2052*వ రోజు....           24-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2052* వ నాటి గ్రామ బాధ్యతా నిర్వహణ .

నేటి వేకువ రహదారి స్వచ్చ-సుందరీకరణ శ్రమదాన ముహూర్తం 4.01-6.05 సమయాల నడుమ! వేదిక నిన్నటి నిర్ణయం ప్రకారం- వాన తెరపి ఇచ్చినందున-కొత్త శివరామపురానికి ఉత్తర దక్షిణ దిశలుగా-పంట కాలువ వంతెన మొదలు కోళ్ళ షెడ్డు దాపు దాక-కిలో మీటరు లోపుగా! శ్రమదాతలు 33 మంది. వాతావరణం సమతూకంగా ఉన్నది గాని చీకటి. గ్రామ రహదార్ల సముచిత సేవకులైన కార్యకర్తలు రెండు బృందాలుగా విడిపోయి సాగించిన కర్తవ్య నిర్వహణలిలా ఉన్నాయి.

- 15 మంది సౌందర్యకారులు 7 వ నంబరు పంట కాలువకు ఉత్తర దిశలో- గతంలో అనేక మారులు,  ఇప్పుడు 5-6 రోజులు శుభ్రపరచి, చదును చేసిన ఐదారు సెంట్లలో గద్దగోరు, సువర్ణ గన్నేరు, బిళ్ల గన్నేరు వంటి పూల మొక్కలు నాటే పని ప్రారంభించారు. ఈ బృందం రూపొందించిన గ్రామ, పరిసర రహదారి వనాలలో ఇప్పటికిది చివరిది! స్థానిక అభ్యంతరకారులకు తగు రీతిలో నచ్చజెప్పి, ఒక ప్రణాళికా బద్ధంగా-అంటే త్రాడుతో లంబరేఖ పెట్టి, దాని వెంట క్రమ పద్ధతిలో రకరకాల పూల మొక్కలను ప్రతిష్టించారు. (అప్పుడెప్పుడో-80 ఏళ్ల నాడు-శ్రీ శ్రీ మహా ప్రస్థానానికి పీఠిక వ్రాస్తూ చెలం గారు చెన్నై మెరీనా బీచ్ లో అందంగా తల ఊపుతున్న రంగురంగుల పూల శయ్యలను “ఛీ-ఛీ- ఎక్కడ చూసిన ఈ దరిద్రపు గొట్టు పూలే....”అని అసహ్యహించుకొనే వాళ్ల గురించి వ్రాశారు- ఈ 2020 లో- మన ఊళ్లో అలాంటి పుణ్యాత్ములు ఉండరాదని కోరుకొందాం!) నేటి చల్లపల్లి సుందరీకర్తల వన మహోత్సవ కృషి అసంపూర్ణం. తరువాయి రేపు చూడగలం.

- మరొక బృందం-16 మంది కత్తి వాటం-గొర్రు వాటం-ఇంకా చీపుళ్ల కార్యకర్తలు ఈ శివరామపురం-కోళ్ల ఫారం (కుడివైపు) మధ్య ఉన్న గడ్డి,పిచ్చి, ముళ్ల మొక్కల, ఎండు తాటాకుల, ప్లాస్టిక్ తదితర వ్యర్ధాల పని పట్టారు. రోజూ ఏరుతున్నా ఇన్ని ఖాళీ సీసాలు దొరుకుతున్నాయంటే మనం ఒక పేద-ఉష్ణ దేశంలో ఉన్నామో-వేడిని, మత్తును పుట్టిస్తాయనే వంకతో మద్యపానం చేసే ధనిక-చలి దేశంలో బ్రతుకుతున్నామో తెలియడం లేదు. 280 ఏళ్ల నాడు వేమన్న వ్యంగ్యంగా-  

                           త్రాగి-త్రాగి-త్రాగి ధరణి పై పడినచో

                           తనను తాను తెలియు- తత్త్వ మరయు

                           త్రాగకున్న వాడు  తత్త్వమెట్ల అరయురా?

                           విశ్వదాభిరామ! వినుర వేమ!

 అని ఆశువుగా చెప్పిన పద్యం గుర్తుకొస్తున్నది!

            నేడు రెండు చోట్ల శుభ్ర-సుందరీకరణలతో ఉత్పన్నమైన రకరకాల తుక్కుతో ఒక పెద్ద ట్రాక్టర్ ట్రక్కు నిండిపోయి, చెత్త కేంద్రానికి చేరిపోయింది.

            నిన్నటి నా విన్నపాన్ని మన్నించిన ఒక మహిళా కార్యకర్త తన 2000 దినాల స్వచ్చోద్యమం పట్ల అనుభవాన్ని- అభిప్రాయాన్ని కాస్త విపులంగా వ్రాసి ఇచ్చినందుకు సంతోషం.

            రేపటి మన శ్రమదాన సందేశాన్ని కూడ ఉభయ శివరామపురాల మధ్యస్థ – కోళ్లఫారం సమీపం నుండే ప్రకటిద్దాం!   

     ఎవ్వరు ఈ ఘనాపాఠి?

అసలితనిది ప్రతి నిజాన్ని అన్వేషించు సూక్ష్మ దృష్టి

ప్రత్యంగుళ చల్లపల్లి పట్ల మహా డేగ దృష్టి

ఐక్యరాజ్య సమితిలోన స్వచ్చోద్యమ ఘనత చాటు

నాదెళ్ల సురేష్ అంటే నా గ్రామపు ఘనాపాఠి!

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

బుధవారం – 24/06/2020,

చల్లపల్లి.

 

4.01 నిముషాలకు శివరాంపురం వద్ద
అడవి తంగేడు మొక్కలు నాటుతున్న కార్యకర్తలు