2054*వ రోజు....           26-Jun-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

2054* వ నాటి శ్రమ వైభవాలు.

ఈ వేకువ 4.00 కాకముందే హడావిడి చేసిన వర్షం 30 మంది స్వచ్చ కార్యకర్తల శ్రమదాన ప్రారంభాన్ని 5 నిముషాలు ఆపగలిగిందే తప్ప వారి సంకల్పంలోను, బాధ్యతా నిర్వహణంలోను ఏ మార్పు లేదు. సమయం-4.05 నుండి 6.05 దాక! స్తలం- కొత్త, పాత శివరామపురాల నడుమ గల పెదకదళీపుర రహదారి. స్వచ్చ కార్యకర్తల విభాగాలన్నీ ఒకే ప్రాంతంలో-ఒకే కృషి చేయడంతో కొంచెం సందడి మాత్రం పెరిగింది. తమకోసం-తమ కుటుంబం కోసం కాక గ్రామ ఉమ్మడి మేలుకోసం శ్రమిస్తున్న స్వచ్చ సైనికుల శ్రమదాన సందడికి, ఏనాటికానాడు అనుకొన్నది సాధిస్తున్న ఆత్మ  సంతృప్తికి కొదవేముంటుంది!

 

- ఈ వేళ కూడ కత్తులవారికి, గొర్రుల వారికి, చీపుళ్ల కార్యకర్తలకు కావలసినంత పని! ఎవరి స్వేచ్చ వారిది-ఎవరి దీక్ష వారిది!

 

- కాస్త అజాగ్రత్తగా ఉంటే చేతులు గాయపడే దర్భలను, గుబుర్లను కొందరు ఆ చీకటిలోనే- వానకు తడిసి జారుతున్నా నేర్పుగా కోసి గుట్టలు పేర్చారు- ఒకరు కొన్నిటిని ఇంటికి పట్టుకుపోయారు.

 

- సగం ఆరిన ఆ మురుగు కాల్వ పడమర ప్రక్క లోని ఎండు తాటి మట్టలు, రాలిపడి ముగ్గి ఎండిన తాటి పండ్లు, మొలకెత్తి మూరెడు పెరిగిన తాటి మొక్కలు, ఇతర నిరర్ధక పిచ్చి, ముళ్ల మొక్కలు, షరా మాములుగానే లభించిన ప్లాస్టిక్ సంచులు, ఖాళీ సారా సీసాలు-వీటన్నిటి పోగులు కలిపి ఒక ట్రాక్టర్ ట్రక్కుకు పైగా వచ్చాయి.

 

- దారికి తూర్పు దిశగా ఏ చిన్న జాగా కనిపించినా - సుందరీకణ కర్తవ్యం తీసుకొన్నవాళ్లు వదలక ఊడ్చి, చదును చేస్తూనే ఉన్నారు. బహుశా మరికొన్ని అడవి తంగేడు వంటి పూల మొక్కలు నాటే ప్రణాళిక ఉందేమో!

 

- రోడ్డుకు పడమరగా-డ్రైను గట్టుమీద-పొలం వైపు గల కొన్ని చీమచింత వంటి ముళ్ల గుబుళ్లను కత్తివీరులు నరికి శుభ్రం చేశారు.

 

- చీపుళ్ల వారు దారిని, దాని అంచుల్ని ఊడ్చి తమ వంతు కృషి కొనసాగించారు.

 

శివరామపురాల నుండి క్రొత్త కార్యకర్తలు వస్తారేమో అనే నా నిరీక్షణ ఫలించలేదు.

 

కాఫీ, టీ సేవనల-సరదా కబుర్ల సమయానంతరం డాక్టరు గారి ఆధ్వర్యంలో 2054 దినాల స్వచ్చోద్యమ పూర్వాపరాల సమీక్షతో బాటు కరోనా నేపధ్యంలో స్వచ్చంద శ్రమదాన భవితవ్యం గురించి కొద్దిగా తర్జన-భర్జనలు జరిగాయి.  ఇందులో ప్రజాస్వామ్య సంప్రదాయంగా అధిక సంఖ్యాకుల అభిమతం నెగ్గింది.

 

రేపటి స్వచ్చోద్యమకారుల శ్రమదాన వేదిక పెదకళ్లేపల్లి  మార్గంలో-శివరామపురం దగ్గరి కోళ్లఫారం సమీపముగా అని గుర్తించగలరు!

 

             అందరికి ఇది నా ప్రణామం

ఒకట-రెండా-వందనాళ్లా? ఓహో! ద్విసహస్రాల ముచ్చట

స్వార్థమెరుగక-గ్రామ పౌర సమాజ అభ్యున్నతికి ఇందరు

గట్టి తాత్త్విక పునాదులు గల ఘన మహోద్యమ కార్యకర్తలు

అందరికి ఇది నా ప్రణామం! ఇది అన్ని ఊళ్ల వర ప్రసాదం!        

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

శుక్రవారం – 26/06/2020,

చల్లపల్లి.