12/07/2020....           12-Jul-2020

ఒక్కసారికి వాడేసే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం.

 

(12.07.2020) వ అనగా – 2070*వ నాటి ఆదర్శం!

 

            ఔను మరి – నా దృష్టిలో ఈ సుదీర్ఘ స్వచ్చోద్యమకారుల నిర్విరామ 2070 దినాల చల్లపల్లి గ్రామ స్వచ్చ – శుభ్ర – హరిత - సుందరీకరణ మహా ప్రయత్నం నిశ్చయంగా ఆదర్శమే! 20 - 12 – 2013 నాటి తొలి దశలోను, 12.11.2014 నాటి మలి దశ నిర్మాణాత్మక – నిస్వార్ధ శ్రమదాన ఉద్యమంలోను – ఉభయ దశల్లో అడుగడుగునా ఎదురైన కొందరు గ్రామస్తుల పాత కరుడుగట్టిన అలవాట్లు మాన్పించడంలో – రోజురోజుకీ పెరిగిపోయిన ఉద్యమ వ్యయభారం మోయడంలో – చల్లపల్లి లోనే కాక – సమీప వివిధ గ్రామాలకు సైతం – కాలినడకన కూడా వెళ్ళి ఇదే ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంలోని శ్రమదమాదులను తట్టుకోగలగడంలో - శ్మశాన సుందరీకరణం, నవీకరణాల వ్యయ భారం మోస్తూ – ప్రభుత్వ పాలనా పరమైన కొన్ని చిక్కుల్ని విప్పుతూ రాటుతేలిన చల్లపల్లి స్వచ్చంద ఉద్యమం ఆదర్శం కాక మరేమిటి?

 

            నేటి వేకువ జామున వర్షమనేది చల్లపల్లి జోలికేరాని 4.01 – 6.10 సమయాల నడుమ – 17 మంది(- హోటల్ నిర్వహణలో బొత్తిగా తీరికలేని ఒక మహిళ, RTC విధులలో తీరిక చేసుకొన్న డ్రైవరులతో సహా –) తమ గ్రామం పట్ల, గ్రామస్తుల సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధతను చాటుకొన్నారు. (గ్రహణ శక్తి ఉన్నవాళ్లకు) తగినంత సామాజిక స్ఫూర్తిని పంచారు!

 

            వీరి పట్టుదల ముందు సుమారు 200 గజాల మేర విజయవాడ రహదారిలో – R & B అతిధి గృహం నుండి శ్రీ మంతు క్లబ్బు దాక వివిధ వ్యర్ధాల కాలుష్యం ఓడిపోయింది. క్రొత్తగా ఒక చిన్న రహదారి వనం ఏర్పడింది. దండమూడి కస్తూరమ్మ స్మారక సుందర వనం, శ్రీమంతు క్లబ్బు ఉత్తర భాగ పూల వనం ప్రాంతాలు గడ్డిని, పిచ్చి మొక్కల్ని కోల్పోయి, మరింత ఆకర్షణీయమయ్యాయి. రహదారి ప్రక్కల రంగు రాళ్ళ మురికిని, బురదను, ప్లాస్టిక్ తుక్కును, ఖాళీ సారాసీసాలను వదిలించుకొని, ఏ కొంచెం శుభ్ర స్పృహ ఉన్నవాళ్ళకైనా, సౌందర్యపిపాసా లేశం కలవారికైనా కనుల పండుగ చేస్తున్నాయి. ఈ కార్యకర్తలే గతంలో క్లబ్బు ప్రహరీ వెలుపల ఏర్పరచిన పచ్చిక తివాచీ నిర్వహణలోపంతో కళావిహీనమైపోతే – ఆ భాగానికి కూడా నేటి శ్రమదాతలు చక్కని పరిష్కారం చూపారు.

 

            చల్లపల్లిలో కరోనా కల్లోలం దృష్ట్యా 2070 దినాల మన సాటిలేని శ్రమదాన ఉద్యమం రేపటి నుండి 20 – 30 రోజుల పాటు ఆపాలనే నిర్ణయం నేటి విశేషం!

 

            తననొక వృద్ధునిగా గుర్తుంచుకోక – గతంలో స్వచ్చ సుందర చల్లపల్లి రూపకల్పనలో ప్రత్యక్షంగా – పరోక్షంగా భాగస్తులైన – చాల మారులు లక్షల కొద్దీ విరాళాలిచ్చిన – నేడు జన్మదినం జరుపుకొంటూ – 89 వ ఏట ప్రవేశిస్తున్న - దాసరి రామమోహనరావు మహోదయులు (విశ్రాంత వ్యాయామోపాధ్యాయులు) ఈ రోజు “మనకోసం మనం” ట్రస్టుకు రెండు లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో సమర్పించారు! వారి ఆదర్శానికీ, గ్రామ ప్రయోజకత్వానికి శతధా, సహస్రధా మన అభివందనాలు!

 

            గతంలో కూడా వీరు ‘స్వచ్చ చల్లపల్లి’ అభివృద్ధికి 12 లక్షల రూపాయల విరాళమందించారు. ఈ 2 లక్షలతో కలిపి ఇప్పటికి మొత్తం 14 లక్షల రూపాయలు.  

 

            సహర్షమగు శ్రమ సంస్కృతి.

మహాశ్చర్య ఉద్యమాలు మన ఎదుటే జరిగినపుడు

త్యాగశీల శ్రమ సంస్కృతి తారసపడి నిలిపినపుడు

స్పందింపక – చేయి కలిపి సహకరించకుండెదవా?

ఆదరించి – సహర్షముగ – అనుష్ఠించు చుండెదవా?

- నల్లూరి రామారావు

స్వచ్చసుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు

ఆదివారం – 12/07/2020,

చల్లపల్లి.