1872* వ రోజు....           27-Dec-2019

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1872* వ నాటి శ్రమదాన వేడుక!

 

           నిన్నటి నిర్ణయం ప్రకారమే ఈ నాటి వేకువ కూడా విజయవాడ మార్గంలో రెండు చోట్ల జరిగిన గ్రామ కర్తవ్య నిర్వహణలో పాల్గొన్న స్వచ్చంద శ్రామికులు 33 మంది. సమయం 4.03 నుండి 6.15 నిమిషాల వరకు.

 

          వీరిలో మొదటి దళం 6వ నెంబరు పంట కాలువ దక్షిణ గట్టు వైపు - సారా బాటిలింగ్ కంపెనీ ప్రహరీకి నిన్న వేసిన బొమ్మలను కొనసాగించారు. ఇది శ్రీను మోటార్స్ యజమాని దాసరి శ్రీనివాసరావు గారి ఆర్ధిక సౌజన్యంతో రేపటికి ముగియనుంది.

 

          మరికొందరు కార్యకర్తలు కత్తులతోనూ, పంజాలతోనూ, చీపుళ్ళతోనూ తమ స్వచ్చ కృషిని కొనసాగిస్తూ భారీ వాహనాల కాటా సమీపంలోని విజయవాడ దారి ప్రక్కల ఈరోజు కూడా శుభ్రపరిచారు. పనిలో పనిగా ప్రక్కనున్న ఆటో నగర్ ఖాళీ స్థలంలో కూడా దాన్ని విస్తరించారు.

 

          ముగ్గురు మహిళా కార్యకర్తలు ఈ ప్రాంతం అర కిలోమీటరు పర్యంతం చీపుళ్లతో శుభ్రపరిచాక తెల్లవారి 6.10 కి చూస్తే ఈ దారంతా కన్నుల పండుగగా దర్శనమిస్తున్నది.

 

          కార్యకర్తలలో ఏడెనిమిది మంది శ్మశాన ప్రవేశక దారి ప్రాంతంలో, చిల్లలవాగు వంతెన దాటే దాక ప్రక్కకు నడుం వంచిన చెట్లను నిటారుగా చేసి  తాళ్ళతో లాగి ప్రక్కన పెద్ద చెట్లతో కలిపి బిగించారు. దారికి అడ్డు వస్తాయనుకున్న కొమ్మలను ఛేదించారు.

 

          చిల్లలవాగు వంతెన భాగం మొత్తాన్ని ఒక హోటల్ యజమానురాలు ఒంటరిగానే చీకట్లోనే క్షుణ్ణంగా ఊడ్చి శుభ్రపరచడమూ, ఒక పూల ముళ్ళ పొదలోని గడ్డిని, ఇతర వ్యర్ధాలను హీరో షోరూం యజమాని మోకాళ్లపై కూర్చుని శ్రద్ధగా శుభ్రపరచడమూ నేను చాలా సేపు గమనించాను.

 

          కాఫీ, టీ అనంతర స్వచ్చ శ్రమదాన సమీక్షా సమావేశంలో మరల ఒకసారి గత వారం జరిగిన ఉత్సాహ భరితమైన విశాఖ యాత్రను గుర్తుచేసుకున్నారు. విజయా జూనియర్ కళాశాల ఉపన్యాసకుడు వేముల శ్రీనివాస్ నిర్ద్వంద్వంగా ముమ్మారు ప్రకటించిన గ్రామ సుందర సంకల్ప నినాదాలతో 6.45 నిముషాలకు నేటి మన గ్రామ కర్తవ్యం పరిపూర్ణమైంది.

 

          గోళ్ళ సాంబశివరావు గారు తానిచటికి రావడం కుదరక స్వచ్ఛ కార్యకర్తలైన తన కుమారుడు – కోడలు ద్వారా కార్యకర్తలందరికీ లడ్లు పంపిణీ చేసి, మనకోసం మనం ట్రస్టుకు మొన్నటి తన కుమారుని, నేటి తన పుట్టిన రోజుల సంధర్భంగా 1000/- విరాళం అందజేశారు. బి. దుర్గా రాంప్రసాద్ గారు కూడా ఈ ట్రస్టుకు 502/- విరాళం ప్రకటించినందుకు ఈ ఉభయ శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు, ధన్యవాదములు.

 

          రేపటి మన స్వచ్చంద గ్రామ మెరుగుదల కృషి ఈ శ్మశానం వద్ద కొనసాగిద్దాం.

      

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శుక్రవారం – 27/12/2019

చల్లపల్లి.