2104 * వ రోజు ....           14-Jan-2021

 ఒక్క సారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

  

ఏడేళ్ళ స్వచోద్యమ చల్లపల్లిలో 2104* వ నాటి బాధ్యతలు.

ఈ సంక్రాంతి పర్వదిన బ్రహ్మ ముహూర్తంలో –వేకువ సమయంలో- తమ గ్రామ పరిశుభ్రత కోసం కష్టించిన కార్యకర్తలు 27 మంది.

 

వాళ్ల సంకల్ప సిద్ధిగా స్వచ్చ –సుందరీకృత దర్శనీయ ప్రదేశాలు-ఊరికి 2 ½ కిలో మీటర్ల దూరాన-బెజవాడ దారికిరుదరులు. ముఖ్యంగా బాట పడమర డ్రైను, దాని గట్టులు, వాహనాల దీపాల వెలుగు తెరలుగా పడే మంచు వలన ఐదారు గజాల దూరమైనా కనపడని చిమ్మచీకటిలోనే ఈ గ్రామ సేవలు! ఇలాంటప్పుడే భర్తృహరి ఏనాడో చెప్పిన

 

“ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై

ప్రారబ్దార్థము వీడిపోవరు సుమీ! ప్రజ్ఞానిధుల్గావునన్”

(నీచ మానవులు అసలు మంచి పనులనే ప్రారంభించరు. మధ్యములైతే – ప్రారంభిస్తారు గాని, ఆటంకాలకు భయపడి మధ్యలోనే ఆగిపోతారు. ధీరులు మాత్రం ఎన్ని విఘ్నాలు ఎదురౌతున్నా, రెట్టించిన ఉత్సాహంతో- ప్రజ్ఞతో తమ విధులను ఆపక పూర్తి చేస్తూనే  ముందుకు సాగుతారు).  

అనే వక్కాణింపు గుర్తుకొస్తుంది.

 

చల్లపల్లి స్వచ్చోద్యమకారుల గ్రామ బాధ్యతా నిర్వహణ కిది కొద్ది రోజుల క్రిందట 8 వ క్రిస్టమస్, 7 వ సంక్రాంతి! ప్రాత నుండి క్రొత్తకు, చెడు నుండి మంచికి, దుర్మార్గం నుండి సన్మార్గానికి, సంక్రమణమే(మార్పే) మకర సంక్రాంతి సంకేతం అనుకొంటే- ఈ స్వచ్చోద్యమ లక్ష్యం ఎవరి ఊరును, మనసును, ఇళ్ల పరిసరాలను వారు కశ్మలం నుండి స్వచ్చతకు-అస్తవ్యస్తత నుండి స్వస్తతకు – కాలుష్యాల నుండి పచ్చదనాలకు, పరిశుభ్రతకు- భీభత్సాల నుండి ఆనందాల- అందాల హరివిల్లులకు మార్చుకోవడమే చల్లపల్లి స్వచ్చంద శ్రమదాతల పండుగ దిన సేవల సందేశం!

 

ఉపన్యాసాలెవరైనా ఇవ్వగలరు; ఆదర్శాలెవరైనా వల్లెవేయగలరు; ప్రచారం కోసం కొందరు పరులకు సేవలూ చేయగలరు-తాము నమ్మిన ఆదర్శం కోసం ఇంత సుదీర్ఘ కాలం త్రికరణ శుద్ధిగా – నిరాడంబరంగా –స్థిరంగాముందుకు సాగే మహనీయులు మాత్రం చల్లపల్లి వంటి అతి తక్కువ చోట్ల మాత్రమే ఉంటారు!

 

నేటి శ్రమదానం తరువాత కాఫీ- కబుర్ల వేళ, సమీక్షా సమావేశంలో నిన్నటి భోగి వేడుకల నిర్వహణం, ముఖ్య అతిథి శ్మశానంలోను-గ్రామంలోను, ముఖ్యంగా గంగులవారిపాలెం రహదారి ఉద్యానంలోను పర్యటించడాన్ని , మెచ్చుకోవడాన్ని కార్యకర్తలు పదేపదే గుర్తు చేసుకొన్నారు. గ్రామస్తుల మీద ప్రత్యక్షంగాను, పరోక్షంగాను నిన్నటి కార్యక్రమాలు ఎంత ప్రభావం చూపించాయో అంచనా వేసుకున్నారు.

 

శివరామపురం గ్రామస్తుడైన ఒక కర్షక కార్యకర్త- మల్లంపాటి ప్రేమానందం ముమ్మారు చెప్పిన గ్రామ స్వచ్చ-శుభ్ర-సుందర సంకల్ప నినాదాల పిదప, డాక్టర్ డి.ఆర్.కె. గారి నిన్నటి-నేటి సంగతుల సమీక్ష తరువాత 6.55 కు ఈనాటి విధి నిర్వహణలు ముగిశాయి.

 

రేపటి మన గ్రామ మెరుగుదల కృషి కూడ విజయవాడ దారిలోనే. అందుకుగాను వేకువ 4.30 కే అందరం తరిగోపుల ప్రాంగణం దగ్గరే కలుసుకుందాం.

 

          ఇంత స్వచ్చోద్యమం సంగతి

 ఔను- జనవిజ్ఞాన వేదిక శుభారంభం చేసి ఉండును

వైద్యుడొకరు బలీయముగ ఈ ఉద్యమం వెనుకుండ వచ్చును

ధ్యాన మండలి తదితర స్వచ్చంద సంస్థలు నడుం కట్టక

రెండు వేల దినాల పైగా బండి నడచుట సాధ్యపడెనా?

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

14.01.2021.