2111* వ రోజు ....           23-Jan-2021

2111* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లి విశేషాలు.

 

నిన్నటి నిర్ణయం ప్రకారం బెజవాడ మార్గంలో – 6 వ నంబరు పంటకాలువ, విజయా కాన్వెంట్, చిన్న కార్ల కడుగుడు/మరామత్తుల స్ధలం అనే మూడు చోటుల మధ్య జరిగిన స్వచ్ఛ – శుభ్ర చర్యలలో 28 మంది కార్యకర్తలు భాగస్వాములయ్యారు. తమ శక్తి మేరకు వీరు గ్రామం మెరుగుదలకు ప్రయత్నించిన ముహూర్తం వేకువ 4.23, 6.20 వేళల నడుమ.    

 

వేలాది దినాలుగా నడుస్తున్న చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో తిలకిస్తున్న – గమనిస్తున్న గ్రామస్తులకు గాని, పాత్రికేయులకు గాని, దేశవిదేశాలలో నిత్యం అనేక ప్రాంతాల నుండి అభిమానిస్తున్న – ఆశీర్వదిస్తున్న వందలాది సౌందర్యాభిలాషులకు గాని ఒక్క విషయం బోధపడే ఉంటుంది – చల్లపల్లి స్వచ్ఛ సైనికులు పూనుకోనివి, చేయనివి, గెలవనివి లేనే లేవని! రాటు దేలిన ఈ దృఢమనస్కులు. తమ గ్రామం స్వచ్ఛ – స్వస్త – సౌందర్యాల సాధన కోసం దేనికీ వెరవరని! శ్మశానాల చీకటికీ భయపడక – మురుగు కాల్వల దుర్భర దుర్వాసనల భీభత్సానికీ వెనుకంజ వేయక – పంట కాల్వల వ్యర్ధాలనీ వదలక – చీపుళ్లతో వీధి పారిశుధ్య చర్యలకీ పాల్పడి – చెట్ల పచ్చదనాలతో ఊరిని నింపి – పూల సోయగాలతో, పరిమలాణాలతో  గ్రామ ఆహ్లాదాన్ని పెంచి.... తాము నిర్దేశించుకొన్న లక్ష్యాల దిశగా వడివడిగా అడుగులేయడం ఎంత సాహసమో – ఎంత అద్భుతమో ఆలోచించండి!

 

ఈ కార్యకర్తలు తమ నిస్వార్ధ శ్రమదానంతో ప్రోది చేసిన – సృష్టించిన  ఈ అద్భుతాన్ని – ఈ స్వచ్ఛ – శుభ్ర - సౌందర్యాలనీ మనసారా ఆహ్వానించడం, రెండు చేతులతో కౌగిలించడం – ప్రోత్సహించడం – ఆచరించడం ఈ గ్రామ పౌరులుగా మన తక్షణ కర్తవ్యం కాదా? సువిశాలమైన, పరిశుభ్రమైన శ్మశాన, చెత్త సంపద కేంద్రాల, దహనవాటికల, తరిగోపుల ప్రాంగణ అమరికలనీ, కార్యకర్తల శ్రమతో శుభ్రపడిన విజయవాడ రహదారినీ వీలైతే గ్రామస్తులిప్పుడు ఒక్కసారి చూడవచ్చు; దీని భద్రత, శుభ్రత ఎలా సాధ్యపడినవో చర్చించవచ్చు!

          అగాధమౌ జల నిధిలోన ఆణిముత్యమున్నటులే కష్టాల మరుగున దాగి సుఖ ముండునులే!   “ఏదీ తనంత తానై నీ దరికి రాదు – శోధించి సాధించాలి అదియే ధీర గుణం

         కలకానిది – విలువైనిదీ

          అని (వెలుగు నీడలు సినిమాలో) శ్రీ శ్రీ చెప్పినట్లు – కార్యకర్తలతో మనం కూడ భుజం కలపి శ్రమించవచ్చు!

 

          చల్లపల్లి సుదీర్ఘ స్వచ్చోద్యమాన్ని ప్రత్యక్షంగా చూసి, తెలుసుకొని, ధృవీకరించుకొని, బహుశా అనుకరించుకోవడానికి ఈ రోజు పొరుగు జిల్లా నుండి కొందరు ఔత్సాహికులు వస్తున్నారు.

 

          6.25 కు జరిగే సమీక్షా సమావేశంలో గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సుందర సంకల్ప నినాదాలను ముమ్మారు నిన్న ప్రకటించినది గోళ్ళ విజయకృష్ణ కాగా నేటి వంతు B.D. నాయుడు మోహనరావు గారిది.

 

          రేపటి మన రహదారి పరిశుభ్రతా ప్రయత్నం సైతం విజయవాడ బాటలోని 6 వ నంబరు పంట కాలువ ప్రాంతమే. వేకువ 4.30 కే మన పునర్దర్శనం!

 

      At 4.30 AM on 12.11.2014.  

ఏ ప్రశంసార్హమగు కృషికపు డంకురార్పణ జరిగెనో!

జనం మరచు కనీస బాధ్యత జ్ఞప్తి చేయుట జరిగెనో!

ఐక మత్యం – శాంతి – సహనం అగ్రపీఠిన నిలిచెనో!

ఒక మహోన్నత దీర్ఘ ఉద్యమ మొకటి మొగ్గలు తొడిగెనో!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

23.01.2021.