2107* వ రోజు ....           17-Jan-2021

చల్లపల్లి స్వచ్ఛ సుందర ఉద్యమం - 2107* వ నాటి కృషి.

 

ఈ ఆదివారం (17.01.2021) నాటి వేకువ 4:23 సమయంలో విజయవాడ బాటలోని బాలాజి విభాగ భవన సముదాయం దగ్గర ఆగి, తమ తమ స్వచ్చాయుధ సంపన్నులైన 34 మంది స్వచ్ఛ సైనికులు 6.20 దాక నిర్వహించిన గ్రామ బాధ్యతలు విజయవంతమైనవి. అపార్ట్ మెంట్లకు ఉత్తర దిక్కున, దక్షిణ దిశలోని దారికిరువైపుల డ్రైనులు, వాటి గట్టులు ప్రస్తుతానికి శోభాయమానంగా మారినవి!

 

ఇతర కార్యకర్తలు ఒకమారు శుభ్రపరచిన చోటులను మరింత శ్రద్ధగా, నిక్కచ్చిగా, పట్టి పట్టి సుందరీకరణ విభాగం వాళ్ళు అప్పుడప్పుడు తీర్చిదిద్దడం కద్దు. ఈ వేకువ జామున కూడ నారాయణరావు నగర్ ముఖ్య ప్రవేశ మార్గం దాపుల్లో అలా జరిగింది.

 

స్వచ్ఛ కార్యకర్తల నిత్య శ్రమదాన ఉద్యమం క్రమబద్ధమూ, ఏకోన్ముఖుమే గాని అందులోనూ ఎవరి అభిరుచులూ, ప్రణాళికలూ, సాధనలూసంతృప్తులూ వారివే! కొందరు గోకుడు పారలతో రోడ్డు మార్జిన్ల గడ్డిని, పిచ్చి - ముళ్ళ మొక్కలనూ చెక్కుతారు. తామే గతంలో శ్రమపడి నాటి, సాకిన పూల, ఇతర చెట్ల కొమ్మలు కాస్త క్రమం తప్పినా సరే నిర్దాక్షిణ్యంగా నరకడానికి కొందరు వెనుకాడారు. మొక్కల పాదుల్ని సరిజేసి, కుదుళ్ళలో కలుపు తీయడం ఒకరిద్దరి అభీష్టం! కత్తులతో, దంతెలతో పనిచేస్తూనే ఎడతెగని కబుర్ల రాయుళ్ళూ ఉన్నారు. ముగ్గురు - నలుగురేమో చీపుళ్ళతో రహదారి నంతా తదేకంగా ఊడ్చి, ఆ స్వచ్ఛ సుందర ప్రదేశాన్ని చూసుకొని సంబరపడుతుంటారు.

 

బాలాజీ అపార్ట్ మెంట్లు - ఉత్తర దిక్కున లారీలు నిలిపే చోట ఉన్న డంపింగును గుట్టలు చేసి, ఊడ్చడంలో 12 మంది ఇవాళ నిమగ్నులయ్యారు. జాగ్రత్తగా వింటే వీళ్ళ పని మెరుగుదల గురించి నడుమ నడుమ హెచ్చరికల రూపంలో కొందరి ఆశుకవిత్వాలు కూడ వినిపిస్తాయి?

 

అసలు - బాధ్యతకల స్వచ్ఛ కార్యకర్త అంటే ఎవరు?

 

వేమన్న కవి చెప్పినట్లు కడివెడు ఖరము పాలవంటి వాడు కాదు; గరిటెడు గంగి గోవుపాల వంటి వాడు! వేలాది సాధారణ పురుషుల (మానవుల) నుండి వేరుపడిన పుణ్యపురుషుడు! ఏళ్ల తరబడీ క్షీర సముద్రమధనం కన్న మిన్నగా జరిగే మానసిక మధనంతో తన కోసం తానుగా కాక, “మనకోసం మనంగా పరివర్తనం చెందుతూ వ్యక్తిత్వ సంకుచితత్వాన్ని అధిగమించి, విశాల విశ్వసౌభాగ్య భావవనలందుకొంటూ ఈ అద్భుత సత్పరివర్తనను క్షేత్రస్థాయిలో సత్కర్మరూపేణా ప్రతిఫలించే దిన దినమూ, క్షణక్షణమూ మెరుగు పడే రాటుదేలే అసాధారణ శక్తి సంపన్నుడు!

 

మరి ఇలాంటి ప్రతి కార్యకర్త నేటి సమాజానికెంత అవసరమో అతని విలువ ఎంతటిదో లెక్కించగలమా?

 

ఈ ఉదయం7 గంటల కన్న ముందే సమీక్షా సమావేశంలో సూటిగా బలంగా తన గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలను ప్రకటించిన వారు బొమ్మిశెట్టి ఆత్మపరబ్రహ్మం! కాఫీల ముందు విందు వంటి ఉపాహార ప్రదాతలు పలనాటి అన్నపూర్ణ, ఆకుల దుర్గా ప్రసాద్, భోగాది వాసులు.

 

ఈ 20 వ తేదీ బుధవారం వేకువ 4.30 కు మనం కలుసుకొని, తదుపరికర్తవ్య నిర్వహణకు పూనుకోవలసిన చోటు – S.R.Y.S.P సంస్థ ఎదుట.

 

        రాముడున్నదేనట అయోధ్య!

అసంఖ్యాకులు స్వచ్ఛ సుందర కార్యకర్తల శ్రమ విరాళం

ఎక్కడుంటే అదే సుందర చల్లపల్లి గ మారిపోదా?

అయోధ్యలోనే రాముడుండున? రాముడున్నదె అయోధ్యగునా?

కార్యకర్తకు ప్రణామంబులు స్వచ్ఛతా నీరాజనంబులు!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

17.01.2021.