2051*వ రోజు....           23-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2051* వ నాటి శ్రమదానవీరం .

ముందస్తు ప్రణాళిక ప్రకారమైతే నేటి వేకువ శ్రమదాన వేదిక శివరామపురాల నడుమ రహదారే! స్వచ్చ కార్యకర్తలు 4.03 కు అక్కడికే చేరుకున్నారు. ఐతే ప్రకృతే ఆ సమయానికి వీళ్లతో ఆటలు మొదలుపెట్టి- మంచి వర్షం దోబూచులాడటంతో- అప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో శ్రమదాన వేదిక మారిపోయి, చల్లపల్లి లోని కరీముల్లా దుస్తుల దుకాణం వద్దకు చేరుకొన్నారు. నిన్న- మొన్నటి-నేటి వర్షాలకు రోడ్ల మీద నీటితో బాటు ప్లాస్టిక్ నీటి సీసాలు, మందు బాబులు విసరినవేమో- ఖాళీ మద్యం సీసాలు, టిఫిన్ పొట్లాల కాగితాలు, ఆకులు వంటివి కూడా డ్రైనులోకి చేరి అడ్డుపడి, మురుగు కాల్వ ముందుకు నడవక కుంటుతుండడం గమనించిన కార్యకర్తల చేతుల్లోకి చీపుళ్లకు బదులు పలుగులు, పారలు వచ్చాయి. మురుగు నీటిలో తేలియాడే సకల వ్యర్ధాలను బైటకు లాగేందుకు కొందరు దంతెలు చేపట్టారు. ఆ విధంగా అవసరానుగుణంగా వాళ్ల శ్రమ వేదికను, పంథాను కూడ మార్చుకొన్నారన్నమాట.

            ఇక అక్కడి నుండి షరా మామూలే! మూడు బృందాలుగా విడిపోయి, మూడు చోట్ల- ఎక్కడైతే మురుగు ముందుకు కదలక మొరాయిస్తున్నదో కనిపెట్టి- ముందుగా లాయరు నాథ్ ఇంటి ఎదుట, పిదప RTC బస్ స్టాండు దగ్గర, చివరగా కరీముల్లా దుకాణ సముదాయాల దగ్గర మురుగు కాల్వల మీద యుద్ధం జరిగింది- వర్షం సాక్షిగా!

            ఆ చీకటిలోనే- చినుకుల్లోనే మురుగు మీది బరువైన బండ రాళ్లను లేపి, పగలకుండ జాగ్రత్తగా  ప్రక్కకు సర్ది, కాలవలోని రకరకాల చెత్తా చెదారాన్ని, సీసాలను, సంచుల్ని బైటకు లాగి, గుట్టలుగా పేర్చారు.(“ జై చల్లపల్లి స్వచ్చ సైన్యం గ్రూపు వాట్సాప్” లో ఈ వివరాలను చూడవచ్చు) మళ్లీ6.00 కు వెలుగు వచ్చే వేళకు ఆ రాళ్ల మూతలు యథాతథంగా తమ స్థానాలలోకి చేరాయి.

            ఈ నాటి గ్రామ ప్రయోజనకర శ్రమదానం చేసిన కార్యకర్తలు 24 మంది. వేల దినాలుగా వీళ్లకిది నిత్యవిధి. వానలో తడుస్తూ- ఈదురు గాలిని భరిస్తూ-సుమారు రెండు గంటల పాటు కష్టించి, మురుగు ప్రవాహాన్ని ముందుకు కదిలించిన వీళ్ల శ్రమకు ఫలితంగా రోడ్ల మీద ఇప్పుడు వాన నీళ్లు లేవు. మురుగు, చెత్త ఇతర దరిద్రాలు లేవు! ఐతే-మరి ప్రజలెన్నుకొన్న పంచాయతీ మరియు గ్రామ పౌరుల బాధ్యతేమిటి? గ్రామ శుభ్రతలో, స్వస్తతలో వాళ్ల పాత్ర, వైఖరి ఏమిటి? యాదాలాపంగా మురుగు కాల్వలోకి ప్లాస్టిక్ సంచులు, టీ, కాఫీల కప్పులు, సీసాలు అనాలోచితంగా విసరడం కానేకాదు. సమష్టిగా గ్రామ స్వచ్చ-శుభ్ర- సుఖ-సంతోషాలకు పూనుకోవాలి తప్ప-“నా పాటికి నేను నా ఇష్టం వచ్చినట్లు ఎక్కడైనా వ్యర్ధాలను విసరుతాను-బాగుచేసే వాళ్లను చేసుకోమనండి....” అనే పద్ధతి సమంజసం కానేకాదు! చైతన్యవంతులైన స్వచ్చ-సుందర-చల్లపల్లి నివాసులకది శోభనిస్తుందా? మన గ్రామస్తులు గట్టిగా ఆలోచించవలసిన మంచి సమయం ఇంకా మించిపోలేదు!

           ఇక-స్వచ్చ చల్లపల్లి నిర్మాతలైన సోదర కార్యకర్తలకు నా విజ్ఞప్తి. అత్యద్భుతమైన 2050 రోజుల నిరంతర స్వచ్చోద్యమం గురించి ప్రతి కార్యకర్త తన అనుభవాన్ని, ఆలోచనను, ఆనందాన్ని తనలోనే దాచుకోక త్వరలో వ్రాసి, లేదా నాతో చర్చించి అందరితో పంచుకోవాలి.

            రేపటి మన శుభోదయ శ్రమదాన వేదిక: వర్షం ఉంటే చల్లపల్లి సెంటరు, లేకుంటే శివరామపురం సమీపం.  

    నేనెందుకు ఆగాలట?

గ్రామసేవ దిన చర్యగ ప్రతిరోజూ గంటన్నర

అరదశాబ్ది పాటు ఊరి కంకితమై కష్టించిన

స్వచ్చ చల్లపల్లి సైన్య బాధ్యతలను కీర్తించక....

కథలుగ-పాటలుగ వ్రాయు కర్తవ్యం నెరవేర్చక....!

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

మంగళవారం – 23/06/2020,

చల్లపల్లి.

 

4.03 కు శివరాంపురంలో
రోడ్డు ప్రక్కల నిలిచిన వాన నీటిని డ్రైనులోకి పంపుతున్న కార్యకర్తలు
బస్టాండ్ టర్నింగ్ లో డ్రైన్ శుభ్రం చేస్తున్నారు