2112*వ రోజు ....           24-Jan-2021

  

2112* వ (వికటకవి మాదిరి’→’ సంఖ్యా దినం) నాటి చల్లపల్లి స్వచ్చోద్యమం

 

ఈ ఆదివారం (24.1.2021) విజయవాడ రోడ్డు లో ఉత్సాహంగా పాల్గొన్న కార్యకర్తలు 35 మంది.

 

వీళ్ళ శ్రమదాన వేడుకకు నోచుకొన్న ప్రాంతం ఇంచుమించుగా నిన్నటి చోటే! అనగా పాతకార్ల నిలయానికి  అటూ –ఇటూ గా నేటి స్వచ్చ బాధ్యతా ముహూర్తం 4.26, 6.26 నడిమి కాలం. మరి రెండు, మూడు దినాలు ఒకే చోట శుభ్రతా సాధన ఎందుకంటే- అది స్వచ్చోద్యమ కారుల అభీష్టానికి, అభినివేశానికి సంబంధించిన విషయం.

 

ఒకే అర కిలో మీటరు దూరాన్ని ఇందరు ఆరి తేరిన- అనుభవజ్ఞులైన కార్యకర్తలు- పాతిక ముప్పై మంది ఏ నూట యాభై గంటలో ఏమి బాగు చేస్తారబ్బా-అని నాలాగే కొందరి కనిపించవచ్చు. అందుకనే నాలాగే సోదర గ్రామస్తులు ఏ రోజైనా వేకువనే వచ్చి, ప్రత్యక్షంగా చూసి, పరిశీలించి, పాల్గొనవచ్చు. ఐతే – అందుకు మనం వదులుకోవలసింది నిద్ర బద్ధకాన్ని ; తెచ్చుకోవలసింది గ్రామ పౌర సమాజం పట్ల కాస్త  బాధ్యతని; రోడ్లు ఊడ్చి, మురుగులాగే పనికినేనా?” అనే ఆహాన్ని, బిడియాన్ని గనుక మనం త్యాగం చేశామంటే, స్వచ్చ సైనికులతో గంటన్నర పాటు చేతులు కలిపి శ్రమించామంటే – అందుకు ప్రతిఫలంగా పొద్దున్నే ఒక మంచి పని సాధించి విద్యుక్తధర్మం నెరవేర్చిన – ఆత్మ సంతృప్తిని పుష్కలంగా పొందగలం!

 

స్వచ్చంద శ్రమదాతలైన ఈ వృద్ధులు, పిల్లలు, రైతులు, వృత్తినిపుణులు మహిళలు వందల మంది 2112దినాలుగా నిస్వార్ధంగా ఊరి బాగు కోసం పాటుబడుతూ ఏనాటి కానాడు సంపాదించుకొంటున్నది అదే గదా! స్వాతంత్ర్య ఉద్యమానికి ముందూ, తరువాత “ గుంటూరు గాంధీ” గా పేరు మోసిన వట్టికూటి వేంకట సుబ్బయ్య గారు  50 ఏళ్లకు పైగా ఒంటి చేత్తో ప్రతిరోజూ గుంటూరులో పారిశుద్ధ్య పనులు చేసింది బహుశా ఈ తృప్తి కోసమే! (ఆయన కీర్తి శేషించిన దానికి  గుర్తుగా పట్టణంలో సగం దిగంబర దేహంతో, భుజం మీద పలుగు- పార, తట్ట ధరించిన తన శిలా విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి.)

 

చ్చల్లపల్లి స్వచ్చోద్యమ కారుల్లో “ సుందరీకరణ విభాగం ఒకటున్నది వాళ్ల ప్రత్యేక కృషి ఫలితంగానే కదూ, మన ఊరు “స్వచ్చ సుందర చల్లపల్లి “ గా మారింది.! ఐతే ఈ రోజు పోటీగా మరొక “సుందరీకరణ దళాన్ని “ చూశాను. ఈ రెండు ముఠాల పోటీతో అసహ్యంగా ఉన్న చిన్న-తుక్కు- కార్ల ప్రాంతం బాటలో  తూర్పు, పడమర దిశల తుక్కుల్ని ఏరి, ఆకు అలముల్ని ఊడ్చి ఊడ్చి, గడ్డి-పిచ్చి మొక్కల్ని చెక్కి, చెక్కి , కార్యకర్తల వాహనాల్ని ప్రక్కకు జరిపి మరీ సాధించిన స్వచ్చతలో రెండు చిన్న మంచి అద్దాలు ఏర్పడినవి-  చూసిరండి!(ఇందుకే “ స్పర్దయా వర్ధతే విద్యాః” అనే పాత సామెతను మార్చి; “ స్పర్ధయా వర్ధతే- స్వచ్చ-సౌందర్య – పరిశుభ్రతాః” అని చదువుకొందాం!)

 

“ ఎవరి పిచ్చి వాళ్లకానందం” అంటారు గాని, చల్లపల్లి స్వచ్చ సైనికుల ఈ పిచ్చి మాత్రం ఊరి మంచికే వచ్చింది!

 

ఈనాటి స్వచ్చ-సుందర కృషి సమావేశంలో-6.35 సమయంలో మూడు మార్లు గ్రామ స్వచ్చ-శుభ్ర-సౌందర్య సంకల్పాన్ని చాటి చెప్పిన వారు- గతంలో చల్లపల్లి స్వచ్చ కార్యకర్త ఐన- ఇప్పుడు యార్లగడ్డ లో స్వచ్చోద్యమాన్ని 485 రోజులుగా ఇరగదీస్తున్న తూము వేంకటేశ్వర మహోదయుడు! అంతకుముందు కార్యకర్తలకు నిమ్మ పళ్లను పంచింది ఒక వయో వృద్ధ కార్యకర్త, కూర అరటికాయలు సమకూర్చింది శివబాబుగారు! ఆ చల్లని సముద్ర గర్భం....” పాటను  (బహుశా 50 వ మారు ) వినిపించినది నందేటి శ్రీనివాసుడు.

 

ఈ ఆదివారపు స్వచ్చ కృషి తీరును ఇంత వివరంగా వ్రాస్తున్నదెందుకంటే- వేలాది దినాల ఈ స్వచ్చోద్యమం ఈ కార్యకర్తలకు  ఒక తప్పనిసరి తద్దినం కాదు, బలవంత బ్రాహ్మణార్ధం కానే కాదనీ, రొడ్డ కొట్టుడు కాక ప్రీతి పాత్రమైన చైతన్యవంతమైన సృజనశీల కార్యమనీ చెప్పడానికే.

 

మన తదుపరి గ్రామ స్వచ్చ బాధ్యతల కోసంవిజయవాడ రోడ్డు లోని పాత కార్ల నిలయం వద్దనే బుధవారం(27.01.2021) నాటి వేకువనే కలుసుకొందాం!

 

 

        స్వచ్చాభివందనం. (1727 వ రోజు - 04.08.2019)

డెబ్బడెనుబది స్వచ్చ వీరుల దీక్ష నిండిన గమనములతో-

చల్లపల్లికి - కప్తాన్ పాలెం –పెదప్రోలుకు –మోపిదేవికి

స్వచ్చ శుభ్ర స్ఫూర్తి నింపే సమర శంఖాలను ధ్వనించిన

స్వచ్చ వైతాళికుల కిదె నా వందనము - లభివందనమ్ములు!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

24.01.2021.