2047* వ రోజు....           19-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2047* వ నాటి శ్రమదాన ప్రదర్శన.

 

నేటి వేకువ శ్రమదాన వేదిక ఐన శివరామపురం పంట కాలువ వంతెన దగ్గరలో- నిర్ణీత ముహూర్తమైన 4.04 కాలానికి చేరుకొన్న రెండు గ్రామాల స్వచ్చ కార్యకర్తలు నిర్ణీత ముగింపు సమయ నియమాన్ని మాత్రం ఉల్లంఘించి-6.30 వరకు అక్కడి అవసరం మేర- తమ తనివి తీర ఐచ్చిక శ్రమదానం ముగించారు. ఉభయ గ్రామాల నుండి కార్యకర్తల సంఖ్య సైతం పెరిగింది. శివరామపురం నుండి 9 మంది, పెదప్రోలు నుండి ఇద్దరు, మొత్తం కలిపి 41 మంది 100 కు పైగా పని గంటల పాటు ½ కిలో మీటరు పర్యంతం పెదకళ్లేపల్లి బాటను, ఉభయ దిశల గట్లను, డ్రైనును శుభ్రపరచి, సుందరీకరించుకొంటూ శివరామపురంలోకి ప్రవేశించారు. ఆ గ్రామ పంచాయతీ V.R.O గారు కూడ కొంత వెనుకాముందుగా వచ్చి కలిశారు. అసలు ఈ నలభై మంది స్వచ్చ సైనికులలో నికరంగా చల్లపల్లి వాళ్లెందరో- మిగిలిన వాళ్లు ఎక్కడి నుండి-ఎప్పుడు-ఎందుకు వచ్చి-కలిసి ఈ గ్రామం కోసం ఏమేమి త్యాగాలు చేస్తున్నారో- ఈ నాటి సర్వోత్తమ చల్లపల్లి సాధనలో ఎవరి విశిష్ట పాత్రలెంతో.... అదంతా వేరే కథ! ఈ గ్రామ వ్యథను తొలగిస్తున్న-స్వచ్చ-శుభ్ర- సుందర సుధలను ఒలికిస్తున్న సుదూర ప్రాంత దాతల , ప్రవాసాంధ్రుల కథ కూడ నిత్య స్మరణీయమే- పునః కథనీయమే-శ్రవణీయమే! మననీయమే! మాననీయమే!

 

          మన చల్లపల్లి గ్రామ కార్యకర్తల శ్రమదాన చరిత్ర ఏ రోజుకారోజు ప్రత్యేకమైనదేగాని- స్ఫూర్తిదాయకమే గాని, నేటి శ్రమ సుందర భవ్య చరిత మరికొంత విశిష్ట మనిపిస్తున్నది. అసలీ కరోనా కల్లోల భయాలేమిటి? దక్కిన కాడికి ఎవడి ప్రాణం వాడు నిలబెట్టుకొనే ప్రపంచ వ్యాప్త ప్రయత్నాలేమిటి? ఇంతటి వినూత్న క్లిష్ట సమయంలోనూ వేకువ 4.00 కె ఏ రకమైన సొంత లాభం ఛాయలేకనిపించని సకల ప్రజా స్వస్తతా దోహదకరమైన ఈ స్వచ్చోద్యమ విన్యాసమేమిటి?

 

- డ్రైను లోని గడ్డి, తాటి చెట్ల వ్యర్ధాలు, పిచ్చి-ముళ్ల మొక్కల్ని కొందరు తొలగించగా....

 

- సుందరీకరణ బృందం పూర్తి స్థాయిలో సుక్ష్మాంశాలను కూడ వదలక గట్లను, రోడ్డు మార్జిన్లను చదును చేయగా....

 

- 7 వ నంబరు పంట కాల్వ వంతెన తూర్పు గట్టు మీద గతంలో తొలగించగా, ఇప్పుడు డ్రోజర్ తో చదును చేసే పనిని స్వయంగా V.R.O గారు పర్యవేక్షించగా...

 

- కొందరు ఒత్సాహికులు తాడి- తదితర చెట్లను చెక్కి ముస్తాబు చేస్తుండగా....

 

- ఈ అన్ని విధాల వ్యర్ధాలను చీపుళ్లతో, గొర్రులతో ఊడ్చి, లాగి ఆ పోగుల్ని ట్రాక్టర్ లోకి ఎక్కించగా...

 

- అన్ని గుట్టలనూ ఒక వ్యక్తి చాలా నేర్పుగా ఒక్క ట్రక్కులోనే సర్ది, డంపింగ్ కేంద్రానికి చేర్చగా....

 

- ఇదీ నేటి వేకువ శ్రమదాన దివ్యగాథ!


          రేపటి మన శ్రమ సమర్పిత అనుకూల ప్రదేశం కూడ శివరామపుర గ్రామమే!

   

        స్వయం కృషి వికాసమే.

స్వచ్చోద్యమ చల్లపల్లి క్రమ వికాసమెట్టిదనిన..

సామాజిక ఋణ విముక్తి తాత్వికతే పునాదిగా..

ఎవరెవరో వచ్చి మనను ఏదో ఉద్ధరించాలని

ఆశింపక - స్వశక్తితో అద్భుతాలు చేయడం!

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

శుక్రవారం – 19/06/2020,

చల్లపల్లి.