11/07/2020....           11-Jul-2020

ఒక్కసారికి వాడేసే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం.

 

11.07.2020 వ నాటి శ్రమ సుందర జాడలు!

 

            వర్షం చల్లపల్లి మీద మితిమీరిన ప్రేమను కురిపిస్తున్న నేటి వేకువ – అంతకన్నా ఎక్కువ అభినివేశమే ఉన్న స్వచ్చ కార్యకర్తలు అమరావతి రాజభవనం దగ్గరికి సకాలంలో చేరుకొన్నారు. కాని, గట్టి వర్షం ఆగే దాక – కొంత సమయం వేచియుండి – చిట్టి వానలోనే పనికి దిగి – 4.35 – 6.15 సమయాల నడుమ ఈ 18 మంది బృందం తన లక్ష్యాలను చేరుకొన్నది. అవి ఏమనగా;

 

- దారికి ఉత్తర దిశగా, వైజయంతం ప్రహరీ ప్రక్కన గత నెలనాళ్ళ వర్షానికి మొలిచి పెరిగిన గడ్డి, ఇతర మొక్కల తొలగింపు.

 

- పాదులు త్రవ్వి, రెండు రంగుల బిళ్ళ గన్నేరు పూల మొక్కలను ఒక క్రమపద్ధతిలో (సంఖ్యాపరంగా కొన్ని వందలు) నాటడం.   

 

- వాన దేవుడు వీళ్ళ కృషికి పెద్దగా ఆటంకం కల్గించక పోగా, సన్న చినుకులు రాల్చుతూ, పాదుల్లో నీరు పోసే శ్రమ తప్పించడం.

 

- ఇక రహదారి దక్షిణ దిశగా – రాజభవనం వెలుపల ఉన్న కంచెలోపలి ఉద్యానాన్ని గడ్డి, పిచ్చి మొక్కల్ని తొలగించి మరింత ఆకర్షణీయంగా మార్చడం.

 

- ఆ వనంలో బాగా పెరిగిన వేప వంటి కొన్ని చెట్ల కొమ్మలు అవసరం మేర కత్తిరించి, క్రొత్త ఆకృతి తేవడం.

 

- కంచె లోపల ఘాటు వాసనల – రంగు రంగుల పూల లాంటానా మొక్కల్ని కొలువు తీర్చడం.

 

- కంచె బైట పెరుగుతున్న గడ్డిని తొలగించి, అక్కడ కూడ పాదులు త్రవ్వి బిళ్ళగన్నేరు మొక్కల్ని నాటిన వైనం.

 

            ఇంకా, ఇవి కాక రహదారి మీది వ్యర్ధాలను చూస్తూ చూస్తూ వదిలి పెట్టలేరు గదా! ఈ వానలో, ఇంత బురదలో – తమ నిర్దిష్ట బాధ్యత మీదే దృష్టి నిలిపే ఈ కార్యకర్తలలో కొందరి బట్టలన్నీ బురద అంటుకొంటే అంటుకోనీ - చొక్కాల మీద గడ్డి, ఆకులు మురికి చారలు వస్తే రానీ, అక్కడక్కడా బురదలో కాళ్ళు కూరుకుపోతే పోనీ గాక – ఈ నాటికి తమ స్వయం నిర్దేశిత రహదారి హరిత – శుభ్ర – సుందరీకరణం పూర్తి చేశారు కదా! అందులో కొందరి ముఖాల్లో కొట్టవచ్చినట్లు కనిపించే సంతృప్తి గమనించాను గదా!

         

            స్వచ్చ కార్యకార్తలు మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు ప్రతి నెలా ఇచ్చే విరాళం 2000/- అందజేశారు. పొనమాల చిన్నబ్బాయి గారు తన మనవరాలు విహస్య రెండవ పుట్టిన రోజు వేడుక సందర్భంగా మనకోసం మనం ట్రస్టుకు 5,000/- అందజేశారు. పెద్దలకు వినయపూర్వక అభివందనలు, చిరంజీవికి స్వచ్చ కార్యకర్తలదరి తరపున శుభాశీస్సులు.

 

            నేటి మరొక విశేషం – పాగోలు వాస్తవ్యుడూ, ప్రస్తుతం తిరుపతి నివాసుడూ, సుమారు 85 ఏళ్ల వయసున్న “కంఠంనేని గంగయ్య” గారు 15+5+5 వేల విరాళాన్ని స్వచ్చ చల్లపల్లికి ప్రకటించడం! వారి సకాల సముచిత వదాన్యతకు మన అందరి అభివందనలు.

 

            రేపటి గ్రామ హరిత - సుందరీకరణ నిమిత్తం విజయవాడ బాటలోని రహదారి భవనం (R&B) దగ్గర మన పరస్పర పునర్దర్శనములు!

 

            కరమ్ చందుని వరప్రసాదం.

జాతిపిత గాంధీ మహాత్ముడే చాటి చెప్పిన స్వచ్చ మార్గం

ప్రతి దినం గంటన్నరైనా గ్రామ వికసన శ్రమప్రదానం

ఇదే బాటన స్వచ్చ సైన్యం – ఎవరికైనా అదేం కష్టం?

అనుసరిస్తే – ఆదరిస్తే అదే ఊరికి వరప్రసాదం!


- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

శనివారం – 11/07/2020,

చల్లపల్లి.