2105* వ రోజు ....           15-Jan-2021

 2105* – (కనుమ పండగ) నాటి చల్లపల్లిలో స్వచ్ఛంద శ్రమదానం.

 

15.01.2021 – గురువారం వేకువ సమయాన మంచు దట్టంగా క్రమ్ముకొస్తున్న 4:29 ఘడియలకు 25 మంది స్వచ్ఛంద స్వచ్చ సైనికులు విజయవాడ మార్గం చిల్లలవాగు వంతెన దగ్గర తరిగోపుల ప్రాంగణం దగ్గర అనుకొన్న వేళకన్న ముందే ఠంచనుగా హాజరయ్యారు.

 

నిన్న మొన్నటి ముఖ్య పండుగలలాగే నేటి మూడవ పండుగను కూడ ఈ కార్యకర్తలు యదాలాపంగా కాక ఊరికి ప్రయోజనకరంగానూ, సామాజిక సందేశాత్మకంగాను- తమ అపూర్వ శ్రమదానంతో మేళవించి జరుపుకోవడం ఎంత అభినందనీయం! గ్రహించగలిగిన గ్రామస్తులకెంత మంచి ఉదాహరణం!

 

స్వచ్చోద్యమం తొలి దశలో గ్రామస్తుల్లో కొందరు ఈ స్వచ్ఛ కార్యకర్తల్ని చక్కటి పిచ్చోళ్ళుగా భావించారు గాని కాలక్రమేణా సరిగ్గానే అలోచించి, సంఘీభావం ప్రకటించారు ఇక ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళు కూడ ఈ సకాల స్వచ్ఛంద శ్రమదాన ఒరవడిని అంది పుచ్చుకోవడమే ప్రస్తుతావశ్యకం.

 

నేటి శ్రమదాతలేమో పాతికమంది. మరి బెజవాడ బాట కుడి ఎడమల డ్రైను వ్యర్ధాలేమో అధికం. ఐతేనేం ఈ స్వచ్ఛ సైనికుల్లో రెండు చేతుల్లో కత్తి/ దంతెలు ధరించి, కాలుష్యాల అంతు చూడగల సవ్యసాచులున్నారు. కత్తులతో ఏడుగురు నరుకుతున్న వ్యర్ధాలను ఒక్కరే లాగి, పోగులు పెట్టగల వీరులున్నారు.

 

అవసరమైతే ఆ చీకట్లోనే ఘాటు దుర్వాసనలోనే మొలలోతు మురుగు కాల్వలో దిగి పరమ ఛండాలాలను చేతులతో బైటకులాగ గల మురుగు వీరులుకూడ ఉన్నారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇలాంటి పారిశుధ్య నిపుణుల కారణంగానే గదా ఆరేడేళ్ళ నుండి చల్లపల్లి ఇంత స్వచ్ఛ సుందరంగా, దేశ ప్రసిద్ధంగా కొనసాగుతున్నది! కనుకనే ఈ విశిష్ట పరాక్రమ వంతుల ప్రతాపం ఇక్కడ చిరకాలం కొనసాగాలని నావంటి వాళ్ల ప్రగాడ వాంఛ! (ఐతే నేటి ఒక వింత సంఘటనేమంటే వీరిలో ఒక సమున్నత వీరుడు డ్రైను గట్టు మీది ముళ్ళ చెట్టును నరుకుతూ చేసిన సింహనాదంతో రోడ్డు మీద వెళుతున్న ఖాళీ చెరుకు బండి మీద నిద్రిస్తున్న ఒక శ్రమజీవి అంతెత్తున ఉలికిపడి లేచాడు!)

 

దారికి తూర్పు డ్రైనులో సుందరీకర్తల కళాత్మక శ్రమదాన విన్యాసం నేడు కూడ మరికొంత పురోగమించింది. (వ్యంగ్యమో, సహృదయ వెటకారమో తెలియదు గాని, ఇంతటి గొప్ప కృషిని ఒకానొక కార్యకర్త పనికి ఆహార పధకంఅని ఛలోక్తి విసిరాడు!)

 

నేటి 6.45 సమయపు సమీక్షా సమావేశంలో కాంపౌండర్ వక్కలగడ్డ వేంకటేశ్వరరావు ముమ్మార్లు నినదించిన గ్రామ స్వచ్ఛ శుభ్ర సుందర సంకల్పానికి కార్యకర్తలు ప్రతి నినాదాలు చేయగా, ఇంకా ఊరిలోని నాల్గు ముఖ్య ప్రదేశాలలో కొందరు బాధ్యతారహితులు వేస్తున్న వ్యర్ధాలను వాటిని నిలువరించే ఉపాయాలను చర్చించారు.

 

రేపటి తరువాయి పారిశుధ్య చర్యల కోసం ఇదే చిల్లలవాగు వంతెన సమీప తరిగోపుల ప్రాంగణం దగ్గరే - 4.30 కే కలుసుకొందాం.                              

      స్వచ్ఛ సైన్య ప్రయత్నం

చేయగలిగినంత మేర చేసి చేసి గ్రామసేవ

వ్రాయగలిగినంత దాక రాసి రాసి స్వచ్ఛ సేవ

ఆలోచన కాచరణకు అంతరాన్ని తగ్గిస్తూ

శ్రమ సంస్కృతి విశిష్టతను జనంలోన చాటిస్తాం! 

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

15.01.2021.