1874* వ రోజు....           29-Dec-2019

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1874* వ నాటి శ్రమదాన విన్యాసం.

 

          ఈ ఆదివారం నాటి చల్లని వేకువ 4.05 – 6.20 నిముషాల నడుమ వ్యవధిలో విజయవాడ రాచబాటలోని రెండు ప్రదేశాలలో ఆసక్తికరంగా సాగిన శ్రమదానంలో పాల్గొన్న స్వచ్చోద్యమ కారులు - ట్రస్టు ఉద్యోగులు, ధ్యాన మండలి, లయన్స్ సహా 44 మంది. ద్విముఖ గ్రామ కర్తవ్య నిర్వహణలో :

 

1. వారం రోజులుగా జరుగుతున్న 6 వ నంబరు పంట కాలువ వంతెన ముస్తాబు, ప్రక్కనున్న ప్రభుత్వ ప్రాంగణ ప్రహరీ మీద స్వచ్చ – సుందరోద్యమ స్ఫోరక చిత్రలేఖ నాలు నేటితో ముగిసినవి. జనావాసాల మధ్య ఉదయ సూర్యుడు, పచ్చని చెట్ల మీద పక్షుల బొమ్మలుకాక, ఆరు చేతుల స్వచ్చోద్యమకారుని చిత్రం ప్రధాన ఆకర్షణగా ఉండి, వందలాది పాదచారుల వాహన ప్రయాణికుల దృష్టిని అనివార్యంగా పట్టి నిలిపే విధంగా ఉన్నది. వారిలో పదోవంతు మందిలోనైనా స్వచ్చోద్యమ స్ఫూర్తిని నిలపాలని ఆకాంక్షిద్దాం! ఈ ప్రాజెక్టు మొత్తంలో – తరగని దీక్ష, సృజనాత్మక శ్రమ కార్యకర్తలది. ఆర్ధిక చేయూత హీరో షోరూమ్ యజమాని దాసరి శ్రీనివాసరావుది!

 

2. నేటి ఎక్కువ మంది కార్యకర్తల శ్రమదాన వేదిక చిల్లలవాగు పరిసరాలు. వారు పూల మొక్కల మాటున మొలిచిన ఇరుక్కొన్న గడ్డిని, తుక్కును పీకి తొలగించారు. వంతెన గోడల్లో మొలిచిన మొండి చెట్లను పీకి, వంతెన ఆయుర్ధాయం పెంచారు. ఎక్కడి డ్రైనులోదో గాని, బురద మట్టిని తెచ్చి, నిన్న పూడ్చిన వాగు గండిలోని చెత్త మీద పరిచారు. వక్కలగడ్డ దిశగా తామే పెట్టిన – పెంచిన చెట్ల పాదుల్ని చక్కదిద్దారు. ట్రీ గార్డుల్ని వంకర తీసి సర్దారు. చీపుళ్ళ మహిళా కార్యకర్తలా దారినంతా పట్టి పట్టి ఊడ్చి శుభ్రం చేశారు.

 

3. శ్మశాన ప్రవేశ – తరిగోపుల ప్రాంగణాల కెదురుగా మట్టిలో కూరుకుపోయిన అతి బరువైన రాతి కట్టడ పద్మాన్ని 10 మంది స్వచ్చ యోధులు 20 నిముషాలు కష్టించి, పైకి లాగి సరిగా అమర్చడం సాక్షాత్తు ఒక యుద్ధం లాగే తోచింది.

 

          తెల్లవారుతున్న సమయంలో శ్మశాన ముఖ ద్వార సమీప సుమ సుందర ఉద్యానాలొక ప్రక్క, స్వచ్చ – శుభ్ర దీక్షాపరులై, ఎవరి పనిలో వారు మునిగి ఉన్న స్వచ్చ శ్రామికులొక వంక – చూసే వారికదొక వింత లోకం! అందరిలా ముసుగుతన్ని పడుకోక బ్రహ్మ్మ ముహూర్తంలో గంటన్నర పాటు తమ గ్రామం కోసం పాటుబడే పిచ్చి వాళ్ళ స్వర్గం! 1874 రోజులుగా నిరాఘటంగా దర్శనమిస్తున్న స్వచ్చ ప్రపంచం!

 

          6.50 నిముషాలకు గోళ్ళ వేంకటరత్నం గారు ముమ్మారు ప్రకటించిన స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతో, రామకృష్ణ ప్రసాదు గారి దైనందిన సమీక్షతోనే నేటి మన కర్తవ్యం ముగిసింది. ధ్యాన మండలి వారు సమర్పించిన కమ్మని అల్పాహార విందుకు మన అందరి ధన్యవాదాలు.

 

          తూము వేంకటేశ్వరరావు గారి కుమార్తె వివాహానంతర వేడుక కోసం 12.00 కు చండ్ర వికాస కేంద్రం దగ్గర, రేపటి మన గ్రామ కర్తవ్యం కోసం గ్రామ ప్రధాన కేంద్రం దగ్గర కలుద్దాం!

 

      స్వచ్చోద్యమ సభ్యత్వం.

దీనికె మీనం – మేషం లెక్కబెట్ట వచ్చునా!

లాభం – నష్టం – లెక్కలు లాగి – పీక వచ్చునా!

ఒక్క అడుగు ముందుకేసి రెండడుగుల వెనుక కేసి

రెంటికి చెడిపోయినట్టి రేవడులై పొదుమా!

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

ఆదివారం – 29/12/2019

చల్లపల్లి.