2127* వ రోజు ....           14-Feb-2021

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

2127* వ రోజు స్వచ్చంద శ్రమదాన వివరాలు.

 

14.02.2021 తేదీ నాటి వేకువ 4.27 సమయానికి బెజవాడ మార్గంలోని ప్రైవేటు విద్యాసంస్థ ప్రవేశం దగ్గర 14 మంది స్వచ్చంద సామాజిక సేవకులు జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంమాధ్యమ చిత్రంలో కనిపిస్తున్నారు. మరో 28 మంది కూడ వీరితో కలిసి సుమారు 2 గంటల పాటు నెరవేర్చిన వివిధ గ్రామ క్షేమకర చర్యల్ని తదనంతరం మెరుగుపడి అందంగా, సౌకర్యంగా ఉన్న రహదారినీ, ఉభయ పాఠశాలల పరిసరాలనూ ఎవరైనా చూచి మెచ్చదగినవే తప్పక అనుసరించదగినవే! ఆదివారమనేది చాల మంది దృష్టిలో ఆటవిడుపుకావచ్చు గాని, ఊరి మేలు దృష్ట్యా స్వచ్ఛ కార్యకర్తలకు మాత్రం ముఖ్యమైనది.

 

అలా లేకుంటే ఇందరు రోడ్డు ఊడ్చి, డ్రైన్లలో దిగి శుభ్రపరిచి. రహదారి గుంటల్ని పూడ్చి, దారుల వెంట తామే నాటి పెంచి పోషించిన చెట్ల పాదులు సరిజేసి, సుందరీకరించడం జరగదు. ఎండిన బురద మట్టిని కూడ బాగుచేసి, ట్రాక్టర్ లోకి ఎత్తి ఊరిలో అవసరమైన చోట్ల దాన్ని సద్వినియోగించడం కుదరదు!

 

గంటన్నర పైగా పని వేళలో తెలిసిన ఇతరులెవరైనా తమతో మాట్లుడుతుంటే, ఈ కార్యకర్తలు పని ఆపకుండ, డ్రైనులో ఉండే వాళ్ళని సమాధాన పరుస్తారు! ఈ నాటి పనిని రేపటికి వాయిదా వేసి, విశ్రాంతి పొందరు. స్వచ్చందంగా ఒక విశాల దృక్పధంతో చేసే పనికీ, ఏదో ప్రయోజనమాసించి జరిగే పనికీ ఎంత అంతరం ఉంటుందో తెలియాలంటే ఈ ఉషోదయ గ్రామ సేవలో పాల్గొని, కార్యకర్తలతో చేయి కలపవలసిందే!

 

30 మంది స్వచ్చంద శ్రామికుల ఆదివారం నాటి కృషి వివరాలు :

 

- షరామామూలుగానే సుందరీకరణ విభాగం వారు నిన్నటి తాము పనిచేసిన చోటును మరొక మారు మరింతగా ఊడ్చి, చదునులు చేసి బెజవాడ బాటలో మరిన్ని అందాలకై ప్రయత్నించారు. ఈ సారి ఏ చిన్న రాతి ముక్క కూడ తప్పించుకొని జారిపోనంతగా వాళ్ళ పని ఉంది!

 

- విజయ పాఠశాల ఎదుట ఎండి, బిగిసిన బురద మట్టి నిధి కనిపించగానే పన్నెండు మంది కారకర్తలు దాన్ని పలుగులతో కదిలించి, పారలతో డిప్పలను నింపి, ట్రాక్టర్ లోనికెత్తి, శ్మశాన స్థలిలోని మరికొన్ని పల్లాలను మెరక చేసుకున్నారు. ఆ బురదలోని అన్ని దరిద్రాలను సీసా పెంకులు, పాత గుడ్డ ముక్కలు, ప్లాస్టిక్ సంచులు వగైరాలను విడగొట్టే పని కూడ వీళ్ళదే!

 

-   బాటలనీ, మార్జిన్లనీ చీపుళ్లతో ఊడ్చే పని కొందరిది.

 

- చెట్ల, పూల మొక్కల కుదుళ్లు బాగు చేసే బాధ్యత మరికొందరిది.

 

          కొద్దిగా ప్రమత్తుడై 6.35 సమయంలో గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య బాధ్యతా నినాదాలను ముమ్మారు ఎలుగెత్తిచాటినది తూము వేంకటేశ్వరరావు గారు.

 

          సపరివరంగా ఏతెంచి, మళ్ళీ తన సర్పంచ్ అభ్యర్ధత్వానికి మద్దతు కోరి, భగవన్నామ గానం చేసిన వారు మేరుగు ఝాన్సీ!

 

          తన వివాహ 42 వ సంవత్సర జ్ఞాపికగా సహ కార్యకర్తలకు రుచికరమైన ఉపాహార విందునూ, “మనకోసం మనంముఖ్య బాధ్యునికి 1020/- విరాళాన్ని సమర్పించినది చెక్ పోస్టు కోడూరు వేంకటేశ్వరరావు గారు.      

 

మన తదుపరి స్వచ్చోద్యమ పునర్దర్శనం 18.02.2021 – గురువారం వేకువ 4.30 సమయంలో బెజవాడ, నడకుదురు దారుల కూడలిలో!

 

            అట్టివారికి ధన్యవాదం. 

తమ సహోదర పౌరసేవకు ధన్యమైన ఉదాత్తయత్నం

కనిని వినని వినూత్న విస్తృత గ్రామ స్వస్తత మహోద్యమం

ఎవరు పూనిరొ పూర్తి చేసిరొ స్వచ్ఛ సుందర గ్రామయజ్ఞం

ఆ విశాల మనస్కులందరి కందజేసెద ధన్యవాదం!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

14.02.2021