2056* వ రోజు....           28-Jun-2020

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ మనం వాడవద్దు.

 

2056* వ నాటి సంపూర్ణతలు!

 

          ఈ ఆదివారం చీకటి సమయంలో వేకువ 4.01 కే పాత శివరామపురం దగ్గరి పెద్ద కోళ్ళ ఫారం దగ్గరికి చేరుకొన్న ఉభయ (చల్లపల్లి – శివరామపురాల) గ్రామాలకు చెందిన 32 మంది స్వచ్చంద సేవకులు రెండు గంటలకు పైగా – 6.10 నిమిషాల దాక తమ బాధ్యతాయుత ఆదర్శ శ్రమదానంలో కృతార్ధులయ్యారు. రెండు వారాలకు పైగా పట్టిన గ్రామ సమాజ కర్తవ్య నిర్వహణ సఫలీకృతమై 1 ½ కిలోమీటర్ల మేర – మేకల డొంక నుండి పాత శివరామపురం హద్దు దాక ఈ పెదకళ్లేపల్లి మార్గం పరిశుభ్రం గాను - పచ్చని ఏపైన గతంలో వీళ్ళే నాటి పెంచిన రకరకాల చెట్లతోనూ, వందలాది పూల మొక్కల రంగు రంగుల పూలతోను, కళకళలాడుతున్నది.

 

          తూర్పు దిక్కున దారి అంచున, అక్కడక్కడ కొన్ని దిబ్బల మీద అడవిలాగే మొలిచి పెరుగుతున్న తాడి మొక్కలిప్పుడు లేనేలేవు; మరో ప్రక్క డ్రైను లోపలి ఏ పది ట్రక్కుల తుక్కో ప్రస్తుతం కనిపించదు; పడమర పొలం గట్టు మీది కొన్ని తాడి చెట్లు కూడ కొంత సుందరీకరణం చెంది, ముళ్ళ పిచ్చి మొక్కలు అదృశ్యమైపోయి. రహదారి అంటే ఇదే – డ్రైన్లు ఉండవలసింది ఈ విధంగానే - మొత్తమ్మీద ఏ రోడ్డైనా ప్రయాణికులకు కనిపించవలసింది ఇంత ఆహ్లాదకరంగానే ...” అనే విధంగా ఇక్కడి – ఇప్పటి దృశ్యం ఉందా, లేదా? ఈ జూన్ మాసపు తొలినాటికీ – నేటికీ ఈ బాట ఆకృతిలో వచ్చిన చక్కని మార్పు – ఏ కొద్ది మంది పరిశీలనారహితుల దృష్టికో రాకుంటే – పోనీ!

         

          కొద్దిపాటి గజాల – శివరామపురం సమీప బాట మిగిలింది గాని, ఈ కార్యకర్తలు ఏదో ఒక రోజు ఆ బాకీ తప్పక తీర్చుకోక మానరు! రెండు వారాలకు మించి ఏ వెయ్యి పని గంటలో శ్రమించడంతో విశిష్టంగా కనిపిస్తున్న ఈ రహదారి శుభ్ర సుందరీకరణ దృశ్యం అనుభవం, విలువ రోజూ చూస్తున్న నా బోటి వాళ్ళకు తెలుసు! చెమటలు క్రక్కుతూ కష్టించిన కార్యకర్తలకు మరింత బాగా తెలుస్తుంది!

 

          - కోళ్ళఫారం దగ్గర నుండి శివరామపురం దాక – డ్రైనులోను, పొలం గట్ల మీద, దారి అంచుల మీద కత్తుల కార్యకర్తల శ్రమతో పిచ్చి – ముళ్ళ చెట్లు తొలగిపోయి, గడ్డి కూడ మాయమై, కొన్ని చెట్ల కొమ్మలు కత్తిరింపులకు గురై – ఆ వ్యర్ధాలన్నిటినీ దంతెల వారు రోడ్డు దారికి లాగి గుట్టలుగా పేర్చి, ఆ ప్రోగులన్నీ ట్రాక్టర్ ట్రక్కులో కెక్కి చెత్త కేంద్రానికి చేరినవి.

         

- చీపుళ్ళ వారి శ్రమదానంతో ఉదయం 6.00 కు ఈ 100 గజాల రహదారి చూస్తుండగానే శుభ్రతనీ, అందాన్ని సమీకరించుకొన్నది.

 

          శివరామపుర గ్రామస్తుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు – గతంలో కూడ ఇలాంటి పనులే చేసిన – ప్రతి నెలా 2,000/- విరాళమిస్తున్న రావెళ్ల శివరామకృష్ణయ్య గారు నేటి కాఫీ – టీ ఖర్చుల నిమిత్తం 600/- మనకోసం మనం ట్రస్టుకు సమర్పించారు.

 

          రేపటి ప్రధాన వీధి పునః శుభ్రత కోసం కీర్తి ఆస్పత్రి దగ్గరనే మన కలయిక!

 

         పదే పదే ప్రకటిస్తా.

సకల జగతి హితంలోనె వ్యక్తి సుఖం దాగుందని...

పుట్టిన - మెట్టిన గ్రామం పూర్తి స్వస్తమవ్వాలని...

కర్మచంద్ స్వరాజ్యకలలు సాకారం కావాలని...

స్వచ్చోద్యమ చల్లపల్లి చాటెనిదే చూడండని.....      

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

ఆదివారం – 28/06/2020,

చల్లపల్లి.