2053*వ రోజు....           25-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2053* వ నాటి చైతన్యాలు.

 

            ఈ 2053 వ నాటి చల్లని శుభోదయాన - 4.02 నిముషాల బ్రహ్మ ముహూర్తాన - వర్షంలేని కారణాన - ఉభయ శివరామ పురాల రహదారి మెరుగుదల కోసం - వచ్చే పోయే పరిసర గ్రామస్తుల మనసుల్లో కదలికలు వచ్చి, స్వచ్చ - శుభ్ర - సౌందర్య భావ వికాసాల కోసం - అంతిమంగా తమ తమ మనస్సాక్షుల సంతృప్తి కోసం - 31 మంది మూడు గ్రామాల (చల్లపల్లి, శివరామపురం, పెదప్రోలు) కార్యకర్తలు 6.05 దాక నెరవేర్చిన సామాజిక బాధ్యతలు చాలా వరకు సఫలమయ్యాయి. ఇందుకు గాను ఈ స్వార్ధ రహితులు ఏ 3.15 కో మేల్కొనే ఉంటారు. స్వచ్చోద్యమ సూచక ఏక రూప దుస్తులతో - 2 గంటల శ్రమదానానికి  పనికి వచ్చే కొన్ని సాధనాలతో - సైకిలు, మోటారు బండి వంటివి బైటకు తీసి సకాలంలో నిర్ణీత శ్రమ సందేశ వేదికకు చేరుకొన్నారు!

 

            ఒకటి కాదు - నేటి స్వచ్చోద్యమ కారుల శ్రమదాన వేదికలు మూడు. రెండు శివరామపురాల నడుమ కోళ్ల పరిశ్రమ దాపున కొందరు, 7 వ నంబరు పంట కాలువ - మేకల డొంకల నడుమ ఐదుగురు, సదరు పంట కాల్వ కు తూర్పు - దక్షిణపు గట్టు మీద ఆరేడుగురు తదేక దీక్షలతో బాధ్యతలు నిర్వర్తించారు.

 

             కత్తులతో, దంతెలతో, చీపుళ్లతో కోళ్ల నిలయం దగ్గర మురుగు కాలువ, దాని గట్లు, దారి, దాని అంచుల మీద చెత్తల మీద - దుమ్ము, ధూళి మీద, తాటి గింజలు, ఎండు కొబ్బరి బొండాలు, రాలిపడి మొలుస్తున్న తాడి మొక్కలు, చీమతుమ్మ కంపలు, ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ సంచులు, ఖాళీ పొట్లాలు వంటి వ్యర్ధాలన్నిటి మీద జరిగిన రెండు కార్యకర్తల గంటల యుద్ధంలో విజేతలెవరు? ఈ 15 - 16 మంది స్వచ్చ కార్యకర్తలే! ఒకరు ఒంగొని, ఒకరు నిల్చొని, కొందరు తడి నేల మీదే చతికల బడి, పిచ్చి మొక్కల్ని పీకి, ముళ్ల మొక్కల్ని నరికి, గడ్డిని, దర్భను కోసి, ఊడ్చి, పోగులు చేసి, ట్రస్టు వారి ట్రాక్టర్ లో నింపడంలో ఎవరి ప్రత్యేకత వాళ్లదే!

 

            ఎక్కడెక్కడ గత వేసవి ఎండలకు కొన్ని పూల మొక్కలు నశించాయో నిన్ననే లెక్కించి, వేకువనే అడవి తంగేడు పూల మొక్కలు తమతో బాటు తెచ్చుకొన్న సుందరీకరణ బృందం ఆ ఖాళీలన్నిటిని – మేకల డొంక వంతెన మొదలుకొని - ఉత్తర దిక్కుగా నాటారు. నిన్న నాటిన పూల మొక్కలకు ముళ్ల కంపలతో కంచెలమరిపోవడం ట్రస్టు ఉద్యోగుల వంతేమో!

 

             పంట కాలువ వంతెన తూర్పుగా - ఉత్తర – దక్షిణ గట్టు మీద ఒరిగిపోతున్న - రివిట్ మెంటుకు హానికరమైన నాలుగు తాడి చెట్లను రెస్క్యూ టీమ్ వారు సమూలంగా తొలగించారు.

 

            గతానుగతికంగా చర్విత చర్వణంగా విసుగు చెందని స్వచ్చ కార్యకర్తల నిత్య శ్రమదాన చర్యలను సచిత్రంగాను - సవివరంగాను – చదివితే - వింటే కొందరిలోనైనా స్వచ్చ – శుభ్ర - సుందర స్పృహ పుట్టుకు రావాలనే నా ప్రయత్నం!

 

            రేపటి శ్రమదానానికి నోచుకొనే స్తలం కూడ శివరామపుర రహదారే!

 

            నేటి వాంఛనీయములివి!

సమాజంలో ఈ కదలిక - స్వచ్చ - శుభ్ర చైతన్యం

తన కోసం తాను బదులు ఊరుకొరకు ప్రయత్నం

వ్యక్తిలబ్ది మాట మరచి సామూహిక సంక్షేమం

కష్టార్జిత స్వచ్చ - స్వస్త క్రమ వికాస పరిణామం!  

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

గురువారం – 25/06/2020,

చల్లపల్లి.