1875 * వ రోజు....           30-Dec-2019

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1875* వ నాటి వీధి శుభ్రతలు.

 

ఈ వేకువ 3.58 – 6.20 నిముషాల మధ్య జరిగిన స్వగ్రామ బాధ్యతా నిర్వహణలో 31 మంది పాల్గొన్నారు. ప్రధాన కార్యక్షేత్రం :  సంత బజారు కాగా కొసరుగా యడ్ల వారి వీధి వరకు పడమరగా ATM సెంటరు నుండి మూడు రోడ్ల కూడలి వరకు కూడా ఈ శ్రమదానం జరిగిపోయింది.

 

ఎక్కువ మంది ఎక్కువ సమయం శ్రమించింది మాత్రం బందరు దారి మొదలుకొని సాగర్ టాకీస్ గేటు వరకే . సంత ఎదురుగా, రైతు బజారు ముంగిట,  పోలీస్ నివాస భవనాల ప్రాంతంలో, సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణం వెలుపల జరిగిన నేటి స్వచ్చ-శుభ్ర సుందరీకరణ చర్యలతో ఆ విశాలమైన సంత బజారు మొత్తం నేటి సోమవారపు సంతకు వచ్చే స్థానిక, ఇతర గ్రామస్తులు వేలాది మందికి, వ్యాపారులకు కన్నుల పండుగగా, ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ( ఈ మొత్తం 10 వేల మంది జనం ఒక్క ప్లాస్టిక్ సంచి వాడక-ఇక్కడ ఏ ఫ్లెక్సీ కనిపించక నేటి సంత జరిగిపోతే స్వచ్చ సైన్యం, గ్రామ పంచాయతీ, పోలీస్ శాఖ విజయవంతమైనట్లు మనం చెప్పుకోవచ్చు). ఆ వీధిలో ఉండే భోజన, టిఫిన్ హోటళ్ల, రకరకాల దుకాణాల యజమానులంతా స్వచ్చోద్యమ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటే స్వచ్చ సుందర  చల్లపల్లికి ఎంత శోభస్కరంగా ఉంటుందో చెప్పనక్కర లేదు.

 

కొంత మంది కార్యకర్తలు షాబుల్ బజారులో ఉన్న రద్దును తీసి పల్లాల్లో వేశారు.

 

ఈ సంత వీధిలో శుభ్రతా చర్యలు ముగుస్తుండగానే కొందరు మహిళా కార్యకర్తలు మిగిలిన వారు ఇంకా కొద్ది సమయం మిగిలినందు వల్ల అక్కడి నుండి బందరు దారిలో తూర్పు దిశగాను, పడమర ప్రధాన గ్రామ కేంద్రం దిశగాను చీపుళ్ల తో,  గొర్రులతో 6.12 నిముషాల దాకా దుమ్మును , ఇసుకను , ప్లాస్టిక్ తదితర వ్యర్ధాలను శుభ్ర పరిచారు.

 

కాఫీ, టీ సేవనం తరువాత జరిగిన సమీక్షా సమావేశంలో నేటి, రేపటి స్వచ్చంద శ్రమదానం ప్రస్తావనకు వచ్చింది. నేటి స్వచ్చ సుందర చల్లపల్లి సంకల్ప నినాదాలను అడపా రాంబాబు – తోట నాగేశ్వర రావు గార్లు సంయుక్తంగా ముమ్మారు ప్రకటించి ఈనాటి గ్రామ విధులను ముగించారు. మన గ్రామంలోని అత్యంత సీనియర్ వైద్యులు శ్రీ దుగ్గిరాల శివ ప్రసాద్ గారు ఒక సంవత్సరానికి సరిపడా –ఐదేసి వందల చెక్కులు పన్నెండు డా. డి.ఆర్.కె. ప్రసాదు గారి ద్వారా మనకోసం మనం ట్రస్టుకు విరాళంగా సమర్పించినందుకు ధన్యవాదములు. 

రేపటి మన స్వచ్చతా యజ్ఞం కోసం విజయవాడ దారిలోని గాంధీజీ స్మృతి వనం దగ్గర కలుసుకొందాం.

 

      ఒకానొక విన్నపం.

అందరి మెప్పును పొందుట అంతగ సులభం కాదని

అధిక సంఖ్యలో ప్రజల్ని ఆకట్టుటె గొప్పయని

ప్రజల మేలుకై తప్పక ప్రజలతో మమేకమవ్వాలని...

స్వచ్చోద్యమ పంచవర్ష సాక్షిగ ఇది సత్యమనీ....     

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

సోమవారం – 30/12/2019

చల్లపల్లి.