2074* వ రోజు....           21-Nov-2020

 స్వచ్చ చల్లపల్లి ఉద్యమం – 2074* వ రోజు

            ఈ (21.11.2020) శనివారం నాటి వేకువ 4.30 – 6.05 సమయాల నడుమ బందరు జాతీయ రహదారిలో కొంతమేర జరిగిన గ్రామ శుభ్ర సుందరీకరణలో పాల్గొన్న కార్యకర్తలు 28 మంది. పారిశుధ్య కృషి నెలకొన్న ప్రాంతం భగత్ సింగ్ గారి దంత వైద్యశాల నుండి తూర్పు రామాలయందాక. ఒక వంక పై నుండి జాలువారుతున్న మంచు తెరతోను, మరొక వంక జాతీయ రహదారి ప్రయాణాల రద్దీతోను, వీటికి తోడు కరోనా భూతానికి చిక్కని మెలకువలు పాటిస్తూ, సామాజిక దూరాన్ని గుర్తుంచుకొంటూ – నెలల తరబడి పెరుకుపోయిన దుమ్ము – ధూళిని గోకుతూ చీపుళ్లతో గుట్టలు చేస్తూ కార్యకర్తలు పడిన శ్రమ అభినందనీయం!

            బందరు దారిలోని ఈ కాస్త దూరంలోనే – నర్సరీలు, చేపల విక్రయ కేంద్రం, దేవాలయం పరిసరాలు గంటన్నర సమయంలో శుభ్రపడినవి. రకరకాల వ్యర్ధాలన్నీ చూస్తుండగానే గుట్టలుగా మారి, ట్రస్టు సంబంధిత ట్రాక్టర్ లోకి చేరి, డంపింగ్ కేంద్రానికి తరలిపోయినవి.

            నేటి గ్రామ బాధ్యతల ముగింపు సమయంలో కాఫీ ఆస్వాదన వేళ కార్యకర్తలకు గంగులవారిపాలెం మార్గంలోన ఇద్దరు ప్రముఖ కార్యకర్తల పెరటి జామపళ్లు, నిమ్మ పళ్ల పంపిణీ జరిగింది.

            మన స్వయం నిర్దేశిత రేపటి బాధ్యతల కోసం ఇదే చల్లపల్లి – బందరు మార్గంలోని కమ్యూనిస్ట్ వీధి దగ్గరి టీ దుకాణం దగ్గర రేపు వేకువ 4.30 కు కలుసుకొందాం.

            ఇది కరోనా కష్టకాలం.

శ్రమ విరాళం క్రమవికాసం జరిగెగద నీ గ్రామ మందున

మహాదర్శం మహోద్యమముగ మారెగదనీ కనుల ముందున

కరోనాతో కార్యకర్తల కాళ్ళు ముందుకు సాగనందున -  

అనుసరింపుడు – ఆచరింపుడు స్వచ్చ సైన్యం అడుగుజాడను!

నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు

21.11.2020.