2055*వ రోజు....           27-Jun-2020

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

2055* వ నాటి ప్రత్యేకతలు!

 

            కాలంతో పోటీపడుతూ, నేటి వేకువ కూడ 4.02 – 6.10 సమయాల నడుమ – ఉభయ శివరామపురాల మధ్యస్థంగా – కోళ్ళ సముదాయాల పరిశ్రమ దగ్గర – పెదకళ్లేపల్లి రహదారి, తదిరుప్రక్కల జరిగిన శ్రమదానం విజయవంతంగా ముగిసింది. శ్రమదాన కర్ణులు 30 మంది! శ్రమ సమర్పిత – శుభ్ర సుందరీకృత ప్రాంతం 100 గజాల మేర.

 

            ఈ 2055 దినాల స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తల అకుంఠిత దీక్షాదక్షతల సేవా ప్రస్థానం అపూర్వమేకావచ్చు! అద్భుతమేకావచ్చు! చల్లపల్లిలోని శతాధిక వీధులు, బైటి రహదారులు ఈ మహనీయ కార్యకర్తల రెండు లక్షలకుపై బడిన పని గంటలతో పునఃపునః పునీతములు కావచ్చు గూడ! గ్రహించగలిగిన గ్రామస్తులు 30 వేలమందికి – చల్లపల్లిని దర్శించగలిగిన వారికి – సానుకూల దృక్పధమున్న ప్రతి ప్రేక్షకునకు ఇదొక కాలానుగుణ ఉత్తమ పాఠ్యాంశమే కావచ్చు! కరోనా కల్లోలిత గత ఐదారు మాసాల ప్రపంచం జపిస్తున్న మంత్రం – చల్లపల్లి స్వచ్చోద్యమ సారాంశమైన “శుభ్రంగా బ్రతుకు – ఆరోగ్యంగా మనుగడనడుపు – నీ క్షేమంతో బాటు నీ ప్రక్క వాళ్ళ భద్రత – స్వస్తతలను గుర్తుంచుకో” అనే సందేశం కావచ్చు! కాని తమకు తెలియయకుండానే ఆ పాఠాలు బోధిస్తున్న – సందేశాలు ప్రవచిస్తున ధన్యులైన ఈ కార్యకర్తలు మాత్రం సుదీర్ఘ కాలంగా తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో చూపిస్తూ ముందుకు సాగిపోతూనే ఉన్నారు. మరి వాటిని ఆమోదించిన – ఆచరించిన – అనుసరించిన వారి శాతం? పోనీ – నచ్చని, మెచ్చని, సద్విమర్శకుల శాతమో?

           

మనకు తెలిసిందే కదా – ఈ కార్యకర్తలు కర్మిష్ఠులు! నేటి వేకువ కూడ వీరు:

 

- దారికి పడమర ఉన్న మురుగు కాల్వలో – అక్కడక్కడ బురదలో దిగి, తాడి మట్టలను, అర  మగ్గిన తాడి పండ్లను, ఎండు విత్తనాలను ఏరి, గొర్రులతో లాగి – ఒడ్డుకు చేర్చారు. ముళ్ళ – పిచ్చి మొక్కలను కూడ పరిగణలలోకి తీసుకున్నారు.

 

- కొందరు కత్తులతో చెలరేగి, రోడ్డు అంచుల్లో మొలిచి పెరుగుతున్న తాడి మొక్కల్ని తుద ముట్టించారు. ఇందులో ఒకాయనైతే - పాటే తన మిత్రుడనుకొని పాటల, పద్యాల కూని రాగాలతో - ఒంటి నిండా ప్రాకుతున్న పురుగులు దులుపుకొంటూ - చెమటలు కార్చుతూనే తన సహచర పెద్ద కార్యకర్తల శ్రమను మరిపిస్తూ అర గంట పాటు పనిలో లీనం కావడం చూసిన నాకు

 

            (ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూసొలుపేమున్నది?

            ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది - మనకు కొదవేమున్నది?)

 

అనే కొసరాజు రాఘవయ్య గారి (తోడి కోడళ్ళు) సినీ గేయం గుర్తుకు వచ్చింది!

 

- అసలిందులో ఎవరు వెనక్కి తగ్గారు కనుక! రోడ్డును, కుడి ఎడమల అంచుల్ని ఊడ్చే వాళ్ళు, పారలతో చెక్కి చదును చేసి నారుమడి సిద్ధం చేసే వాళ్ళు, మంచి నీరందించే ఒక పెద్దాయన, ఫోటోలు తీసే (74 ఏళ్ళ) పూలరంగడు. పర్యవేక్షించే పెద్ద డాక్టరు. ఎవరి ధ్యాస వాళ్ళదే! (అందరి లక్ష్యం మాత్రం ఒక్కటే!)

 

            రేపటి శ్రమదాన విభవం కూడ పాత శివరామపురం సమీపానే ఉంటుంది.

 

          మరల మరల నినదిస్తా!

వట్టి గొప్పలసలొద్దని – గట్టి మేలు చేస్తామని...

సామాన్యులమై కూడ అసామాన్యుల మౌతామని...

ఉమ్మడి గ్రామం మేలుకు ఉద్యమించి లేస్తామని...

స్వచ్చోద్యమ చల్లపల్లి చాటుతోంది చూడండని...    

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

శనివారం – 27/06/2020, 

చల్లపల్లి.