10.07.2020....           10-Jul-2020

 ఒక్కసారికి వాడేసే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం.

 

10.07.2020 వ నాటి రహదారుల – పూదోటలు

 

            నేటి చల్లని శుభోదయాన – పెదకళ్లేపల్లి బాటలోని మేకల డొంక సమీపాన – చల్లపల్లి పంచాయతీ పరిధిలోన - 16 మంది స్వచ్చ సుందర చల్లపల్లికి చెందిన శ్రమదాతల కృషి 4.00 – 6.05 సమయాల నడుమ కృతార్ధమైంది. వాస్తవానికిదంతా నిన్ననే జరగవలసిన పని. ఎడతెగని భారీ వాన నిన్నటి పూల మొక్కల స్థాపనావిధులకు అడ్డు తగిలి నేటికి బదిలీ అయింది!

 

            ఈ 16 మంది గ్రామ సమాజ హితాభిలాషులు అనుకొన్న సమయానికే నిర్ణీత స్థలానికి చేరుకోవడం, పలుగు – పారలు ధరించడం – చకచకా కర్తవ్య పాలనకు దిగడం – ట్రాక్టర్ పై నుండి ఒకరు పూల మొక్కలు దించి అందిస్తుంటే – అప్పటికే త్రవ్విన – త్రవ్వుతున్న గొప్పులలో – అప్పటికే పుష్పవతులైన రంగురంగుల బిళ్ళ గన్నేరు మొక్కల్ని నాటడం – ఇవన్నీ ఒక క్రమపద్ధతిలో చీకటిలోనే నిర్విఘ్నంగా జరిగిపోవడం – ఐతే ఇందుకు వరుణ దేవుడు సైతం సహకరించడం – అసలీ సుదీర్ఘ – నిరంతర కార్యక్రమం మొత్తం నిస్వార్ధంగా – నిరపేక్షంగా – 2070 రోజులుగా ఏ నాటికానాడు ముగుస్తుండడం.... ఏ పరిశీలకులకైనా, జిజ్ఞాసువులకైనా, సామాజిక వేత్తలకైనా ఏమనిపిస్తుందో మరి! వాళ్లే గనుక వ్రాయసగాళ్లైతే – ఏమని వర్ణించాలని తోస్తుందో గదా! నా వరకు నేనైతే –

 

            “ఇదే గ్రామపు ఋణ విముక్తి – ఇదె బాధ్యత - పరిపూర్ణత

            ఏ దేశపు – ఏ  కాలపు ప్రజలకైనా ఆదర్శత

            ఇది జాగృతి - నిరహం కృతి - ఇది సామూహిక సత్కృతి

            చల్లపల్లి పౌరులెల్ల సాహసింపదగు సంస్కృతి...”

 అని ఏవేవో రాయాలనిపిస్తున్నది!

 

- ముందే వివరించినట్లుగా, మేకలడొంక వంతెనకు పూర్వోత్తర దారి అంచున సుందరీకరణ సంఘం వందలాది రెండు రంగుల బిళ్ళ గన్నేరు పూలవనాన్ని సృష్టించారు. ఇందుకు పూర్వ రంగంగా అంత మేర నేల మీది గడ్డిని – పిచ్చి మొక్కల్ని తొలగించి చదును చేశారు. సమృద్ధ వర్షం వలన నాటిన ఈ మొక్కల పాదుల్లో నీరు పోసే పని తప్పింది.

 

- ఆ చిరు తడి రోడ్డునే ఒక కార్యకర్త రెట్టింపు శ్రమతో ఊడ్చి శుభ్రం చేస్తుంటే – మరొకాయన పాత మొక్కల చెదిరిపోయిన పాదుల్ని సరిజేస్తూ – రోడ్డు వార నిలిచిన నీళ్లకు డ్రైనులోకి దారి చూపెడుతున్నాడు.

 

కాఫీ టీ ల రుచుల నాస్వాదిస్తూ కూడ తాము ఈ నాడు నిర్వహించిన రహదారి సుందరీకరణను మరొక సారి పరిశీలించి, పరమానందం పొందారు.                                                                                           

రేపటి – బందరు రహదారి హరిత ప్రయత్నంగా అమరావతి ప్రభువుల వైజయంతం దగ్గర కలుసుకొందాం!

 

శతాబ్దాల కాలుష్యం X అరదశాబ్ది శ్రమదానం.

ఈ స్వచ్చోద్యమ చల్లపల్లి కేమంతగ వయసుందని!

శతాబ్దాల కాలుష్యం శాపం తన నెత్తి కెక్కి

అరదశాబ్ది శ్రమదానం అందులోని సగం దించి

పులుగడిగిన ముత్యం వలె ఊరు ప్రకాశిస్తున్నది!

 

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

శుక్రవారం – 10/07/2020,

చల్లపల్లి.