2073*వ రోజు ....           15-Nov-2020

స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం-2073*వ రోజు .

 

కరోన విస్తృతి దృష్టిలో ఉంచుకొని ఆదివారాలు మాత్రమే సామూహిక స్వచ్చంద గ్రామ బాధ్యతలు నిర్వహించాలనే కార్యకర్తల నిర్ణయం మేరకు ఈ ఆదివారం ఉదయం 4.05-6.12 సమయాల నడుమ ఆవిష్కృతమైన వీధి శుభ్రతా చర్యలు సంతృప్తి కరంగా సాగినవి. బందరు జాతీయ రహదారిలో – ముల్పూరి రహదారి వనం నుండి ప్రముఖ దంత వైద్యశాల వరకు, కొనసాగిన పారిశుద్ధ్య – సుందరీకరణ విధులలో ఉత్సాహంగా పని చేసిన కార్యకర్తలు 32 మంది.

 

నేటి శ్రమ దానంతో:

- ఈ జాతీయ రహదారి మరింత శోభస్కరంగా మారింది.

- రోడ్డు ప్రక్క రంగు రాళ్లకు మురుగు వానల వల్ల అంటిన మురికి, మట్టి వదలి, వాటి రంగులు చక్కగా తెలుస్తున్నవి.

- విశాలమైన ఈ బాటను చీపుళ్లతో ఊడ్చి, రంగు రాళ్ళను గోకుడు పారలతో గోకి, ఆకులలముల్ని పోగులు చేసి, గడ్డిని తొలగించి, ప్రతి కార్యకర్త తన శక్తి మేరకు పాటుబడి, ఈ గ్రామానికే ప్రత్యేకమైన శ్రమ జీవన సౌందర్యాన్ని ప్రదర్శించారు.

- ఈ అన్ని వ్యర్ధాల పోగులను ట్రస్టుకు చెందిన ట్రాక్టరులోనికి ఎక్కించి, డంపింగ్ కేంద్రానికి చేర్చారు.

 

            గత నాలుగు విడతల ప్రయత్నంతో బందరు రహదారి మూడు రోడ్ల ముఖ్య కూడలి దాక స్వచ్చ- శుభ్రమై పోయి ఉండాలి. ఐతే గురు-ఆదివారాలలో మాత్రమే స్వచ్చ శ్రమదానం జరగడం, గత వంద రోజులుగా వర్షాలకు మురికి పేరుకుపోయి ఉండడంతో, కార్యకర్తల నేటి కృషి కొంత నెమ్మదించింది.

ఆరేడు సంవత్సరాలుగా చల్లపల్లి సమాజ స్వచ్చ- శుభ్ర-స్వస్తతలకే అంకితమై పోయిన దాసరి రామమోహన రావు – స్వర్ణలత గార్ల నాల్గు తరాల స్వచ్చ కుటుంబం యొక్క అలుపెరుగని ప్రయత్నం నేడు మరికొంత విస్తృతమయింది – ఈ ఇంటి అల్లుడు, LIC సంస్థలో ఉన్నత ఉద్యోగం నుండి విరమించిన శ్రీ జాస్తి జ్ఞాన ప్రసాద్ గారు నేటి వీధి పారిశుద్ధ్య కృషిలో పాల్గొన్నారు.

 

6.15-6.30 ల నడుమ కాఫీ- టీ సేవనల సమయంలో Dr. D.R.K గారి సహృదయ దైనందిన స్వచ్చ కృషి సమీక్ష, నందేటి శ్రీనివాసుని పాట కార్యకర్తలను ఉత్తేజ పరిచాయి.

 

మన తదుపరి గ్రామ బాధ్యతల నిమిత్తం శనివారం (21.11.2020)వేకువ 4.30 కు భగత్ సింగ్ గారి దంతవైద్య శాల దగ్గర కలుసుకొందాం!

 

     ఎందరెందరో ధన్యులు-అందరికీ....

ఒక ఎక్కటి యోధుని తో ఒక్క ఊరు సురక్షితం

ఒక మహనీయుని ఒరవడి ఒక దేశపుటవసరం

ఎందరో మహానుభావులందరికభివందనం

ఆ ధన్యుల ప్రేరణె మన స్వచ్చోద్యమ కారణం!

 

నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి సభ్యులు

15.11.2020.