2049*వ రోజు....           21-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

2049* వ నాటి ఉత్సాహాలు.

 

          సూర్యోదయ – అస్తమానాలంత ఖచ్చితంగా ఈ నాటి వేకువ 4.00 కే స్వచ్చ సైనికుల గ్రామ – రహదారుల బాధ్యత మొదలైపోయింది! 6.05 కు ముగిసింది. ఈ దినం స్వచ్చ విధులలో పాల్గొన్న 39 మంది కార్యకర్తల మీద ఎవరి ఒత్తిడీ లేదు – ఏ ప్రలోభమూ కాదు – తాము ఎంతో కొంత ఋణపడ్డామని భావించే వీరు సమాజ బాధ్యతల పట్ల స్వయం ప్రేరితులు! 2049 దినాలుగా తాము నమ్మిన ఆదర్శానికి అంకితులు! మరి – ఈ నిస్వార్ధ నిరాడంబర కర్తవ్య పరాయణుల కన్నా ఈ 2020 వ సంవత్సర సంకుచిత సమాజానికి ఆదర్శ మూర్తు లెవ్వరు? బైట నుండి పై పైన చూసి, చిన్న వ్యాఖ్యానం విసరి, దాటుకుపోయే వారికి ఈ సామాజిక కర్తవ్యం విలువ తెలియకపోవచ్చు – ఈ కిలోమీటరు రహదారిని ఇంతమంది వారం రోజులు మించి బాగు చేయాలా? మరీ చాదస్తం కాకపోతే?’ అని కూడ ఈ సడించుకొంటారేమో! ఐతే :

 

          ఈ రెండు గంటల (2 X 39 = 78 గంటలు) వివిధ స్వచ్చ – శుభ్ర – సుందరీకరణల అనంతరం ఈ మొత్తం కిలోమీటరు నిడివి గల – మేకలడొంక నుండి – శివరామపురం వరకు – దారినంతా ఒకటికి రెండు మార్లు ఆనందంతో పరిశీలనగా చూసుకొన్నప్పటి కార్యకర్తల మనోభావాలు వేరు – ఇంతగా స్వచ్చ -  సుందరంగా కనిపిస్తున్న ఈ రహదారిని చూసుకొన్నా - తలచుకొన్నావాళ్ళ ఉద్వేగాలు – ఉత్సాహాలు పైకి ఉబికి వస్తూనే ఉంటాయి.

 

- ఒకే కాలంలో, ఒకే సమాజంలో ఇవి భిన్న కోణాలు!

 

ఈ నాటి శ్రమదాన దృశ్యాలలో ముఖ్యమైనవి :

 

1) డజను మంది కార్యకర్తలు (స్వచ్చ) ఆయుధాలు ధరించి, 7 వ నంబరు పంట కాలువ వంతెనకు తూర్పు గాను, పడమర గాను కాలువను, గట్లను – ముఖ్యంగా దక్షిణపు గట్టును అటొక వంద – ఇటొక వంద గజాల దాక ఉన్న అన్ని రకాల కాలుష్యాలను చీల్చి చెండాడం.

 

2) కాల్వ ఉత్తర గట్టున నిన్న చదును చేసిన స్తలాన్ని సుందరీకరణ బృందం వారు మరింత శుభ్రంగా తమ శీలిలో చదునుగా చేయడం.

 

3) అక్కడికి  దూరంగా ఉన్న ఎండు వ్యర్ధాల గుట్టలను తొలగించి, ఎత్తి, ట్రాక్టర్ లో నింపి, చెత్త కేంద్రానికి చేర్చే పని.

         

4) నలుగురు చీపుళ్ళ మహిళా కార్యకర్తలు మళ్ళీ – మళ్ళీ రోడ్డును, అంచుల్ని, కాల్వ గట్టుని ఊడ్చి శుభ్రం చేయడం.

 

5) నిన్నటి మిగిలిపోయిన వ్యర్ధాల గుట్టలను, నేటి మలినాలను ట్రాక్టర్ లో నింపడం.

 

          ఇన్ని రకాల నిస్వార్ధ సేవలు ఒక క్రమపద్దతిలోను – ఇదేదో పెద్ద ప్రాజెక్టులాగో, పరిశ్రమలాగో ఏ రోజు కారోజు నిర్విఘ్నంగా జరుగుతుంటే గమనించిన నా బోటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆశ్చర్యపోవడం.....

 

          నేటి మరొక విశేషం – గోళ్ళ రాజేశ్వరి గారు తమ 60 వ జన్మదినానికి – 2049 రోజుల స్వచ్చోద్యమానికి గుర్తుగా – 2049/- ట్రస్టు బ్యాంక్ అకౌంట్ కి సమర్పించడం.
 

 

          రేపటి నుండి మన గ్రామ బాధ్యతలు కీర్తి ఆసుపత్రి దగ్గర మొదలుపెట్టి అవసరానుగుణంగా పూర్తి చేద్దాం!

 

          సంత విజయ కధనం ఇది

స్వచ్చ – శుభ్ర చల్లపల్లి జయ కధనం బెట్టి దన్న ..

తమ సామాజిక ఋణం తీర్చు తాత్త్విక చింతన తోడుగ

సంతలలో తిరిగి తిరిగి జనులకెల్ల నచ్చ జెప్పి

ప్లాస్టిక్ సంచి వినియోగం పరమ పదంచెండడం!

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

ఆదివారం – 21/06/2020,

చల్లపల్లి.