2050* వ రోజు....           22-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2050* వ నాటి సుదూర ప్రాంత శ్రమదానం.

నేటి ప్రాతః సమయంలో కూడ చల్లపల్లి హద్దును దాటి, శివరామపురం కొత్తూరును అధిగమించి, మల్లంపాటి సీతారామయ్య గారి(F/O ప్రేమానందం) ఇంటి సమీపాన వాహన శ్రేణుల్ని నిలుపుకొని, 4.05 కు ప్రారంభమయిన పెదకళ్లేపల్లి రహదారి శుభ్ర సుందరీకరణం ఆ గ్రామానికి దక్షిణ ముఖంగా సాగి 6.05 కు ముగిసింది.  నేటి శ్రమజీవులైన ధన్యులూ, మాన్యులూ 30 మంది! అసలు ఇవాళటి గ్రామ సుందరీకరణం చల్లపల్లి లో బందరు జాతీయ రహదారి మీద జరగవలసి ఉంది. ఐతే- నిన్న పడిన వాన వల్లనూ, నేటి ఉదయం వర్షాగమన అనుమానంతోనూ- అక్కడికి 4 కిలో మీటర్ల దూరంలోని శివరామపురం దారికి ఆ అదృష్టం పట్టింది!

            ఇక్కడ మూడు మౌలిక ప్రశ్నలేమంటే- ఈ కార్యకర్తలకు వేకువ 3 గంటల తర్వాత నిద్రే పట్టదా? 2050 దినాల పిదప కూడ – స్వార్ధ చింతన మానేసి- చల్లపల్లిలో కాక- ఇంకా ఎన్ని ఊళ్లలో-ఎన్నెన్ని వేల దినాలు వీళ్ల సామాజిక బాధ్యతాయుత శ్రమదాన ప్రస్థానం? ఇంతకీ ఏ వెలుగుల కోసం ఈ నిరంతర సేవల పయనం?....  ఈ మూడు ప్రశ్నలు నా వంటి వాళ్లలోనే కాక- చల్లపల్లి లోని 4500 కు పైగా ఇళ్లలోనూ, 27-28 వేల మంది సోదర గ్రామస్తుల మనసుల్లోనూ పుట్టుకొచ్చి- నిద్ర లేకుండ చేయ వేల?

            ఈ మహోన్నత స్వచ్చ కార్యకర్తలబాధ్యతామయ సుదీర్ఘ ప్రయాణంలో 2050 వ రోజొక చిన్న మైలు రాయే గాని- వీళ్లవి అంతగా గమనించరు! ఈ రాటు దేలిన కార్యకర్తల దృష్టిలో 1 వ రోజైనా-3000 వ రోజైనా ఒక్కటే! వాళ్ల నిష్కామ కర్మ సిద్ధాంతం అలాంటిది మరి! వేకువ 3.00 కు లోకమంతా సుఖ నిద్ర చెందే వేళ- మేల్కొని- ఇంత దూరం వచ్చి- చీపురో, గొర్రో, డిప్పలో పట్టుకొని-గ్రామ కాలుష్యం కోసం వెదకుకొనే కర్మిష్ఠులకు- ఈ మైలు రాళ్లు, ఈ రికార్డులు ఏమి లెక్క?

            ఈ 30 మంది శ్రమదానంతో ఈ వేళ:  

- సుమారొక 100 గజాల రహదారి కనువిందుగా మారిపోయింది.

- కాలికి బురద అంటుకొంటున్న డ్రైను లోని ఎండు కొమ్మలు, తాటి మట్టలు, పిచ్చి – ముళ్ల మొక్కలు తెగి, గుట్టలుగా చేరి, ఆ పైన ట్రస్టు సంబంధిత ట్రాక్టరు లోకి చేరి- నాలుగైదు కిలో మీటర్ల దూరాన గల చెత్త కేంద్రానికి చేరుకొన్నాయి.

- ఖర్మ కాలి ఈ రహదారి లోని, అంచులలోని కొన్ని గుంటలు సుందరీకరణ బృందం వాళ్ల కంటిలో పడ్డాయి. ఇకేం- ఆ  సమీపంలో దొరికిన మట్టి, గులక రాళ్లు, ఇసుకలను సేకరించి చకచకా పని వేళ ముగుస్తున్న సమయానికల్లా ఆ గుంటలను పూరించి, చక్కదిద్ది గాని – డాక్టర్ గారి విజిల్ మ్రోగుతున్నా సరే వీళ్లు నడుములెత్తలేదు, విశ్రమించలేదు. (ఖర్మ కాలింది వీళ్లకా? లేక అదృష్టం పట్టింది అక్కడి రోడ్డు మీది గుంటలకా?)

- మహిళల చీపుళ్లకు భయపడి రోడ్డుమీది అంచుల్లోని, దుమ్ము-ఇసుక- ఇతర వ్యర్ధాలు ట్రాక్టర్ లో దూరినవి!

- ప్లాస్టిక్ సంచుల, ఖాళీ సారా సీసాల సంగతీ అదే! మన ఊళ్ల జనం కావటానికి పేదలైతేనేం? రకరకాల సారా సేవనంలో, మనలో చాలామంది ధనికులు, ఉదారులు!( అందరూ మహానుభావులే- ఎందరికని నా వందనమ్ములు?)            

            దయచేసి అందరం ఈ విషయంలో పిసినారులం అవుదాం- మానేద్దాం! 

స్వచ్చోద్యమకారుల రేపటి శ్రమదాన ప్రవేశం కూడ ఉభయ శివరామపురాల మధ్యస్థ ప్రాంతమని గమనిద్దాం! 

        ఐదారేళ్ల విజయ పథం

స్వచ్చోద్యమ చల్లపల్లి విజయ పథం ఎట్లనగా....

సామాజిక ఋణ విముక్తి సద్భావన స్ఫూర్తి పొంది

ఎండ-మంచు-గాలి-దుమ్ము లేవొచ్చిన చలింపక

నమ్మిన గమ్యం దిశగా ఐదారేళ్ల ప్రస్థానం!

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

సోమవారం – 22/06/2020,

చల్లపల్లి.

 

శివరాంపురంలో ప్రేమానంద్ గారి ఇంటి వద్ద