగింపు కోసం ఈ శివరామపురం సమీపాన – లేదా ఆ సమయానికి వర్షం వస్తే కరీముల్లా డ్రసెస్ దగ్గర - కలుసుకొందాం!

 

             విశ్లేషణ చేస్తున్నా.

ఎన్నెన్నో ప్రలోభాలు – ఆకర్షణ వికర్షణలు

కీర్తి వెంటనే పరుగులు – ఆత్మస్తుతి పరనిందలు

అన్నిటిని పరిత్యజించ.... స్వచ్చోద్యమమున తరించ...

అరదశాబ్ది ఆసాంతం స్వచ్చ భటుల ప్రయత్నమనీ...

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

గురువారం – 18/06/2020,

చల్లపల్లి.