1876 * వ రోజు....           31-Dec-2019

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1876* వ నాటి వైవిధ్యం.  

ఈ సంవత్సరాంతపు వేకువ 4.03-6.15 మధ్య సమయంలో తమ గ్రామ స్వచ్చ-శుభ్రతలకు అంకితులైన కార్యకర్తలు 29 మంది. 13 నెలల క్రిందట అప్పటి శాసన సభ్యులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి చొరవతో రూపొందిన గాంధీ మహాత్ముని స్మృతి వనాన్ని (విజయవాడ మార్గంలో) ఈ రోజు రెండు సమయం పాటు కార్యకర్తలు ఉత్సాహంగా శుభ్ర పరచి, మహాత్మునికి నిజమైన నివాళులర్పించారు.

                         

కొందరు విగ్రహ వేదికను ఊడ్చి, తుడిచి, తమ నిబద్ధతను చాటు కోగా, కొడవళ్లతో ఎక్కువ మంది సరిగా నీరందక నిస్తేజంగా ఉన్న పచ్చిక (లాన్) భాగమంతా కోసి, గోకుడు పారలతో చెక్కి, గోకి మెరుగు పరచే ప్రయత్నం చేశారు.

 

జాతిపిత విగ్రహం పరిసరాలలో అడ్డ దిడ్డం గా పెరిగిన పిచ్చి చెట్లను, తీగలను, గడ్డిని ఇద్దరు కార్యకర్తలు నరికి, ఛేదించి, కోసి, ఊడ్చి, ట్రస్టు ట్రాక్టర్ లోకి ఎత్తి 6 వ నంబరు పంట కాలువ దక్షిణపు గట్టుకు గతంలో పడిన గండిలో నింపారు.

 

గ్రామ రెస్క్యూ టీమ్ అక్కడికి దగ్గరలో గత నెలలో పంచాయతీ వారు డ్రైను నుండి తోడిన బురద మట్టిని ట్రాక్టర్ లో నింపి, పంట కాలువ వంతెనకు దక్షిణ-పడమర గట్టు మొదట్లో పడిన గండిలో సర్ది, వాహన-పాద చారులకు చక్కని సౌకర్యం కల్గించారు.

 

స్మృతి వనంలోను, ఎదురుగాను మహిళా కార్యకర్తలు ఊడ్చి-శుభ్ర పరిచారు.

 

NTR పార్కు నవీకర్త ముమ్మనేని నాని తన మిత్రులతో బాటు 6.00 తరువాత స్వచ్చ కార్యకర్తలను కలిసి 10.00 కు జరిగే- 2.5 లక్షల వ్యయంతో పార్కులో ఏర్పరచిన శాస్త్రీయ “నడక దారి” ప్రారంభోత్సవానికికార్యకర్తలను ఆహ్వానించి, 6.50 కి ముమ్మారు స్వచ్చ గ్రామ సంకల్ప నినాదాలను ప్రకటించి నేటి మన గ్రామ కర్తవ్యం ముగించారు.

 

రేపటి క్రొత్త సంవత్సర తొలి శుభోదయ సేవలు కూడ జాతిపిత స్మృతి వనం దగ్గరే కొనసాగిద్దాం!

 

         ఈ లాంగ్-మార్చ్ వెనుక!

స్వచ్చోద్యమ చల్లపల్లి సాగు కథాక్రమ మెట్టిది?

బ్రహ్మ ముహూర్తాన లేచి స్వచ్చ-శుభ్ర కృషి మొదటిది

రాజకీయ- కుల-మతాల ప్రసక్తులే లేనట్టిది

లక్ష్యాల పై దృష్టి నిలిపి లాంగ్ మార్చ్ చేస్తున్నది!   

 

నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

మంగళవారం – 31/12/2019

చల్లపల్లి.