2128* వ రోజు ....           18-Feb-2021

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

2128 * నాళ్ల స్వచ్చ-సుందర – ప్రశాంత చల్లపల్లి లో శ్రమదాన ప్రమోదం

 

          పంచాయతి ఎన్నికల కోలాహలానంతరం గురువారం(17.02.2021) వేకువ సమయంలో బెజవాడ బాటలో-NTR పార్కు ఎదుట హాజరైన స్వచ్చోద్యమ కారులు పద ముగ్గురు (వాట్సాప్ చిత్రంలో), మరొక 15 మంది దాని వెలుపల చేరి, 6.10 దాక గ్రామ కాలుష్యాల మీద చేసిన పెనుగులాటలు తప్పక గమనార్హమైనవి. నా అక్షరాల-మాటల వ్రాతలతో పని లేకుండానే- ఎవరి ఉపన్యాసం అవసరం రాకుండానే- ఈ స్వచ్చ కార్యకర్తల దైనందిన శ్రమదానమూ, దాని ఫలితంగా గ్రామస్తులకు ఒనగూడే సౌకర్యమూ, ఆహ్లాదమూ ఏ రోజూకారోజు మన డాక్టరు గారి, శాస్త్రి గారి వాట్సాప్ చిత్రాలే బాగా వివరించగలవు!

 

          ఆగినది ఇంధన నిలయ ఆవరణలోనైనా, సగం మందికి పైగా విజయ విద్యా సంస్థ ఎదుటా, దానికి దక్షిణాన ప్రభుత్వాసుపత్రి బాటలోనూ శ్రమిస్తూ కనిపించారు.  వారిలో 10 మందికి  అతి విలువైన బురద- తుక్కు మట్టి నిధి కనిపించింది మరి! సదరు తుక్కును, ప్లాస్టిక్ సంచుల్ని, సీసాపెంకుల్ని విడగొట్టి, నిజమైన మట్టిని సేకరించి, ట్రాక్టర్ లో నింపుకొని, శ్మశానం దాక తరలించి, అక్కడి ఎత్తు పల్లాలను సరిదిద్దారు.

 

          ఐదుగురు సుందరీకర్తలు భారీ వాహనాల వల్ల అక్కడ పడిన గుంటల్ని సరిచేసి, వేగ నిరోధకాల దగ్గర , నారాయణ రావు నగర్ దారిని మరింతగా ఊడ్చి, సౌందర్య మనస్కులకు కనువిందు చేశారు. ఎలక్షన్ల నో, ఇసుక బండ్లనో, అల్పాహార ఉత్పాదక- ఆరగింపుల అంగళ్ల నో- ఇంకా ఏమి కారణాలతోనైనా గాని- చల్లపల్లి బాటలిలా కశ్మల పూరితాలు అవుతూనే ఉంటాయి. ఆ బాటల స్వచ్చ-శుభ్రతలకు పూచీ పడే స్వచ్చ కార్యకర్తలకు బాగా పని దొరుకుతూనే ఉంటుంది!

 

      NTR పార్కు బైట గోడకు, మురుగు కాల్వకూ, నడుమ చలినీ, చీకటినీ లెక్కచేయకుండ పారలతో, కత్తులతో, దంతెలతో శుభ్రపరుస్తున్న  వాట్సాప్ చిత్రాలను గమనించారా?   గంటన్నర కు పైగా కాలుష్యం మీద జరిగిన పెనుగులాటలో ఎప్పటిలాగే స్వచ్చ సైనికులే గెలిచి, అందుకు సాక్ష్యంగా పొగుపడిన పెద్ద తుక్కు గుట్టల్నీ, వాటిని పరిగణిస్తున్న ఒకానొక కర్షక కార్య కర్తను కూడ చూడండి! ఇలా దినదినమూ పోగులు పడుతున్న కలుషిత భారాలను చెత్త కేంద్రానికి తరలించే బాధ్యత ట్రస్టు కార్మికులది!

 

    ఈనాటి గ్రామ శుభ్ర-స్వచ్చ- సౌందర్య సంకల్ప నినాదాలను స్పష్టంగా వినిపించినది-ఒక నిబద్ధ కార్యకర్త శ్రీ గోళ్ల సాంబశివరావు! నేటి కార్యకర్తల శ్రమ విలువను పరిగణించి, గౌరవించి, సమీక్షించి, రేపటి వీధి పారిశుద్ధ్య దిశా నిర్దేశనం చేసినది మన గౌరవ వైద్యులు డాక్టర్ దాసరి రామ కృష్ణ ప్రసాదు గారు!

 

   ఇక మీదట చల్లపల్లి గ్రామ శుచీ - శుభ్రత-భద్రతల బాధ్యతలు మోయనున్న కొత్త పాలక వర్గానికి అభినందనలు, శుభ స్వాగతాలు!  రాబోవు కాలంలో స్వచ్చ కార్యకర్తల, పంచాయతీ బాధ్యుల సమష్టి కృషితో ఈ గ్రామ ఆదర్శవంతమైన స్వచ్చ సుందరీకరణలు వేలాది ఊళ్లకు ఉదాహరణ యోగ్యమౌతాయని మన ఆశంస!

 

రేపటి మన స్వచ్చతా దీక్ష కోసం ఈ బెజవాడ బాటలోనే – విజయా కాన్వెంట్ వద్ద-4.30 కే కలుసుకొందాం!

 

         స్వచ్చోద్యమ మెందుకొరకు?

అసాధ్యమే సుసాధ్యమైన ఆనందాన మునుగుటకో-

విస్తుబోయి చూచుటకో -  ప్రశస్తమనుచు మెచ్చుటకో-

చల్లపల్లి స్వచ్చోద్యమ సంరంభము లేదు సుమా!

ఆచరించు- అనుభవించు అత్యుత్తమ పథము సుమా!

 

నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

18.02.2021.