1873 * వ రోజు ....           28-Dec-2019

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1873* వ నాటి త్రివిధ బాధ్యతా నిర్వహణలు.

 

ఈ వేకువ చలి(ఇతరులను) వణికిస్తున్నా లెక్క చేయని- గ్రామం మేలు కోరే – 10 మంది ట్రస్టు ఉద్యోగులతో సహా -  32 మంది స్వచ్చ కార్యకర్తలు విజయవాడ మార్గం లోని –

 

1. 6 వ నంబర్ పంట కాలువ వద్ద

 

2.  కాటా వంతెన- చిల్లల వాగు ఉత్తరపు గట్టు మధ్య భాగంలోనూ చోటు చేసుకొన్న కర్తవ్య పరిపూర్తి వివరాలు:

 

ముందుగా గత నాల్గు రోజుల నుండి 6 వ నంబరు పంట కాలువ దగ్గర సుందరీకరణ కోసం తమ ప్రతిభను, శ్రమను ప్రదర్శిస్తున్న 5 గురు సుందరీకరణ కృషీ వలుల ను ప్రస్తావించాలి. ఇన్ని రోజులు ఈ మూడు గోడలకే వీరి కృషి మొత్తం పరిమితమై పోయిందంటే – ఆ గోడలను తుడవడం, కడగడం,ఆరిన తరువాత ప్రైమర్ పూయడం,  దానిని ఆరబెట్టి  రెండు విడతల రంగు పూయడం అది కూడా ఆరిన తరువాత చూపరులకు సందేశం ఇచ్చే రకరకాల బొమ్మలు వేయడం – మరి సాధారణ కళాకారులు ఇంత శ్రద్ధ పెట్టలేరు కదా.

 

చిల్లల వాగు, తరిగోపుల ప్రాంగణాల దగ్గర ఈ రోజు జరిగిన స్వచ్చ కృషిని, కార్యకర్తల పట్టుదలను సరిగ్గా వివరించాలంటే నాలుగైదు పేజీలు రాయవలసి వస్తుంది. రహదారికి ఇరువైపులా ప్రతి అంగుళాన్ని వీళ్లు పట్టి పట్టి శుభ్రపరుస్తూ మొక్కల పాదుల్ని సవరిస్తూ ట్రీ గార్డులను అందంగా సర్దుతూ అక్కడి అందాలకు, స్వచ్చ శుభ్రతలకు పాఠాలు నేర్పారు.

 

వీరుకాక గ్రామ రక్షక దళ చతుష్టయం  గంగులవారిపాలెం దారి ప్రక్కల నిన్న కత్తిరించిన ముళ్ల కొమ్మలు తదితర వ్యర్ధాలు ట్రస్టు యొక్క ట్రాక్టర్ నిండా సేకరించి వాటితో గత వర్షాలకు చిల్లల వాగు దగ్గర పడిన గండిని పూడ్చారు.

 

ఈ నాటి ముఖ్య విశేషం – చల్లపల్లి స్వచ్చోద్యమ వీరాభిమాని అయిన, మాతృ భాషలో విద్యా బోధన కు నబద్ధుడైన రాజా రవి వర్మ మాష్టరు గారు శ్మశాన ప్రాంగణానికి వచ్చి దాని అందచందాలను మళ్లీ మళ్లీ తిరిగి చూచి మనకోసం మనం ట్రస్టుకు  తనకు మనవడు పుట్టిన సందర్భంగా 10,000 /- విరాళాన్ని సమర్పించడం,

 

ఎక్కడో నైజీరియాలో ఆరేడేళ్ల నుండి ఉద్యోగిస్తున్న  కొర్రపాటి ప్రవీణ – ప్రవీణ్ రాజా దంపతులు పంపిన టీ షర్టులను, టోపీలను, బిస్కెట్లను కార్యకర్తలకు రాజా తండ్రి అయిన మన స్వచ్చ కార్యకర్త కొర్రపాటి వీర సింహుడు చేతుల మీదుగా పంపిణీ చేసి ఆనందించడం నేటి మరొక విశేషం.

 

6.55 నిముషాల సమయంలో కాంపౌండర్ వక్కలగడ్డ వేంకటేశ్వర రావు ముమ్మారు స్పష్టంగా పలికిన స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతో నేటి మన బాధ్యతా నిర్వహణ కు స్వస్తి.

 

రేపటి శ్రమదానం కూడా ఈ చిల్లల వాగు గట్ల మీదే జరుగుతుంది.

 

      పంచవర్ష స్వచ్చోద్యమ ....

జడివానలు పెను గాలులు దాని నాప గలిగెనా

అతి శీతల హిమ పాతం అడ్డగింప జాలెనా

టీ కప్పుల తుఫానులై తేలిపోయి వివాదాలు

స్వచ్చోద్యమ చల్లపల్లి సాగె నైదు వత్సరాలు !

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శనివారం – 28/12/2019

చల్లపల్లి.