2048*వ రోజు....           20-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

2048* వ నాటి రహదారి మెరుగుదలలు.

 

            ఈ శనివార శుభోదయాన – 4.04-6.05 మధ్య సమయాన అక్షరాలా 39 మంది వివిధ నేపద్యాల- గ్రామాల నిస్వార్థ శ్రమదాన ప్రమోదస్వాభావికులు శివరామపుర గ్రామ పరిసరంలో సాధించిన పెదకదళీపురమార్గ స్వచ్చ – శుభ్ర - సుందరీకరణలు చూచి తీరవలసినవి, మెచ్చదగినవి - అనుసరించదగినవి! శివరామపుర కార్యకర్తలంటే ఈ పని చేయడం అర్థం చేసుకోవచ్చు. చల్లపల్లి కార్యకర్తలంటే - వాళ్లకిందులో ఏ హద్దులూ ఉండవు! పెదప్రోలు నుండి, మోపిదేవి నుండి కూడ కార్యకర్తలు, రెవిన్యూ ఉద్యోగులు ఇంత ఉదయాన ఈ కార్యక్రమానికి వచ్చిన సంగతే చర్చనీయాంశం! ధన్యులైన ఈ వీరులందరికీ ధన్యవాదాలు!

 

- నిన్నటి వలెనే నేడు కూడ మినీ జె.సి.బి. వచ్చింది. పంట కాలువ దక్షిణపు గట్టు మీది ఎగుడు దిగుడులను సమం చేసింది.

 

- 7 వ నంబరు పంట కాలువలో వంతెనకు తూర్పు దిక్కుగా నలుగురు కార్యకర్తలు సారా సీసాల - ప్లాస్టిక్ సంచుల - పిచ్చి, ముళ్ల మొక్కల - చెత్త చెదారాల వ్యర్ధాలన్నిటినీ తొలగించారు. (ఇదెందుకంటే - రహదారుల్నీ, బస్ ప్రాంగణాన్ని, వికృత ఖాళీ నివేశనాలనీ శుభ్ర పరచి, ఎక్కడ ఏ చిన్న వికృతి కనిపించినా మనసుకు నచ్చక- ఉండబట్టక!)

 

- నిన్న వచ్చిన పెద్ద ట్రక్కు తుక్కు కాక, నేటి పరిశుభ్రతా చర్యల వల్ల పోగైన తుక్కు కూడ ట్రక్కు నిండింది.  మరికొంత రేపటికి మిగిలిపోయింది.

 

- ఈ డ్రైను లోను, గట్ల మీద, రెండో ప్రక్క పొలం గట్టు దాపున, బాట అంచుల్లో ఇన్నిన్ని వ్యర్ధాలు చేరడం ఆశ్చర్యకరంగానే ఉంటుంది గాని - మహిళా కార్యకర్తలు అవి ఊడ్చి – ఏరి - పోగులు చేసేందుకు విరామమెరుగక పరి శ్రమించే తీరు మరింత నిబిడాశ్చర్యకరం!

 

- ఇద్దరు కార్యకర్తలైతే ఈ రహదారి శుభ్రతలు చాలవన్నట్లు - ప్రక్కనున్న ఊరి పెద్ద ఖాళీ స్తలంలోకి వెళ్ళి మరీ బాగు చేయ ప్రయత్నించారు.

 

- గత రెండు దినాలుగా సుమారు ఈ అర కిలో మీటరు ప్రాంతం ఇంతమందికి - ఇన్ని గంటలు పని కల్పించిందేమిటా అనిపించింది- సమాధానం కూడ తట్టింది. ప్రతి చెట్టును, గట్టును, పుట్టను, దిబ్బనూ, పూల మొక్కను దాని ముళ్ల కంచెను అంత శ్రద్ధగా తీర్చిదిద్దుకొంటూ పోతుంటే - రేపు కూడ ఇక్కడే గడిచినా గడవవచ్చు.

 

స్వచ్చ కార్యకర్తల పట్టుదలను, నిబద్ధతను, వారి మానసిక తాత్విక పునాదిని నేను ప్రస్తావిస్తున్నానుగాని – ఇన్నిన్ని గంటల శ్రమ విలువ ఖరీదు కట్టలేను. (ఆ శ్రామికుల పని విలువనూ, ఆ విలువల దోపిడీని, 150 ఏళ్ల క్రిందట మార్క్స్ - ఎంగెల్స్ లు తేల్చి వేశారు!) అభ్యుదయ కవి కుల గురువు శ్రీశ్రీ మాత్రం శ్రమ జీవుల భవిత కోసం “ప్రతిజ్ఞ” చేశాడు!

 

చల్లపల్లి స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం ఒకానొక అజ్ఞాత దాత గతంలో ఇస్తున్నట్లే - నిన్నకూడ “ మనకోసం మనం” మేనేజింగ్ ట్రస్టీ కి 5000/- విరాళం సమర్పించారు. సదరు ఉద్యమ స్ఫూర్తికి మన ధన్యవాదాలు!

 

            రేపటి మన స్వచ్చంద శ్రమదాన విభవం కూడ శివరామపురం గ్రామ శివారు పరిసరమేనని డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు ఉవాచ!

  

            ఒక సమైక్య రాగంతో....

స్వచ్చోద్యమ చల్లపల్లి క్రమ పరిణామం బేదన...

సామాజిక ఋణ విముక్తి సాహసమే పునాదిగా –

కులమతాల గొడవలేక – వితండవాదాలు లేక –

సమైక్యతారాగంతో స్వచ్చ సేన కదలడం!  

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

శనివారం – 20/06/2020,

చల్లపల్లి.