2129* వ రోజు ....           19-Feb-2021

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

స్వచ్చ-సుందర –చైతన్య చల్లపల్లి ఉద్యమంలో(మరొక) 2129 * వ నాడు.

 

            నేటి (19.02.2021) వేకువ సైతం గ్రామ వీధి పారిశుద్ధ్య సంబరం 4.22 కే మొదలైంది. గ్రామంలోని పలు చోట్ల నుండి, గ్రామాంతరాల నుండి కూడ స్వచ్చంద స్వచ్చ కార్యకర్తలు ఠంచనుగా కాదు-4.30 కన్న ముందే బెజవాడ బాటలోని విజయా విద్యా సంస్థ ఎదుట గుమికూడి, 6.15 దాక నిర్వహించిన గ్రామ సామాజిక బాధ్యతతో రెండు ప్రయోజనాలు సిద్ధించినవి-

 

1) వేల మంది కదలికలు ముమ్మరంగా ఉండే చోట డ్రైనులు శుభ్రపడి, దారి ప్రక్క బురద మట్టి గుట్టలు తొలగి, అన్ని కాలుష్యాలు అదృశ్యమైపోవడం.

 

2) ఈ చెత్త- చెదారాలు డంపింగు కేంద్రానికి చేరి, ముఖ్యంగా మట్టి శ్మశాన అవసరానికి పనికి రావడం! గ్రామస్తుల (హక్కుల్ని కాదు-) బాధ్యతలు ఈ పూట మోసిన స్వచ్చ కార్యకర్తలు 25 మంది.

 

            సోదర గ్రామస్తులు గాని, చల్లపల్లి స్వచ్చోద్యమ అభిమానులు గాని, ఎవరైనా గమనించి, గుర్తుంచుకోదగినవేమంటే- కనీసం వాట్సాప్ మాధ్యమ చిత్రాలలోనైనా సరే ఈ గ్రామ సేవకుల దైనందిన రెండు గంటల నిత్య శ్రమదానాన్ని చూడడం, వీలైతే వేకువనే వచ్చి చూసి, ఊరకే అభినందించడం కాక, అనుసరించడం, అంతిమంగా ఊరి ఉమ్మడి సుఖ సంతోషాలకు కారకులై తరించడం....!

 

- తన ఇంటి, తన వారి బాధ్యతలే కాక, తన ఊరి బాధ్యతలు సైతం సంతోషంగా స్వీకరించిన ఒక గృహిణి ఇంత వేకువ-ఇంత దూరం వచ్చి, విజయా కాన్వెంటు ఎదుట(వాహన కాటాల దగ్గర) గంటకు పైగా చీపురు, దంతెలతో ఎలా ఊడ్చి శుభ్రపరుస్తున్నదో మనం ఆలోచించవద్దా?

 

- కాన్వెంటు గేటు ప్రక్కన, ప్రభుత్వ వైద్యశాల దారి దగ్గర రెండు ట్రాక్టర్లు నిలుపుకొని, 8-9 మంది చొప్పున దారి ప్రక్క ఎండి పడి ఉన్న బురద మట్టిని ప్లాస్టిక్ వంటి దరిద్రాలన్నిటిని ఏరి, రెండు గంటల పాటు డిప్పలతో నింపుకొని, ట్రక్కుల లోని కెక్కించి శ్మశానానికి చేర్చి, మెరక-పల్లాలను సరిజేసే అవసరమేమిటో మిగిలిన గ్రామస్తులం పట్టించుకోవద్దా? (ఈ మట్టిని తస్కరించి వీళ్ల సొంత దొడ్ల మెరకకు వాడడం లేదు సుమా!)

 

- ఇక నర్సులు కొందరు ఆ దరిదాపుల బెజవాడ దారినీ, టీ, టిఫిన్ కొట్ల ముందూ, ఏలిన వారి ఆసుపత్రి దారినీ శుభ్రపరచకపోతే ఇంటి దగ్గర వాళ్లకేమీ పని తోచదా?

 

            సొంత హక్కుల కోసమైతే అందరూ అడుగుతారు. మరి బాధ్యతల- మరీ ముఖ్యంగా గ్రామ సమష్టి బాధ్యతలు పట్టించుకొనే నాథుడెవరు? ఇలాంటి మౌలిక  ప్రశ్నలకు సమాధానంగా ముందుకు ఉరికి వస్తున్న ఈ పాతిక మంది స్వచ్చంద శ్రమదాతలకు అందుకే నా పునః పునరభివందనాలు!

 

అమెరికాలో ఉన్నా సరే- చల్లపల్లి సంక్షేమాన్ని, అందుకు పాటుబడుతున్న సోదర స్వచ్చ సైనికుల్నే నిత్యం సంభావించే నాదెళ్ల సురేష్ ప్రతి కార్యకర్తకూ ఒక ఆరోగ్యదాయకమైన పుస్తకాన్ని బహూకరించారు. వాసన కృష్ణారావు గారు  ప్రగల్భించిన గ్రామ స్వచ్చ-సుందర-పరిశుభ్ర సంకల్ప నినాదాలు ముమ్మారు ఇతర కార్యకర్తలు కూడ బలపరచి, 6.40 కి సంతృప్తి గా అంతా గృహోన్ముఖులయ్యారు- శివరామపురం నుండి ప్రేమానందం తెచ్చిన సొరకాయలతో సహా!

 

రేపటి స్వచ్చంద శ్రమదానం కోసం మరొకమారు 4.30 సమయంలో మనం కలువదగిన చోటు కూడ ఇదే!

 

             వ్యష్టి – సమష్టి

ఎవరు బొత్తిగ కష్టపడనిది? ఈమన సమకాలమందున!

అది కేవల స్వార్థానికొ – పరార్థానికో మనసున?

సమష్టిలోన వ్యష్టి సుఖం సంలీనం కాకుండిన

స్వచ్చ సేన కెందుకింత శ్రమపూర్వక సంవేదన?

 

నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

19.02.2021.